Take a fresh look at your lifestyle.

సినిమా నటుడు ప్రభాస్ 1650 ఎకరాల అటవీ భూమి దత్తత

  • ఎంపీ సంతోష్ కుమార్ చొరవ
  • ఔటర్ రింగ్ రోడ్డు వెంట అందుబాటులోకి రానున్న మరో అర్బన్ ఫారెస్ట్ పార్క్

1650 ఎకరాల అర్బన్ రిజర్వ్ ఫారెస్ట్ ను సినిమా నటుడు ప్రభాస్ దత్తత తీసుకుని అభివృద్ది చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో ఔటర్ రింగ్ రోడ్డు వెంట దుండిగల్ పరిసర ప్రాంత వాసులకు మరో అర్బన్ ఫారెస్ట్ పార్కు, ఎకో టూరిజం కేంద్రం అందుబాటులోకి రానుంది. స్వయంగా ఖాజిపల్లి అటవీ ప్రాంతానికి వచ్చిన ప్రభాస్, తన దత్తత విషయాన్ని ప్రకటించారు. అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ తో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి, పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అటవీ ప్రాంతంలో కలియ తిరుగుతూ అర్బన్ పార్క్ మోడల్, ఏర్పాట్లపై ఆరా తీశారు. జువ్వి, కుసుమ, రావి మొక్కలు నాటడంతో పాటు, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వాచ్ టవర్ పై నుంచి అటవీ అందాలను వీక్షించారు.

సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ స్ఫూర్తితో, పర్యావరణ మేలు కోసం తన వంతు సామాజిక బాధ్యతగా రిజర్వు అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా ప్రభాస్ ప్రకటించారు. అటవీ ప్రాంతం అభివృద్ది కోసం అయ్యే ఖర్చును తాను భరిస్తానని ప్రభాస్ వెల్లడించారు. ముందస్తుగా రెండు కోట్ల రూపాయల చెక్కును ప్రభుత్వానికి అందించారు. మిగతా మొత్తాన్ని దశల వారీగా ఇస్తానని తెలిపారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం, దుండిగల్ మధ్య ఖాజిపల్లి రిజర్వు అటవీ ప్రాంతం ఉంది. ఈ అటవీ ప్రాంతం అంతా ఔటర్ రింగు రోడ్డు పక్కనే విస్తరించి ఉంది. చుట్టు పక్కల అభివృద్ది చెందిన నివాస కాలనీలు, పారిశ్రామిక కేంద్రాలు ఉన్నాయి. అటవీ ప్రాంతంలో కొంత భాగాన్ని అర్బన్ పార్కుగా అందుబాటులోకి తేవటంతో పాటు, మిగతా ప్రాంతాన్ని కన్జర్వేషన్ జోన్ గా అభివృద్ది చేయాలని నిర్ణయించారు.

కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పీసీసీఎఫ్ ఆర్. శోభ, పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం. డోబ్రియల్, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం. హనుమంతరావు, ఎస్పీ చంద్రశేఖర రెడ్డి, జిల్లా అటవీ అధికారి వెంకటేశ్వర రావు, అటవీ, రెవెన్యూ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply