మున్సిపల్ ఎన్నికలలో వోటర్లు అందరూ తమ వోటు హక్కును వినియోగించుకునేలా ప్రజలను చైతన్యవంతం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి జిల్లా కలెక్టర్లకు సూచించారు. పోలింగ్ స్టేషన్ల వారీగా వోటరు జాబితా తయారు చేయని మునిసిపల్ కమిషనర్లు వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. సోమవారం నాగిరెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయించే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బ్యాలెట్ పేపర్ ముద్రణకు ముందు అభ్యర్థుల వివరాలను సరి చూడాలనీ, పోలింగ్ రోజు వోటు వేసే అభ్యర్థి చేతికి సిరా గుర్తు అంటించేటప్పుడు నిశితంగా పరిశీలించాలని పేర్కొన్నారు. పోలీసు అధికారులతో చర్చించి ప్రతీ పోలింగ్ స్టేషన్, పోలింగ్ కేంద్రం వద్ద బందోబస్తు వివరాలను పరిశీలించి అన్ని రాజకీయ పార్టీలు, ఓటర్లకు తెలిపే విధంగా తగిన చర్యలు చేపట్టాలన్నారు.
గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల వోటర్లు ఎక్కువగా ఎన్నికలలో పాల్గొనడం లేదనీ, ఈ మున్సిపల్ ఎన్నికలలో తప్పనిసరిగా అధిక శాతం వోటింగ్ నమోదయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలనీ, తెలిపారు. పోలింగ్ విధులు నిర్వర్తించే ఎన్నికల సిబ్బందికి రెండో విడత శిక్షణను వెంటనే పూర్తి చేయాలని ఈ సందర్భంగా నాగిరెడ్డి జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ శ్రీదేవి, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్ పాల్గొన్నారు.