Take a fresh look at your lifestyle.

ఎం‌పీ రేవంత్‌.. ‘‌పట్నం గోస’!

Mp revanth reddy Patna ghosha

  • సీఎం కేసీఆర్‌ ‌వాగ్దానాలన్నీ నీటి మూటలేనని విమర్శ
  • పెండింగ్‌ ‌సమస్యలపై ప్రజలతో ఎంపీ రేవంత్‌ ‌రెడ్డి  ముఖాముఖి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి కౌంటర్‌గా మల్కాజ్‌గిరి ఎంపి రేవంత్‌ ‌రెడ్డి పట్నం గోస పేరుతో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగరాలు, పట్టణాలలో పేరుకు పోయిన పెండింగ్‌ ‌సమస్యల పరిష్కారం లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టగా, ఎంపీ రేవంత్‌ ‌రెడ్డి సీఎం కేసీఆర్‌ ఇచ్చిన వాగ్దానాల అమలులో నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతూ అవే సమస్యలతో ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. ఐదు రోజుల పాటు మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రస్తుతం గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌ప్రజలు ఎదుర్కొంటున్న అత్యంత ప్రాధాన్యత గత సమస్య డబుల్‌ ‌బెడ్‌రూం ఇళ్లనీ, మొదటి విడత పట్నం గోస కార్యక్రమంలో దీనినే ప్రధానాంశంగా తీసుకున్నారు. పట్నం గోస కార్యక్రమంలో భాగంగా రోజుకో నియోజకవర్గంలో పర్యటించి డబుల్‌ ‌బెడ్‌రూం ఇళ్లను పరిశీలించడం, లబ్దిదారులతో సమావేశాలు, శిలాఫలకాలు వేసినా ఇంకా పనులు ప్రారంభం కాని వాటిని ఎందుకు ప్రారంభించలేదనే దానిపై అధికారులను అడిగి తెలుసుకోవడం ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్నారు. ప్రతీ చోట టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చెబుతన్న పట్టణ ప్రగతి డొల్లదనంతో పాటు ఆ ప్రగతి నిజ స్వరూపాన్ని బయటపెట్టేందుకు క్షేత్ర స్థాయిలో పర్యటించడమే ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమానికి ఎంపీ రేవంత్‌ ‌రెడ్డి రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా గతంలో డబుల్‌ ‌బెడ్‌రూం ఇళ్లను ఇస్తానని సీఎం కేసీఆర్‌ ‌నేరుగా వెళ్లి హామీ ఇచ్చిన అల్వాల్‌ ‌భూదేవి నగర్‌ ‌ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. భూదేవి నగర్‌ ‌గుడిసెల నుంచి పట్నం గోస ప్రగతికి శ్రీకారం చుట్టిన రేవంత్‌రెడ్డి ఆరేళ్లయినా డుబల్‌ ‌బెడ్‌ ‌రూం ఇళ్ల జాడేదని ప్రశ్నించారు. ఇళ్లు లేని పేదలకు డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇళ్లను ఇవ్వని పక్షంలో ఓట్లు అడగనని వాగ్దానం చేసిన పెద్ద మనిషి రెండో సారి అధికారం చేపట్టి ఏడాది దాటినా ఆ ఊసే ఎందుకు ఎత్తడం లేదని నిలదీశారు. పట్టణ ప్రజలను మరోసారి మోసగించేందుకే కేసీఆర్‌ ‌పట్టణ ప్రగతి పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారని విమర్శించారు.

రాజకీయ కోణంలోనే కేసీఆర్‌ ‌కార్యక్రమాలు చేపడతారనీ, ఆయన చేపట్టే ప్రతీ కార్యక్రమం వెనక రాజకీయ స్వార్థమే ఉంటుందని ఆరోపించారు. హైదరాబాద్‌ ‌నగర ప్రజలకు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన వాగ్దానాల అమలులో నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ ప్రజలను ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తున్నదో వివరిస్తున్నారు. కాంట్రాక్టర్లకు బకాయి ఉన్న రూ. 900 కోట్లను చెల్లించకపోవడంతో వారు డబుల్‌ ‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాన్ని మధ్యలోనే వదిలేశారని పేర్కొంటున్నారు. హైదరాబాద్‌ ‌నగర పరిధిలో లక్ష బెడ్‌ ‌రూంలను నిర్మించి ఇస్తామని చెప్పిన పెద్ద మనిషి ఇప్పటి వరకు కేవలం రెండొందల లోపే పూర్తి చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ‌సొంత నియోజకవర్గమైన ఎర్రవల్లి, చింతమడకకు ఇచ్చినట్లుగానే అన్ని గ్రామాలకు నిధులు ఇవ్వాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు. త్వరలో గ్రేటర్‌ ‌హైదరాబాద్‌లో జరుగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజలను మోసం చేయడం తప్ప ప్రజలకు లబ్ది చేకూర్చాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఏమాత్రం లేదని రేవంత్‌ ‌రెడ్డి స్పష్టం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ‌పాలనలో మురికివాడల నిలయంగా హైదరాబాద్‌ ‌మహానగరం మారిందనీ, సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్‌ ‌సైతం ఐదేళ్లలో అనేక సందర్భాలలో హైదరాబాద్‌ను స్లమ్‌లెస్‌ ‌సిటీగా మారుస్తామని గొప్పలు పలికారనీ, ఆ గొప్పలు ఇప్పుడేమయ్యాయని నిలదీశారు. కాగా, మంగళవారం మల్కాజ్‌గిరి పార్లమెంటు పరిధిలోని మల్కాజ్‌గిరి అసెంబ్లీ నియోజకవర్గంలో రేవంత్‌ ‌రెడ్డి ప్రారంభించిన పట్నం గోస కార్యక్రమం ఆ తరువాత కుత్బుల్లాపూర్‌, ‌కూకట్‌పల్లి, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, ‌సికింద్రాబాద్‌, ‌కంటోన్మెంట్‌, ‌మేడ్చల్‌ అసెంబ్లీ నియోజకవర్గాలలో కొనసాగనుంది.

Leave a Reply