- 14 రోజుల రిమాండ్..చర్లపల్లి జైలుకు తరలింపు
- కేటీఆర్ ఫామ్‌హౌస్ వద్ద అనుమతి లేకుండా డ్రోన్ కెమెరా వినియోగించారని కేసు
టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్, మల్కాజ్గిరి ఎంపి ఎ.రేవంత్ రెడ్డిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ నుంచి ఆయన హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా, ఎస్వోటి పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. రేవంత్ రెడ్డిని ఉప్పరపల్లిలోని సంజీవనిహిల్స్ హైదర్‌గూడలో ఉన్న న్యాయమూర్తి ఎదుట హాజరుపరుచగా ఆయన 14 రోజుల రిమాండ్ విధించారు. కేటీఆర్ ఫామ్ హౌస్‌ను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారన్న అభియోగంతో ఆయనతో పాటు అరెస్టు చేసినట్లు సమాచారం. ఇదే అభియోగంతో రేవంత్ నలుగురు అనుచరులను కూడా పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.
నాలుగు రోజుల క్రితం జీవో నం.111 అతిక్రమించి గండిపేట శివార్లలో కేటీఆర్ ఫామ్ హౌస్ నిర్మించారని ఎంపి రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధుల సమక్షంలో ఆరోపించారు. ఈ సమయంలో కేటీఆర్ ఫామ్ హౌస్‌ను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారని రేవంత్ సహా మరో 8 మందిపై నార్సింగి పోలీసులు ఐపీసీ 184, 187, 11 రెడ్ విత్ 5ఏ, ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. ఎంపీ రేవంత్ రెడ్డిని నార్సింగి పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ నుంచి వైద్య పరీక్షల నిమిత్తం గోల్కొండ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు.
అరెస్టును ఖండించిన పీసీసీ
టీ పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్టును టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ పార్టీ నేతలు షబ్బీర్ అలీ, సంపత్, మల్లు రవి ఖండించారు. అక్రమాలను ప్రశ్నిస్తే అరెస్టులకు పాల్పడుతున్నారనీ, తెలంగాణలో నియంత పాలన నడుస్తున్నదని విమర్శించారు. పాలకుల నిరంకుశ విధానాలను ప్రజాస్వామిక వాదులు, విద్యావంతులు ఆలోచించాలనీ, ఇలాగే దుర్మార్గపు పాలన కొనసాగితే ఎవరూ మాట్లాడలేరనీ, కల్వకుంట్ల అప్రజాస్వామిక పాలనపై కలసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఆయనే స్టేషన్‌కు వచ్చారు
అయితే, ఎంపీ రేవంత్ రెడ్డిని తాము పోలీస్‌స్టేషన్‌కు పిలవలేదనీ, తానంతట తానే పోలీస్ స్టేషన్‌కు వచ్చారని నార్సింగి పోలీసులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఆయన డ్రోన్ కెమెరాను వినియోగించారని ఇది నిబంధనలకు విరుద్ధమని నార్సింగి పోలీసులు పేర్కొన్నారు.