Take a fresh look at your lifestyle.

అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు

జిఓ 317 ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఈరోజు(బుధవారం) ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ ‌లో  నిర్వహించ తలపెట్టిన మహా ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

ఉదయమే వివిధ జిల్లాల నుండి ధర్నా చౌక్‌ ‌వద్దకు చేరుకున్న యుయస్పీసీ స్టీరింగ్‌ ‌కమిటీ సభ్యులు, వేలాది మంది ఉపాధ్యాయులను బలవంతంగా అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. మహిళా ఉపాధ్యాయులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. అరెస్ట్ అయిన ఉపాధ్యాయులు  యుయస్పీసీ స్టీరింగ్‌ ‌కమిటీ సభ్యుల నేతృత్వంలో ఆయా పోలీసు స్టేషన్లలోనే తమ నిరసనను కొనసాగించారు. ఉపాధ్యాయుల పోరాటానికి సంఘీభావం తెలిపేందుకు ధర్నా చౌక్‌ ‌వద్దకు వచ్చిన ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ని సైతం అరెస్ట్ ‌చేసి చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌ ‌కు తరలించారు.
ఉదయం 11.00 గంటల సమయంలో యుయస్పీసీ స్టీరింగ్‌ ‌కమిటీ సభ్యులు కె జంగయ్య, చావ రవి, కె రమణ, మైస శ్రీనివాసులు, టి లింగారెడ్డి, యు పోచయ్య, ఎస్‌ ‌హరికృష్ణ, జాదవ్‌ ‌వెంకట్రావు, ఎన్‌ ‌యాదగిరి, టి విజయసాగర్‌, ‌బి కొండయ్య, ఎస్‌ ‌మహేష్‌, ‌వై విజయకుమార్‌ ‌తదితరుల నేతృత్వంలో వందలాది మంది ఉపాధ్యాయులు దోమలగూడ రోడ్డు నుండి ప్రదర్శనగా ధర్నా చౌక్‌ ‌వద్దకు తరలివచ్చారు.

ధర్నా చౌక్‌ ‌ప్రారంభంలోనే పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం మూడున్నర వరకు దఫదఫాలుగా  ఉపాధ్యాయులు ధర్నా చౌక్‌ ‌వద్దకు తరలివచ్చారు. వారందరినీ పోలీసులు అరెస్టు చేసి గాంధీ నగర్‌, ‌చిక్కడపల్లి బేగంబజార్‌, అబిడ్స్, ‌రాంగోపాల్‌ ‌పేట, సైఫాబాద్‌, ‌నాంపల్లి, నారాయణగూడ, అంబర్‌ ‌పేట, ముషీరాబాద్‌, ‌బొల్లారం స్టేషన్లకు తరలించారు.  నిన్న సాయంత్రం నుండే  వివిధ జిల్లాల్లో ఉపాధ్యాయ నేతలను అదుపులోకి తీసుకున్నారు. యుయస్పీసీ స్టీరింగ్‌ ‌కమిటీ సభ్యులు డి సైదులు, షౌకత్‌ అలీ, ఎ గంగాధర్‌ ‌తదితరులను కూడా జిల్లాల్లో అరెస్ట్ ‌చేశారు.

ధర్నా చౌక్‌ ‌లో మీడియాతోనూ, పోలీసు స్టేషన్లలోనూ యుయస్పీసీ నాయకులు మాట్లాడుతూ అక్రమ అరెస్టులను ఖండించారు. ధర్నాకు అనుమతి ఇవ్వకుండా ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే హక్కును నిరాకరించటాన్ని తీవ్రంగా విమర్శించారు. అధికార పార్టీ నిరసనలను దగ్గరుండి జరిపించిన పోలీసులు ఉపాధ్యాయుల శాంతియుత ధర్నాకు అనుమతి నిరాకరించటం ఏమిటని ప్రశ్నించారు. అలకేషన్‌ ‌లో నష్టపోయిన ఉపాధ్యాయుల గోడును పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర పతి ఉత్తర్వుల అమలు కారణంగా స్థానికతను కోల్పోయిన వారు, సీనియారిటీలో లోపాలు, ఎస్సీ ఎస్టీ సామాజిక తరగతులకు దామాషా పాటింపులో పొరపాట్లు,  వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, అంతర్జిల్లా బదిలీలో జిల్లాలు మారిన వారు, భార్యాభర్తలు తదితర కేటగిరీలకు జరిగిన నష్టాలను సవరించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని డిమాండ్‌ ‌చేశారు.

ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా ఏకపక్షంగా జిఓ విడుదల చేశారు. జిఓలోని లోపాలను సవరించాలని యుయస్పీసీ చేసిన విజ్ఞప్తులను పెడచెవిన పెట్టారు. జరిగిన నష్టాలను సరిచేయటంలో తాత్సారం చేస్తున్నారు. పరస్పర బదిలీలకు ఇచ్చిన జిఓలోని నిబంధనలు కూడా బదిలీలకు ఆటంకంగా ఉన్నాయి. జిఓ 21ని సవరించాలని డిమాండ్‌ ‌చేశారు.జిఓ 317 ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం జరిగే వరకు యుయస్పీసీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా విజ్ఞత ప్రదర్శించి బాధితులకు న్యాయం చేయాలని లేకపోతే యుయస్పీసీ స్టీరింగ్‌ ‌కమిటీ త్వరలోనే సమావేశమై భవిష్యత్‌ ‌కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.

స్టీరింగ్‌ ‌కమిటీ
ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ

Leave a Reply