సాయంత్రం వరకు ఫలితాల వెల్లడి
మున్సిపాలిటీల్లో 74.40, కార్పొరేషన్లల్లో 58.83శాతం పోలింగ్
29న కరీంనగర్ మేయర్ ఎన్నిక
27న మున్సిపాలిటీల్లో చైర్పర్సన్లు,
9న కార్పొరేషన్లలో మేయర్ల ఎన్నిక
ఈ నెల 22న ఎన్నికలు జరిగిన మునిసిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో శనివారం కౌంటింగ్ జరుగుతుందని, కౌంటింగ్ కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి వి.నాగిరెడ్డి వెల్లడించారు. సాయంత్రం వరకు అన్నీ మునిసిపాలిటీలు, 9 కార్పొరేషన్ల ఫలితాలు వెల్లడవుతాయని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల అధికారి వి,.నాగిరెడ్డి, పురపాలకశాఖ డైరక్టర్ శ్రీదేవిలు శుక్రవారం ఎన్నికల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఈ విషయాలను వివరించారు. 120 మునిసిపాలిటీల్లో 74.40శాతం, 9 కార్పొరేషన్లలో 58.83శాతం పోలింగ్ జరిగిందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి తెలిపారు. వోట్ల లెక్కింపునకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేశామని, సంబంధిత రిటర్నింగ్ అధికారులకు మార్గదర్శకాలు చేరుకున్నాయని చెప్పారు. ఈ నెల 29న కరీంనగర్ మేయర్ ఎన్నిక ప్రక్రియ ఉంటుందని తెలిపారు. రాజకీయ పార్టీలు కార్పొరేషన్ మేయర్ల, మునిసిపల్ చైర్పర్సన్ల పేర్లను ఏ. ఫారమ్, బీ. ఫారమ్‌ల ద్వారా తెలియచేయాలని స్పష్టం చేశారు.
ఈ నెల 26న ఉదయం 11గంటలవరకు ఏ.ఫామ్, 27న 10గంటలవరకు బీ.ఫామ్ సంబంధిత రిటర్నింగ్ అధికారులకు అందచేయాలని చెప్పారు. విప్ పేరును రాజకీయ పార్టీలు 26న ఉదయం 11గంటలవరకు తెలియచేయాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం ఆదేశాల్లో పేర్కొన్నారు. 120 మునిసిపాలిటీల్లో, 9 కార్పొరేషన్లలో 27వ తేదీన మేయర్, చైర్మన్ల ఎన్నికల పూర్తయ్యేవరకు ఎన్నికలకోడ్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. రీపోలింగ్ నిర్వహిస్తున్న మహబూబ్‌నగర్ 41వ వార్డులో, బోధన్‌లో 32వ వార్డులో, కామారెడ్డిలో 41వ వార్డులో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. నోటిఫికేషన్ ప్రకారం శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, రాజ్యసభ, లోకసభ సభ్యులు తమ తమ నియోజకవర్గం పరిధిలోని ఏదేని మునిసిపాలిటీలో వోటు హక్కు వినియోగించుకోవచ్చునని, ఆ విషయాన్ని ఎన్నికల సంఘానికి తెలియచేయాలని ప్రధానాధికారి నిబంధనలను వివరించారు. వీరిని ఎక్స్ ఆఫిసియో సభ్యులుగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. మేయర్, చైర్పర్సన్ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందని చెప్పారు. పార్టీలు విప్ జారీ చేయవచ్చునని, విప్ అధికారం ఎవరికి ఇచ్చారనే విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియచేయాలని చెప్పారు.
స్పెషల్ మోడల్‌కోడ్ శనివారం నుంచి అమలులో ఉంటుందని ఎన్నికల సంఘం ప్రధానాధికారి స్పష్టం చేశారు. కాగా కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో మధ్యాహ్నం 2 గంటలవరకు 51.60 శాతం పోలింగ్ జరిగిందని తెలిపారు. కౌంటింగ్ జరుగుతున్న ప్రాంతంలోకానీ, ఇతర ప్రాంతాల్లో కానీ పదవులు ఇస్తామని ప్రలోభపెట్టవదని, ప్రలోభాలకు గురి చేస్తే ఎన్నికల నిబంధనల ప్రకారం శిక్షార్హులవుతారని నాగిరెడ్డి హెచ్చరించారు. ఫలితాలు వెల్లడయ్చే వరకు ఫలితాలపై పందెం కాయడం కూడా నేరమే అవుతుందని చెప్పారు. మంత్రి గంగుల వివాదం.. వ్యాఖ్యపై కామెంట్ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలు నిజమని తేలితే ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం శిక్షార్హులవుతారని స్పష్టం చేశారని, గంగుల కమలాకర్ అందరూ కారు గుర్తు వోటు వేశారని బహిరంగంగా పోలింగ్‌స్టేషన్ సమీపంలో వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన వార్తలపై స్పందించాలని విలేఖరులు ప్రశ్నించగానే తప్పకుండా విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. ఎన్నికల నిబంధనావళి ఎంతస్థాయి వ్యక్తులకైనా వర్తిస్తుందని స్పష్టం చేశారు.