Take a fresh look at your lifestyle.

ముంబై నుంచి వచ్చి హైదరాబాద్ లో చిక్కుకున్న పెళ్లి బృందం

  • ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్న 20మంది
  • అష్ట కష్టాలు పడుతున్నామంటున్న పెళ్లి బృందం
ముషీరాబాద్, మే 03 (ప్రజాతంత్ర ప్రతినిధి) : బంధువుల పెళ్లికి వచ్చిన ముంబాయికి చెందిన 20 మంది లాక్ డాన్ లో అష్టకష్టాలు పడుతున్నారు. గత 40 రోజులుగా ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నారు. తాము అంతా ముంబాయికి వెళతాం, మాకు రవాణా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వానికి వేడుకుంటున్నారు. ముషీరాబాద్ కు చెందిన ఓ పెళ్లి బృందం ముషీరాబాద్ పార్సిగుట్ట ప్రాంతానికి చెందిన సత్యనారాయణ, సృజన దంపతుల కుమార్తె పుష్ప వివాహం శ్రీనివాస్ తో నిశ్చయమైంది. మార్చి 19న ముషీరాబాద్ రాజా డీలక్స్ చౌరస్తా వద్ద గల హెరిటేజ్ ఫంక్షన్ హాల్ లో వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి సత్యనారాయణ బంధువులు ముంబాయిలోని అంధేరి ప్రాంతం నుంచి మార్చి 14వ తేదీన ముషీరాబాద్ కు 30 మంది రైలులో వచ్చారు. వివాహం జరిగిన రోజే రాత్రి 10 మంది రిజర్వేషన్ టికెట్ పై తిరిగి ముంబాయికి వెళ్లిపోయారు. మరో 20 మంది ముంబాయి వెళ్లేందుకు మార్చి 23న రిజర్వేషన్ చేయించుకున్నారు. అయితే 22 నుంచి లాడాన్ ప్రారంభం కావడంతో రైలు టికెట్ రిజర్వేషన్ క్యాన్సల్ అయ్యింది. ముంబాయికి ఎప్పుడు వెళ్తామని ఎదురుచూస్తున్న 20 మంది ఉండడానికి సరైన ఇల్లు లేకపోవడంతో ముషీరాబాద్ శివాలయం చౌరస్తా వద్ద ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. గత 40 రోజులుగా ఇక్కడే అష్టకష్టాలు పడుతూ నివసిస్తున్నారు.
తిండికి సహితం ఇబ్బందులు ఏర్పడుతుండడంతో ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్ బి. శంకర్ లూక్ నిత్యావసర సరుకులను వారికి అందజేశారు. పలుమార్లు వారు ముంబాయికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ ఎవరు సహకరించకపోవడంతో అక్కడే ఉంటున్నారు. దీనికి తోడు ప్రభుత్వం మూడు సార్లు లాక్ డౌన్ పొడిగించడంతో ఉండడానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వారు వాపోయారు. 20 మందిలో ముగ్గురు పిల్లలు, 11 మంది వృద్ధులు ఉన్నారని, తమ వద్ద ఉన్న డబ్బులు సహితం అయిపోయాయని తెలిసిన వారి వద్ద డబ్బులు తీసుకుని తమ అవసరాలు తీర్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంబాయి వెళ్ళిందుకు ట్రావెల్స్ వారిని అడిగితే రూ. 70 వేలు ఇవ్వమని అడుగుతున్నారని, అది కూడా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని వస్తేనే అప్పుడే తాము వస్తామని ట్రావెల్స్ వారు సూచించారని ఆవేదన వ్యక్తం చేశారు. అంత డబ్బు తమ వద్ద లేదని, కనీసం తిండి తినడానికి కూడా డబ్బులు లేవని వారు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మానవత్వంతో స్పందించి తమను ముంబాయికి పంపించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply