Take a fresh look at your lifestyle.

‌ప్రాణం పోయినా దళితబంధును ఆపం

  • మాకు రాజకీయమంటే ఓ యజ్ఞం..ఇతర పార్టీలకు అదో గేమ్‌
  • ఈ ‌యజ్ఞం దళిత బంధుతో ఆగదు..
  • ప్రజాధనం అన్ని వర్గాలకూ పంచుతాం
  • అన్ని నియోజక వర్గాల్లోనూ దళిత బంధు అమలు
  • ముందుగా ప్రతి నియోజకవర్గానికి వందమందికి
  • దళితబంధుపై సిఎం కెసిఆర్‌ ‌పునరుద్ఘాటన
  • కెసిఆర్‌ ‌సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరిన మాజీమంత్రి మోత్కుపల్లి
  • దళితబంధుకు తోడయ్యాడని సిఎం ప్రశంసలు

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని ప్రాణం పోయినా వదలమని సీఎం కేసీఆర్‌ ‌తేల్చిచెప్పారు. తెలంగాణ తేవడం ఎంత పెద్ద యజ్ఞమో..దళిత బంధును విజయవంతం చేయడం అంతే పెద్ద యజ్ఞం అని అన్నారు. ప్రాణం పోయినా దళిత బంధును వదలం. సంవత్సరానికి కొంత మందికి అమలు చేస్తాం. ఈ ఏడాది ప్రతి నియోజకవర్గానికి వంద మందికి కచ్చితంగా ఈ పథకం అమలు చేస్తామని అన్నారు. మోత్కుపల్లి నర్సింహులు టీఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ ‌మాట్లాడారు. తెలంగాణలో అతిపెద్ద కులం దళిత కులం అని, రాష్ట్ర జనాభాలో 75 లక్షల మంది దళితులు ఉన్నారని అన్నారు. అందరీ కన్నా తక్కువ భూమి దళితుల వద్ద ఉంది. 13 లక్షల ఎకరాల భూమి మాత్రమే దళితుల వద్ద ఉంది. 9 శాతం మంది ఉన్న గిరిజనుల వద్ద 22 లక్షల ఎకరాల భూమి వద్ద ఉంది. దళితుల వద్ద 13 లక్షల ఎకరాల భూమి కూడా ఉందో లేదో తెలియదు. లెక్క తీస్తే తెలుస్తది. దళితులను బతుకనివ్వలేదు. జనాభా ఎక్కువ ఉన్నది. అవకాశాలు తక్కువ ఉన్నాయన్నారు. అంబేద్కర్‌ ‌పుణ్యమా అని ఎస్సీలకు రిజర్వేషన్‌ ‌ఫలాలు అందాయి. అంబేద్కర్‌ ‌పుణ్యంతో కొంతమంది పిల్లలు చదువుకుని ఉన్నత ఉద్యోగాలు పొందారు. కొందరు ఎమ్మెల్యేలు అయ్యారు. అట్టడుగు స్థాయిలో ఉన్న వారి కోసం అంబేద్కర్‌ ‌పోరాటం చేశారు. వొచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ ‌పార్టీనే గెలుస్తుంది. ఈ ఏడేండ్లలో తెలంగాణ పెట్టబోయే ఖర్చు రూ. 23 లక్షల కోట్ల బ్జడెట్‌ ఉటుంది. వొచ్చే ఏడేండ్లలో రూ. 1.7 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం పెద్ద విషయం కాదు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ఆపం. అన్ని నియోజకవర్గాల్లో అమలు చేస్తాం. దళిత బంధు ద్వారా రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల ఆదాయం వొస్తుందన్నారు.

భారత దళిత సమాజానికి తెలంగాణ దళిత సమాజం దిక్సూచి కావాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఇక్కడి ప్రజలు బాగుపడుతారని భావించి స్వరాష్ట్ర ఉద్యమం మొదలుపెట్టాను. ఆ సమయంలో ఎన్నో అన్నారు. ఎన్నో తిట్లు తిట్టారు. ముక్కు బాలేదని ఎవడికీ తోచింది వారు తిట్టారు. దేవుడు, ప్రజలు మన్నించారు. మొత్తానికి తెలంగాణ సాధించుకున్నామని సీఎం కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. అందరం పోరాడి దేశ రాజకీయ వాతావరణాన్ని మార్చాం. మాయావతి ఇంటికి 19 సార్లు పోయాము. మాయావతి తనను ఎంతో అభిమానించేది. మాయావతి తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. అలా ఇతర పార్టీల మద్దతును కూడగట్టాం. తెలంగాణ సాధనలో అనేక అటుపోట్లు ఎదుర్కొన్నాం. తెలంగాణ వొచ్చినప్పుడు విపత్కరమైన పరిస్థితులు ఉండేవి. అనేకమైన బాధలు..మంచి నీళ్లకు, కరెంట్‌కు ఇబ్బంది ఉండే. వ్యవసాయంలో దుర్భర పరిస్థితి. మొత్తానికి కిందవి•ద పడి, అన్ని అర్థం చేసుకుని పరిపాలన ప్రారంభించుకున్నాం. ఇప్పుడు గ్రామాల్లో అన్ని రకాల అభివృద్ధి జరుగుతుంది. ఎవరి బతుకు వారు బతుకుతున్నారు. హైదరాబాద్‌లో ఉన్నోళ్లు గ్రామాలకు వెళ్లి బతుకుతున్నారు. ఇంకా చాలా జరగాల్సి ఉంది. వెనుకబడ్డ ప్రజలు, అన్యాయానికి గురైన ప్రజలకు న్యాయం చేకూర్చాలి. రైతుల ఆత్మహత్యలు తగ్గిపోయాయి. చేనేత కార్మికులు బాగుపడుతున్నారు. ఇప్పుడిప్పుడే తెలంగాణలో సమస్యలు కొలిక్కి వస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలవుతున్నాయి. ఏ పని చేసిన అర్థం పరమార్థం ఉంటుంది అని సీఎం కేసీఆర్‌ అన్నారు. కార్యక్రమంలో మంత్రి జగదీవ్వర్‌ ‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మాకు రాజకీయమంటే ఓ యజ్ఞం.. ఇతర పార్టీలకు అదో గేమ్‌
‌టిఆర్‌ఎస్‌కు రాజకీయమంటే ఓ యజ్ఞం అని..ఇతర పార్టీల్లా ఒక గేమ్‌ ‌కాదని టిఆర్‌ఎస్‌ అధినేత సిఎం కెసిఆర్‌ అన్నారు. ‘ఇతర రాజకీయ పార్టీలకు రాజకీయాలు అంటే ఒక గేమ్‌.. ‌కానీ టీఆర్‌ఎస్‌కు అట్లా కాదు. టీఆర్‌ఎస్‌కు ఇది ఒక టాస్క్.. ఒక యజ్ఞం. పట్టువట్టి పని చేయాల్సిందే అన్న దృక్పథం మాది’ అని సీఎం కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ ‌మాట్లాడుతూ..నర్సింహులు రాజకీయాల కోసం టీఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరలేదని, మోత్కుపల్లికి కొరోనా వొచ్చినప్పుడు కోటి ఖర్చయినా పర్లేదని..ఆయనకు మంచి వైద్యం అందించాలని తాను చెప్పానని సిఎం అన్నారు. తామిద్దరం మంచి స్నేహితులమని, మోత్కుపల్లితో తన స్నేహం రాజకీయాలకు అతీతమని. దళితబంధు భేటీలకు కూడా మోత్కుపల్లి హాజరయ్యారని, దళిత బంధు పథకానికి తోడవుతానని మోత్కుపల్లి తనతో అన్నారని అన్నారు. దళితబంధుతో బలహీన వర్గాలను బలోపేతం చేసే యజ్ఞం ఇక్కడితో ఆగదని, గిరిజనులు, బీసీలు, ఈబీసీలకు కూడా వొస్తదని, వొచ్చిన ఆదాయాన్ని ప్రజలకు ఏదో రూపంలో పంచుతామని, అతి ఎక్కువ బాధలో, దుఃఖంలో ఉన్న ప్రజలకు ముందు మేలు చేస్తామని కెసిఆర్‌ అన్నారు. బలహీన వర్గాలను వంద శాతం ఆదుకోవాలని, అప్పుడే గొప్పదనం ఉంటుందని, దళిత బంధుకు రూ. లక్షా 70 వేల కోట్లు ఖర్చు పెట్టాలని తాము నిర్ణయించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తాము ఇక్కడితో ఆపమని, అన్ని నియోజకవర్గాల్లో అమలు చేస్తామని, బదులుగా దళిత బంధు ద్వారా రాష్ట్రానికి రూ. 10 లక్షల కోట్ల ఆదాయం వొస్తుందన్నారు. భారత దళిత సమాజానికి తెలంగాణ దళిత సమాజం దిక్సూచి కావాలని ఆయన ఆకాక్షించారు. కర్ణాటకలోని రాయ్‌చూర్‌ ‌ప్రజలు కూడా తెలంగాణలో కలుస్తామని అంటున్నారని, తెలంగాణ పథకాలు ఇతర రాష్ట్రాల ప్రజలను ఆకర్షిస్తున్నాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కండువా కప్పి పార్టీలోకి మోత్కుపల్లిని సీఎం కేసీఆర్‌ ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ‌మాట్లాడుతూ మోత్కుపల్లిపై ప్రశంసలు కురిపించారు. మోత్కుపల్లికి రాజకీయ అనుభవం ఎంతో ఉందని కొనియాడారు.

మోత్కుపల్లి తనతో కలిసి ఎన్నో ఏళ్లు పనిచేశారని గుర్తుచేశారు. అణగారిన వర్గాల గళం వినిపించారని తెలిపారు. గతంలో విద్యుత్‌ ‌కోసం ఎన్నో కష్టాలు పడ్డామని, విద్యుత్‌ ‌మంత్రిగా చేసిన మోత్కుపల్లికి ఆ కష్టాలు తెలుసని చెప్పారు. స్వరాష్ట్రమే సమస్యలకు పరిష్కారమని ఉద్యమం ప్రారంభించామని గుర్తుచేశారు. తెలంగాణ గురించి దేశ నేతలందరికీ అర్థమయ్యేలా చెప్పామన్నారు. స్వరాష్ట్రం కోసం ఒక్క మాయావతినే 13 సార్లు కలిశామని తెలిపారు. తెలంగాణ సాధనలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. తనను తిట్టినన్ని తిట్లు దేశంలో ఎవరినీ తిట్టలేదని చెప్పారు. తెలంగాణ వొచ్చాక విద్యుత్‌ ‌సమస్యను పరిష్కరించుకున్నామని చెప్పారు. రైతు, చేనేత ఆత్మహత్యలు ఆగిపోయాయని కేసీఆర్‌ ‌తెలిపారు. ఈ సమాజానికి పరిచయం అక్కర్లేని వ్యక్తి మోత్కుపల్లి నర్సింహులు అని అన్నారు. ప్రజా జీవితంలో ఆయనకంటూ ఒక స్థానం ఉందని, విద్యార్థి దశ తర్వాత క్రియాశీలక రాజకీయాల్లోకి వొచ్చారని, ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించడమే కాకుండా అణగారిన ప్రజల వాయిస్‌గా ఉన్నారు.

తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తనకు అత్యంత సన్నిహిత మిత్రులు. తనతో అనేక సంవత్సరాలు కలిసి పని చేశారు. వారి వెంట ఎంతో అభిమానంతో వొచ్చిన వారందరికీ హృదయపూర్వకమైన స్వాగతం తెలుపుతున్నానని కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. ‘తెలంగాణ సమాజం అత్యంత దారుణమైన పరిస్థితులను అనుభవించింది. చాలా బాధలు పడ్డాం. చాలా అనుభవించాం. ఒకప్పుడు నర్సింహులు కరెంట్‌ ‌మంత్రిగా ఉండే. నేను ఆయనను కలిసినప్పుడు కరెంట్‌ ‌బాధలు ఉన్నాయని చెప్పిండు. ఆలేరు అంతా కరువు ప్రాంతం. ఎన్ని ట్రాన్స్‌ఫార్మర్లు తీసుకొచ్చినా లాభం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసిండు. కరెంట్‌ ‌కోసం తెలంగాణ ప్రాంతం ఎన్నో కష్టాలు పడ్డది. ఆ తర్వాత సోషల్‌ ‌వెల్ఫేర్‌ ‌మినిస్టర్‌గా సేవలందించారు. ఒకానొక దశలో తెలంగాణ సమాజం చెదిరిపోయింది. ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. నేను మంత్రిగా ఉన్న సమయంలో ఓ సీఎం మాట్లాడుతూ.. తెలంగాణకు పెట్టుబడులు రావు అని అన్నాడు. అప్పుడు నేను గొడవపడ్డాను. తెలంగాణ వస్తే ఏం అభివృద్ధి జరగదని చిత్రీకరించారు. అనేక అవమానాలను తెలంగాణ సమాజం ఎదుర్కొన్నది. తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత కూడా అనేక భయ భ్రాంతులకు గురి చేశారు. ఆలేరు, భువనగిరి, జనగామ వద్ద మంచినీళ్ల వ్యాపారం మొదలుపెట్టారు. చాలా భయంకరమైన పరిస్థితి. మంచినీల్లు రావు, కరెంట్‌ ‌సమస్య..ఆ పరిస్థితులను ఎదుర్కొన్నాం’ అని ఈ సందర్భంగా కేసీఆర్‌ ‌గుర్తు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు మోత్కుపల్లి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌ ‌రెడ్డి, మండలి మాజీ చైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

Leave a Reply