ఉత్తర్వులు జారీచేసిన వైసిపి ప్రభుత్వం
అమరావతి, జూన్ 24 : రాష్ట్రంలోని 2,114 మున్సిపల్ పాఠశాలల అజమాయిషీని పాఠశాల విద్యాశాఖకు అప్పగిస్తూ వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 123 పుర, నగరపాలక సంస్థల్లో కేవలం 59 మాత్రమే మున్సిపల్ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 1942 టీచర్ పోస్టుల ఖాళీలున్నాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మున్సిపల్ స్కూళ్లను పాఠశాల విద్యాశాఖకు బదిలీ చేసింది.
ఈ మార్పుతో ఉపాధ్యాయుల పదోన్నతుల విషయంలో ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లా, మండల పరిషత్ పాఠశాలల్లో అమలు చేస్తున్న విధానాలనే అమలు చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. మున్సిపల్ పాఠశాలల ఆస్తులు, మున్సిపల్ శాఖ ఆధీనంలోనే కొనసాగుతాయని ప్రభుత్వం పేర్కొంది.