- ఆందోనను విరమించి గ్రామాలకు వెళ్లండి
- కొత్త సాగు చట్టాలకు అవకాశం ఇవ్వండి
- ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉంది
- రాజ్యసభలో రైతులకు ప్రధాని మోడీ విజ్ఞప్తి
- ఎఫ్‌డిఐలతో దేశ ప్రగతి సాధ్యం..అందుకే ఆహ్వానిస్తున్నామని వెల్లడి
ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, న్యూ దిల్లీ: ఎంఎస్పి కొనసాగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్లో ప్రకటించారు. కొత్త వ్యవసాయ చట్టాలకు ఓ అవకాశం ఇవ్వాలని, రైతులు తమ నిరసనను అంతం చేయాలని ప్రధాని కోరారు. నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు తమ ఆందోళనను విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధాని మోడీ తన ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉన్నదని పునరుద్ఘాటించారు. రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ప్రసంగానికి.. ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగం చేస్తూ సోమవారం కొత్తగా ఆమోదించిన వ్యవసాయ చట్టాలకు రైతులు ఓ అవకాశం ఇవ్వాలని పిలుపుయిచ్చారు. ఎంఎస్పి వ్యవస్థ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. నిరసనలో ఉన్న రైతులు తిరిగి తమ గ్రామాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేస్తూ, ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు.
దేశంలోకి ఎఫ్‌డిఐలను ఆహ్వానించటం అవసరమని, దాని వలన దేశ ప్రగతి సాధ్యమవుతుందని అన్నారు. మరో రకం ఎఫ్‌డిఐ ఫారిన్ డిస్ట్రక్టివ్ ఐడియాలజీ దేశంలోకి దిగుమతి అవుతున్నదని అన్నారు. ఇది దిగుమతి కాకుండా చూసుకోవాలని వ్యంగ్యంగా విమర్శించారు. ‘విదేశీ విధ్వంసక భావజాలం’ అంటూ నేడు దేశంలో కొనసాగుతున్న ఆందోళనలను అభివర్ణించారు. ఇది విధ్వంసమని దీనినుంచి దేశాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని ప్రధాని అన్నారు. ‘‘దేశం పురోగతి సాధిస్తోంది కనుక మేము ఎఫ్‌డిఐలను స్వాగతిస్తున్నాం.. అయితే నేడు ఓ కొత్త రకం ఎఫ్‌డిఐ తెరపైకి రావటం చూస్తున్నాను. ఈ కొత్త ఎఫ్‌డిఐ నుండి మన దేశాన్ని మనం రక్షించుకోవాలి. మనకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అవసరం, ఆదే సమయంలో ఈ కొత్త రకం ఎఫ్‌డిఐ నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి, ’’అని ప్రధాని మోడీ అన్నారు.
కేంద్రం తీసుకు వొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకతకు అర్థం లేదని, ఇంతకు ముందు ప్రభుత్వాలు చేయాలనుని దశాబ్దాలుగా మురుగబెట్టిన సంస్కరణలు తన ప్రభుత్వం చేస్తున్నదని మోడీ అన్నారు. తన ప్రభుత్వం చిన్న రైతుల కోసం పనిచేస్తుందని పునరుద్ఘాటిస్తూ, 2014 నుండి రైతుకు సాధికారత కల్పించే లక్ష్యంతో వ్యవసాయ రంగంలో మార్పులను తీసుకురావటం ప్రారంభించిందని మోడీ తెలిపారు. మన్మోహన్ జీ ఇక్కడ ఉన్నారు, నేను ఆయనను కోట్ చదువుతాను అంటూ….. వ్యవసాయ చట్టాలపై యు-టర్న్ తీసుకున్న వారు తనతో ఏకీభవించకపోయినా బహుశా మన్మోహన్ జీతో ఏకీభవిస్తారనుకుంటున్నానని ప్రధాని తెపారు. ‘‘1930 లలో ఏర్పాటు చేసిన మార్కెటింగ్ వ్యవస్థ, ఇతర అడ్డంకులు మన రైతులు తమ ఉత్పత్తులను స్వేచ్ఛగా అమ్ముకోలేకుండా చేస్తున్నాయి. రైతులు అత్యధిక రాబడి పొందే అవకాశం వుంది.
భారత దేశంలో ఒక పెద్ద ఉమ్మడి మార్కెట్ ఏర్పాటు చేసి విస్తారమైన సామర్థ్యాన్ని సాధించి, రైతుల ముందు ఉన్న అడ్డంకులు తొలగించడం మా ఉద్దేశం,’’ అని మన్మోహన్ సింగ్ గతంలో అన్నారంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాత ప్రసంగంలోని ఓ అంశాన్ని ప్రధాని మోడీ చదివి వినిపించి రాజ్యసభలో కాంగ్రెస్‌ను నిలదీసే ప్రయత్నం చేసారు. ‘‘మోడీ మన్మోహన్ సింగ్ కలను అమలు చేస్తున్నారని కాంగ్రెస్ గర్వపడాలి’’ అని ప్రధాని అన్నారు. మాజీ వ్యవసాయ మంత్రి శరద్ పవార్ మాత్రమే కాదు మునుపటి కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యవసాయ సంస్కరణలకు ఏదో ఒక రూపంలో మద్దతు ఇచ్చి అమలు చేశాయని ఆయన గుర్తు చేసారు. శరద్ పవార్ సహా కాంగ్రెస్ నుండి వొచ్చిన ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ప్రభుత్వాల హయాంలో వ్యవసాయ సంస్కరణల కోసం నిలబడ్డవారేనని మోడీ అన్నారు. వారు దీన్ని చేయగలి ఉండి కూడా చేయకుండా తాత్సారం చేస్తే…తాను చేశాననని ప్రధాని మోడీ అన్నారు.
ప్రధానమంత్రి భారతదేశాన్ని ‘‘ప్రజాస్వామ్య తల్లి’’ అని అభివర్ణించారు. పార్లమెంటు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ముగించే సమయంలో మహమ్మారిని ఎదుర్కొన్న ఘనత పౌరులకు చెందుతుందే తప్ప తన ప్రభుత్వానిది కాదని అన్నారు. మహమ్మారిని ఎదుర్కోవడంలో భారత దేశం చూపిన సామర్థ్యాన్ని ప్రపంచం గుర్తించిందని ఆయన అన్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్• కోవింద్ ప్రసంగాన్ని బహిష్కరించిన ప్రతిపక్షాల గురించి మాట్లాడుతూ ‘‘ప్రతిపక్షాలు రాష్ట్రపతి ప్రసంగం విన్నట్లయితే బాగుండేది. ఆయన ప్రసంగం వినకుండా, ప్రతిపక్షాలు చాలా విమర్శలు చేసాయి’’ అని అన్నారు. వామపక్షాల గురించి మాట్లాడుతూ తమ కాళ్ళ మీద తాము నిలబడి ఓ ఆందోళన చేయలేని లెఫ్ట్ ఎక్కడ ఆందోళన జరిగితే అక్కడికి వెళ్లి పరాన్న జీవిగా బతుకుతుందని ఎద్దేవా చేసారు. లెఫ్ట్‌ను ఆందోళనా జీవి లేదా పరాన్న జీవి అని అభివర్ణిస్తూ.. నేడు దేశం ఆందోళనకారుల నుంచి తనను రక్షించుకోవలసి వుందని ప్రధాని అన్నారు.