Take a fresh look at your lifestyle.

రెండు నెలల్లో 33 సార్లు పెరిగిన పెట్రో ధరలు

  • 14 రాష్ట్రాల్లో వంద రూపాయలకు పైనే పెట్రోల్‌ ‌ధర
  • రవాణారంగంపై తీవ్ర ప్రభావం

పెట్రో ధరలు నిరంతరం పెరుగుతుండడంతో వాహనదారుడి గుండె గుబేలుమంటున్నది. రెండు నెలల క్రితం మొదలైన ఇంధన ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. ఫలితంగా ఈ రెండు నెలల కాలంలో పెట్రోల్‌పై దాదాపు రూ.10 వరకు పెరగడం గమనార్హం. అటు డీజిల్‌ ‌కూడా దాదాపు రూ.9 వరకు పెరిగింది. దీంతో ఇప్పుడు రవాణారంగంపై తీవ్ర ప్రభావం పడుతున్నది. క్యాబ్‌లు, ఆటో వాలాలకు తలకుమించిన భారంగా మారింది. అటు చూస్తే కొరోనా ప్రభావంతో ప్రయాణికులు గతంలోలాగా ప్రయాణించే వీలులేకుండా పోయింది. పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల సమయంలో వరుసగా 18 రోజుల పాటు దేశంలో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆ తర్వాత మే 4 నుంచి చమురు సంస్థలు ధరలను పెంచుతూ వొస్తున్నాయి. సోమవారం మరోసారి పెట్రోల్‌పై 34-35 పైసలు పెంచారు. అయితే డీజిల్‌ ‌ధరలో ఎలాంటి మార్పు లేదు. మే నెల నుంచి ఇప్పటివరకు మొత్తం 35 సార్లు పెట్రోల్‌ ‌ధరలను సవరించారు.

డీజిల్‌ ‌ధరను 33 సార్లు పెంచారు. మే నెలలో 16 సార్లు, జూన్‌లో 16 సార్లు, జులైలో ఐదు రోజుల్లోనే మూడు సార్లు పెట్రోల్‌ ‌ధరను పెంచారు. దీంతో ఈ రెండు నెలల్లో లీటర్‌ ‌పెట్రోల్‌ ‌ధర రూ.9.46 పెరిగింది. 33 సార్లు పెంపుతో లీటర్‌ ‌డీజిల్‌పై రూ.8.63 పెరిగింది. ఇప్పటికే 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పెట్రోల్‌ ‌ధర వంద రూపాలయలు దాటింది. తెలుగు రాష్ట్రాలు సహా రాజస్థాన్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, జమ్మూకశ్మీర్‌, ‌తమిళనాడు, కేరళ, బిహార్‌, ‌పంజాబ్‌, ‌లద్దాఖ్‌, ‌సిక్కింలలో పెట్రోల్‌ ‌ధర రూ.100 పైనే ఉంది. మహారాష్ట్రలో లీటర్‌ ‌ధర రూ.105 దాటగా.. రాజస్థాన్‌లోని ఓ జిల్లాలో అత్యధికంగా రూ.110పైనే ఉంది. దేశ రాజధాని దిల్లీలోనూ రూ.100కు చేరువైంది.

ఇక కొన్ని ప్రాంతాల్లో డీజిల్‌ ‌ధర కూడా రూ.100 దాటేసింది. రాజస్థాన్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌లో లీటర్‌ ‌డీజిల్‌ ‌ధర రూ.100పైనే ఉంది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో దేశీయంగా ఇంధన ధరలకు రెక్కలొచ్చినట్లు ప్రభుత్వం చెబుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ ‌క్రూడ్‌ ఆయిల్‌ ‌బ్యారెల్‌ ‌ధర 2019 ఏప్రిల్‌ ‌తర్వాత తొలిసారి 75 డాలర్ల మార్క్‌ను తాకింది. దేశంలోని ప్రధాన నగారాల్లో ఇంధన ధరలు లీటరు చొప్పున పరిశీలిస్తే ఇలా ఉన్నాయి. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ ‌రూ.99.86, డీజిల్‌ ‌రూ.89.36 గా ఉంది. ముంబయిలో పెట్రోల్‌ ‌రూ.105.92 , డీజిల్‌ ‌రూ.96.91, కోల్‌కతాలో పెట్రోల్‌ ‌రూ.99.84, డీజిల్‌ ‌రూ.92.27, చెన్నైలో పెట్రోల్‌ ‌రూ.100.75, డీజిల్‌ ‌రూ.93.91, హైదరాబాద్‌లో పెట్రోల్‌ ‌రూ.103.78, డీజిల్‌ ‌రూ.97.40గా ఉంది. దీంతో రవాణారంగంపై తీవ్ర ప్రభావం పడనుందని ప్రైవేట్‌ ఆపరేటర్లు అంటున్నారు. అలాగే ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచక తప్పదని అంటున్నారు.

Leave a Reply