Take a fresh look at your lifestyle.

ముందస్తుకు రాజబాట… సామాజిక సమీకరణలకు పెద్దపీట.!

ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం మంత్రి వర్గాన్ని పునర్‌ ‌వ్యవస్థీకరించిన నేపథ్యంలో కొత్త కేబినెట్‌ ‌కూర్పులో బీసీలు, మైనార్టీలు, దళితులకు ఎక్కువ మంత్రి పదవులు కట్టబెట్టి జగన్‌ ‌దార్శినికత నిరూపించుకున్నారు.ఇందులో భాగంగా రాష్ట్రంలో కులాల ప్రాతిపదికన కొందరు అనర్హులకు కూడా ప్రాధాన్యం ఇచ్చిన్నారనే చర్చ జరుగుతోంది.దీనితో కొంత మంది ఎమ్మెల్యేలు అంతర్గతంగా రగిలిపోతున్నారు. సామాజిక సమీకరణల నేపథ్యంలో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎంపికైన వారికి కూడా మంత్రి పదవి దక్కిందనే ప్రచారం ఊపందుకుంది. ముందస్తు ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో ఉన్న అసంతృప్తిని పసిగట్టి  ఎవరు పార్టీకి ఉపయోగపడుతారు? ఎవరి అనుభవాలు పాలనకు ఉపయోగ పడుతాయన్న కోణంలో ఆచితూచి మంత్రివర్గాన్ని  ఏర్పాటు చేసారు.కేబినెట్‌ ‌మొత్తాన్ని తొలగిస్తే సమస్య  వస్తుందని పసిగట్టి అందులో జిల్లా     ప్రాతినిథ్యం ,అనుభవం పేరిట మంత్రులకు  మళ్లీ అవకాశం కల్పించినారు.అధినేత మెప్పు పొందేందుకు 40 సంవత్సరాలుగా రాజకీయ అనుభవం ఉన్న ప్రతిపక్షనేతపై అనుచిత వ్యాఖ్యలు, ప్రతిపక్ష పార్టీలపై దుర్భాష తో తీవ్ర విమర్శలు చేసిన మంత్రులకు స్థానచలనం కారణం అయ్యిందని విశ్లేషకులు భావించిన, కొత్త క్యాబినెట్‌ ‌కూర్పులో నొటి దురుసు అర్హతగా కొందరికి మంత్రి పదవులు కట్టబెట్టినట్లు అసమ్మతి నేతలు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు.

2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌ ‌నాయకత్వంలోని ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ కొరకు అమరావతిని కేవలం శాసన రాజధానిగా పరిమితం చేసి, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ప్రకటించింది. దీనిలో భాగంగా రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ బిల్లును రద్దు చేశారు. దీనిని అమరావతికి భూములిచ్చిన రైతులు,అమరావతి ప్రాంతపు ప్రజలు వ్యతిరేకించి ఉద్యమం చేపట్టారు, న్యాయం కొరకు కోర్టు మెట్లెక్కారు. దీనిపై ఏపీ హైకోర్టు తొలిదశలో ప్రభుత్వ శాసన ఉత్తర్వుల అమలుపై తాత్కాలిక నిరోధం విధించింది. 2022 మార్చి 3 నాడు ఉన్నత న్యాయస్థానం త్రిసభ్య ధర్మాసనం, రాజధాని వికేంద్రీకరణ చెల్లదని, అమరావతి రాజధానినే అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వాన్ని,రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థని ఆదేశిస్తూ తీర్పు చెప్పింది. ఇటీవలి కాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెలువడుతున్న కోర్టు తీర్పులు, ఆర్ధిక ఇబ్బందులు, ఒకవైపు  క్యాబినెట్‌ ‌లో మార్పులు చేర్పులపై అసమ్మతి పెరిగి అంతర్గత కుమ్ములాటలతో, మూడు సంవత్సరాల పాలనలో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోయే అవకాశం ఉందని, టీడీపీ జవసత్వాలు కూడ దీసుకునేలోపు ముందస్తు ఎన్నికలకు వెళితే విజయం సాధించ వచ్చుననే పార్టీ ప్రముఖుల భావనగా ఉందంటున్నారు. సీఎం జగన్‌ ఇం‌త అకస్మాత్తుగా పార్టీపై దృష్టిపెట్టడంతో ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారా? అనే ఊహాగానాలకు బలంగా ఊతమిస్తోంది. గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇదే ఫార్ములా అమలు చేసి సక్సెస్‌ అయ్యారనేది యధార్థం.

సీఎం జగన్‌ ‌ముందస్తు 2023లో ఎన్నికలకు వెళ్ళవచ్చుననే ఊహాగానాలు రాష్ట్రంలో జోరందుకున్నాయి. తెలుగు దేశం పార్టీని  గద్దె దించడానికి ఎంతో యాక్టీవ్‌ ‌గా ఉన్న వైసీపీ అనుబంధ సంఘాలు వైసీపి ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత కాలంలో అనుబంధ సంఘాలు పూర్తిగా స్తబ్దంగా మారిపోయాయి. దీనంతటికీ కారణం లేకపోలేదు… ఆయా ప్రాంతాలలో గెలిచిన ఎమ్మెల్యేలు,ఎంపీలు ద్వీతీయ శ్రేణి నాయకులుగా పరిగణన లోకి తీసుకోకుండా, పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలూ ఉన్నాయి.నాయకులు తమ అనుచరులకు బంధువులకు ఇస్తున్న ప్రాధాన్యతలో అనుబంధ సంఘాల నాయకులను పట్టించు కోవడం లేదనేది వారి భావన. పదవుల మీద మోజుతో వైసీపీ అనుబంధ సంఘాలను పూర్తిగా కాడివదిలేశాయనే చెప్పాలి. అనుబంధ సంఘాలకు పునర్జీవం పోసేందుకు పార్టీలో సమర్ధవంతమైన నాయకుడు క్యాడర్‌ ‌లో మనోస్థైర్యం నింపగలిగిన ఎం.పి. విజయసాయిరెడ్డి ఐతేనే అనుబంధ సంఘాలకు జవజీవాలు అందించ గలుగుతాడని ఉత్తరాంధ్ర బాధ్యుడిగా, రాజ్య సభ్యుడైన ఆయనను ఇప్పుడు పార్టీ అన్ని అనుభంధ విభాగాల ఇన్ఛార్జ్ ‌గా నియమించడంతో జగన్‌ ‌పార్టీపై దృష్టి పెట్టినట్లు స్పష్టం అవుతుంది.ముందస్తుకు పోతాడనే సంకేతాలు పార్టీ చేపట్టిన కీలక నియామకాలతో ఊతం ఇస్తున్నాయి. 2024 ఎన్నికలకు అడుగులు వేస్తున్న సీఎం జగన్‌ .. ‌ప్రస్తుతం కొత్త కేబినెట్‌ ‌కూర్పు పైన ఆచితూచి అడుగులు వేస్తున్నారు. జిల్లాలు, సామాజిక – ప్రాంతీయ సమీకరణాలతో పాటుగా అనుభవం- జూనియర్లు కలగలిపి తన ఎలక్షన్‌ ‌కేబినెట్‌ ఉం‌డాలని భావించినట్లే మంత్రి మండలి ఏర్పాటు జరిగింది.

చివరి నిమిషం వరకు ఉత్కంఠ భరితంగా మారింది. తప్పించిన సీనియర్లకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తారా ? పక్కకు పెడుతారా? అనేది తెలియాల్సి ఉంది. మొత్తం జూనియర్లు అయితే ప్రభుత్వ పాలన ఎన్నికల సమయంలో కష్టంగా మారుతుందనే అభిప్రాయానికి వచ్చి, ఈ కేబినెట్‌ ‌లో జూనియర్లు ,సీనియర్లు కలిపి  ఎస్సీ – ఎస్టీ- బీసీ వర్గాలకు ప్రాధాన్యత పెంచి కూర్పు జరిగిందని చెబుతున్నారు.అధినేత మెప్పుకోసం ప్రతి పక్షాలపై నోటి దురుసు ప్రదర్శించిన మంత్రులకు మళ్ళి అవకాశం దక్కలేదు.నష్టాన్ని సరిదిద్దే పనిలో జగన్‌ ‌నిమగ్నం అయినారు.అదే పనిగా చివరి నిమిషంలో అనూహ్య మార్పులు క్యాబినెట్‌ ‌పునర్వ్యవస్థీకరణతో వైసీపీ ఎమ్మెల్యేలు షాక్‌లకు గురి కావాల్సి వచ్చింది. అన్ని సద్దుమ నిగి.. సక్రమంగా జరిగితే తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసీఆర్‌ ‌మంత్రివర్గ విస్తరణ జులై లోపు జరుగుతుందని  రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం..

– డా. సంగని మల్లేశ్వర్‌,‌జర్నలిజం విభాగాధిపతి,
కాకతీయ విశ్వవిద్యాలయం,వరంగల్‌,‌సెల్‌ -9866255355.

Leave a Reply