టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మునిసిపల్, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్)పుట్టిన రోజు మరో హరిత పండుగకు వేదిక కానున్నది. ఒకే రోజు ఒకేగంటలో ముక్కోటి వృక్షార్చనతో సరికొత్త రికార్డు దిశగా అడుగుపడనున్నది. గ్రీన్ ఇండియా చాలెంజ్ చేపట్టబోయే ముక్కోటి వృక్షార్చన పోస్టర్‌ను బుధవారమిక్కడ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావుతో కలిసి రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌రావు ఆవిష్కరించారు. ఈనెల 24న టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టినరోజు పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ చేపట్టబోయే ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం జరగనున్నది.
ఈ నేపథ్యంలో పోస్టర్‌ను మంత్రి హరీష్‌రావు ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా ఆయన అడుగుజాడల్లో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంలో కీలకపాత్ర పోషిస్తున్న మంత్రి కేటీఆర్ పుట్టినరోజున ముక్కోటి వృక్షార్చనను నిర్వహించడాన్ని చాలెంజ్‌గా తీసుకుంటున్నామని ఎంపి సంతోష్‌కుమార్ ఇది వరకే ప్రకటించిన విషయం విధితమే.