విశాఖపై గురిపెట్టిన అధికార వైకాపా, టిడిపి
వోటింగ్ శాతం పెంచేందుకు అధికారుల దృష్టి
ఆంధప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం అన్ని పార్టీలు శ్రమిస్తున్నాయి. రెండోరోజు చంద్రబాబు నాయుడు విశాఖలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా మార్చాలని అనుకుంటున్న సమయంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు కావడంతో విశాఖ ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది అనే దానిపై ఆసక్తి నెలకొన్నది. ఇక జీవీఎంసీలోనే విజయసాయి రెడ్డి ప్రచారం చేస్తున్నారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో విజయం తమదే అని విజయసాయి రెడ్డి ధీమాగా ఉన్నారు. ఇక సోము వీర్రాజు శనివారం కడపలో ప్రచారం చేపట్టారు. ఇదివుంటే మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణి పై ఎస్ఈసి నిఘా పెట్టింది. కోడ్ ఉల్లంఘనలపై పలు ఫిర్యాదులు వస్తున్నాయని ఎస్ఈసి పేర్కొన్నది. విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి కార్పొరేషన్లపై ఎస్ఈసి ప్రత్యేకంగా దృష్టి సారించింది. కార్పొరేషన్ల పరిధిలోని అధికారులతో ఉదయం 11 గంటలకు ఎస్ఈసి నిమ్మగడ్డ టెలి కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు.
ఈనెల 10వ తేదీన నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. ఓటింగ్ శాతం పెంచేందుకు ముందుగా ఓటర్స్లిప్పుల పంపిణీపై ప్రత్యేకంగా దృషి సారించారు. పట్టణ ఓటర్లకు ప్రతి ఒక్కరికీ ఓటరు స్లిప్పు అందించే కార్యక్రమం చేపట్టారు. పలు ప్రాంతాల్లో ఇప్పటికే 50 శాతానికి పైగా ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తయింది. ఓటర్లు తమ పోలింగ్ కేంద్రం వివరాలను వెబ్సైట్లో ’నో యువర్ పోలింగ్ స్టేషన్’ లింకు ద్వారా తెలుసుకోవచ్చన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లోలాగానే మున్సిపల్ ఎన్నికల్లోనూ వలస కూలీలను రప్పించి ఓటుహక్కు వినియోగించుకునేలా చర్యలు చేపడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో చేపట్టిన వినూత్న కార్యక్రమాలద్వారా గతంలో ఎన్నడూ లేనంత గా మున్సిపాలిటీల్లో ఓటింగ్‌శాతం పెరుగుదలను ఆశిస్తున్నారు.