కొల్లాపూర్ టిఆర్ఎస్కు షాకిచ్చిన జూపల్లి

నాగర్‌కర్నూల్ ,జనవరి 17 (ప్రజాతంత్ర విలేకరి): తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్‌ను బుజ్జగించి బరి నుంచి తప్పించాల ని భావిస్తున్న టీఆర్ఎ స్కు ఆ పార్టీకి చెందిన ముఖ్యనేత, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావ్ ఊహించని షాక్ ఇచ్చారు. తన నియోజకవర్గంలోని కొల్లాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 20 మంది స్వతంత్ర అభ్యర్థులకు ఆయన మద్దతు ప్రకటించడం, వారిని గెలిపించాలని ప్రచారం చేయడం కొల్లాపుర్ టీఆర్ఎస్లో కలకలం రేపుతోంది. గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన హర్షవర్ధన్ రెడ్డి టీఆర్ఎస్లో చేరడంతో అక్కడ టీఆర్ఎస్ తరపున అభ్యర్థుల ఎంపిక, వారికి బీఫామ్‌లు ఇచ్చే బాధ్యతను ఆయనకే అప్పగించింది. గులాబీ బాస్ దీనిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జూపల్లి కృష్ణారావ్ ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గం వారిని కొల్లాపూర్‌లోని మొత్తం 20 వార్డుల్లో పోటీకి నిలబెట్టారు.
వారందరినీ ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ తరపున సింహం గుర్తుపై పోటీకి నిలబెట్టిన జూపల్లి కృష్ణారావ్ పట్టణంలో సింహం గుర్తుతో పోటీ చేసే అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. జూపల్లి తీరుపై ఆగ్రహంతో ఉన్న ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి జూపల్లి ఆయన మద్దతుదారులకు ప్రచారం చేస్తున్న ఫోటోలు, వీడియోలను కేటీఆర్‌కు అందించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి గతంలోనే దీనిపై కేటీఆర్‌కు హర్షవర్ధన్ రెడ్డి ఫిర్యాదు చేయగా,రెబల్స్‌ను బరి నుంచి తప్పించాలని మంత్రి కేటీఆర్ జూపల్లిని కోరారు. అయితే నామినేషన్లు ఉప సంహరణ సమయానికి వారితో ఉపసంహరణ చేయిస్తానని చెప్పిన జూపల్లి వారంతా పోటీలో ఉండేలా చేయడం టీఆర్ఎస్లో గుబులు రేపుతోంది.ఏదిఏమైనా జిల్లా లో కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
Tags: municipality election,jupalli krishna rao,tra,trs,telangana