Take a fresh look at your lifestyle.

మాతృత్వం, మానవత్వం, మహిళాభ్యుదయం పరిమళించే సమ్మెట ఉమాదేవి కథానికలు

సమ్మెట ఉమాదేవి తాజా ప్రచురణలు…
‘‘అమ్మకథలు’’ – వెల – రు.100/-, ‘‘సమ్మెట ఉమాదేవి కథానికలు’’, వెల – రు.160/-, ‘‘జమ్మిపూలు’’ – వెల  రు.160/-, ప్రతులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ పుస్తక విక్రయశాలల్లో లభ్యం
‘‘పుస్తకాలు కావలసినవారు  సమ్మెట ఉమాదేవి  9849406722  గూగుల్‌ ‌పే  నెంబరును సంప్రదించగలరు.’’ 
బృందావనమంటే నందనవనమే. అక్షరవనంలో రచనా సౌరభాలు వెదజల్లే పుష్పాలే విరబూస్తాయి. అలాంటి సాహితీ సుమమే సమ్మెట ఉమాదేవి. మచిలీపట్నం అలల తీరంలో పుట్టి, అడవుల తెలంగాణంలో పెరిగి పోరుగల్లు ఓరుగల్లులో ఉన్నత విద్యాభ్యాసం చేసి, కానలలో పెరుగుతున్న అమాయక పిల్లలకు అక్షర జ్ఞానం ప్రసాదించాలన్న ఆకాంక్షతో ఉపాధ్యాయ వృత్తినెంచుకుని, పసి హృద యాలను, నాగరకతకు దూరంగా మర్మమెరుగని మహిళల మనసులను, ముగ్ధల ఆలోచనలనూ అర్ధం చేసుకుని, పేదల బతుకులతో, ప్రకృతి అందాలతో మమేకమై మదిలో కదలాడిన ఆలోచనలకు ఒక రచనా రూపం ఇవ్వడంలో కృతకృతురాలై నేడొక రచయిత్రిగా, మానవత్వం పరిమళించే కథా సుగంధాలను వెదజల్లుతున్నారు ఉమాదేవి. అంతకుమించి పల్లె జీవితాల్లోని కథలను ఒడిసిపట్టుకుని,  జీవితాలను కథల్లోకి మళ్ళించి పాఠకుల హృదయాలపై అమృత జల్లులు కురిపిస్తున్నారు.
వృత్తిరీత్యా ఉపాధ్యారాలు కావడం, ప్రవృత్తి రీత్యా రచయిత్రి కావడం వల్ల మాయా మర్మం తెలియని పిల్లలతో ఎక్కువకాలం గడుపుతూ, సౌకర్యాలు ఉన్న పట్టణాలను వద్దనుకుని ముళ్ళ దారులు, మట్టి బాటల్లో మైళ్ళకు మైళ్ళు నడుస్తూ ఉద్యోగ కాలం తండాల్లో గడిపి ఉద్యోగ విరమణ చేసినా అక్షర సేద్యం వదలలేదు. రచనాసక్తిని ఒక వెల్లువలా ఉరికించిన ఫలితమే ఆకలం నుంచి జాలువారిన దాదాపు ఓ నూట యాభైకథలు. ఇష్టమైన మట్టి మనుషులు నిరంతరం ఆమెకు తారసపడ్డారు. ఎటువంటి కష్టాన్నైనా ఇష్టంగా స్వీకరించే శ్రమజీవుల మధ్య కాలం గడిపారు. కొండ కోనల్లో విభిన్న జీవితాలను, భిన్నమైన మనుషులను ఆకళింపు చేసుకున్నారు. అలా చూసిన, విన్న జీవిత ఉదంతాలకు కథలుగా రూపం ఇచ్చారుకథలు అందరూ రాస్తారు, కానీ మంచి కథలు కొందరే రాస్తారు.. ఆ మంచికథలు రాసే కొందరిలో ఉమాదేవి ఒకరు, ఆమె కథలు బాగుండడమే కాదు.. బాధపెడతాయి, బాధపెట్టి కన్నీళ్ళు రప్పిస్తాయి. కథా ప్రారంభాలు ఎంత బాగుంటాయో కథాంతాలు అంతకు రెట్టింపు బాగుంటాయి.పంతులమ్మగా వృత్తిలో నిమగ్నమైనా జీవితంలో కథ అంతర్భాగంగా నమ్మి కథా రచయిత్రిగా స్థిరమైన స్థానం సంపాదించుకున్నారు. ఆమె కథల్లో క్లుప్తత, కళాత్మకత, పాత్ర చిత్రీకరణ, సులభ శైలి ఆకళింపుజేసుకున్న రచయిత్రిగా పేరొం దారు. పెద్ద కథలే కాదు, పిల్లలతో పెనవేసుకున్న ఉపాధ్యాయినిగా బాలసాహిత్యం పట్ల అభిరుచి పెంచుకుని.. అల్లరి కావ్య, పిల్లి ముసుగు, పిల్లల దండు, నిజాయితీ, రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలు రాసి, పసిమనసుల్లో  నిలిచి ఉన్నారు. రోడ్డు పక్కన వసించే తండావాసుల కథలలో అందంగా ‘‘రేలపూలు’’ విరబూ యించారు. ఉమాదేవి మట్టివాసనలు, బడుగు జీవితాలు తెలుసుకున్న సంపన్నురాలని ఆచార్య ఎన్‌ ‌గోపి ప్రశంసించారంటే ఉమాదేవి సత్తా తెలుస్తుంది.
తండాలలో వారిని పలకరించి, వారి చెలిమితో పులకరించి పరవశించారు. ‘‘వీళ్ళు మా ఊరి వాళ్ళు’’ అని గుండెల్లో పెట్టుకున్నారు. కలిసి అడుగులేసి అనేక జీవిత శకలాలను దర్శించిన కారణంగా, వారి ఉదంతాలు ఆమె హృదయంలో శాశ్వతంగా ఉండిపోయాయి. అందుకేనేమో కథలు మృదువుగా, మనిషి వాసన వేస్తూ మానవత్వంతో తడిసి ముద్దగా ఉంటాయి. ఆమెకు చాలా కాలంగా కథలు రాసే అలవాటున్నా, ఓ దశాబ్దం పైగా ఉధృతంగా రాసి రాశిపోసారు. వాసికెక్కిన వాటికి అనేక బహుమతులు అందుకందుకున్నారు. అనేక కథా సంపుటాల్లో చోటు దక్కించుకున్నారు.  కొన్నింటిని గుదిగుచ్చి కథా సంకలనాలుగా తీసుకు వచ్చారు. వాటిలో వన్నెకెక్కినవి ‘అమ్మ కథలు’, ‘రేలపూలు’, ‘జమ్మిపూలు’, ‘సమ్మెట ఉమాదేవి కథానికలు’.
‘‘జమ్మిపూలు’’ సంకలనంలో 15 కథలున్నాయి. వీటిలో మూడు కథలు పాఠశాల నేపథ్యంలో ఉంటాయి. వృత్తిని ప్రేమించేవారు, అంకితభావంతో పనిచేసేవారు..ఇ నిజం అందరి మన్ననలూ పొందుతారన్నది నిజం. ‘‘రెడపంగి కావేరి’’ కథలోని అర్చన టీచర్‌, ‘‘ఊరి ఉమ్మడి సిరి’’లో సరితా టీచర్‌ ‌పాత్రలు పిల్లల్ని ప్రేమించడం, వారి అంతరగం లోతులు తెలుసుకుని లాలిస్తూ విద్యా బుద్ధులు నేర్పడం..లో రచయిత్రి కథల్లో నిరంతర శ్రామిక స్త్రీలు కనిపిస్తారు. గుండెల్లో బడబాని దాచుకుని నవ్వుతూ జీవితాన్ని సవాలుగా స్వీకరించిన స్త్రీలు, వయసుతో పనిలేకుండా ఇతరులకు స్ఫూర్తినిస్తూన్న బాలికలు, భావితరానికి దారిదీపాలైన మహిళామణులూ కథల్లొ కనిపిస్తారు. మర్మమెరుగని సాదాసీదా గిరిజన పల్లెవాసుల బతుకులను చిత్రీకరించిన వీడియో గ్రాఫ్‌గా ‘‘జమ్మిపూలు’’ సంకలనాన్ని అభివర్ణించవచ్చు.   కాళ్ళు తడవకుండా నదిని, కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేం, అన్న వాక్కులు కొన్ని జీవితాలకు దర్పణం పడతాయి ఇందులో దాదాపు పది కథలు. ఈ తెలంగాణ కథల్లో వ్యవహార పదాలు, మాండలికాలు, యాసలు.. పాత్రల సంభాషణల్లో మనసుకు హత్తుకు పోతాయి.
‘‘సమ్మెట ఉమాదేవి కథానికలు’’ పధ్నా లుగు కథల సంకలనం అన్నింటా, మానవీయమైన స్పందన, హృదయాంతగతమైన స్నేహం, మనిషిపై విశ్వాసం, అవధులెరుగని ప్రేమ, అమృత ధారలై వర్షిస్తూ పాఠకులను కట్టిపడేస్తాయి.  తడి – కథ మండు వేసవిలో మంచినీళ్ళకై పల్లెల్లో పేద ప్రజల పాట్లు కన్నీళ్ళు తెప్పిస్తాయి. నీళ్ళ కరవు మానవ సంబంధాలను  సైతం మార్చేస్తుందనిపిస్తారు మాలతి పాత్ర చేత. ‘‘వెన్నెల లోగిలి’’ కథ  సమాజ సామరస్య జీవనానికి అద్దం పడుతుంది. ఆర్థికస్వాతంత్య్రం ఉన్నా ఒంటరి మహిళ బతుకులో వెతలెలా ఉంటాయో వివరంగా చెబుతుంది ‘‘చర్విత చరణం’’ కథ. అంతేకాదు, ఆత్మ స్థైర్యంతో మహిళలు తాము, తమ కుటుంబాలను ఎంత సమర్థతతో తీర్చి దిద్దుకుంటారో పితృదేవోభవ, జీవనహేల, నా కంటి నీటి ముత్యమా, నీ వాకిట తులసినోయీ, పంచుకునేందుకు .. లాంటి కథలలో స్త్రీ ప్రధాన పాత్రలు మనకు చెబుతాయి.
పదిహేడు కథల సంకలనం ‘‘అమ్మ కథలు’’. ఇందులో అన్ని కథలకూ అమ్మ న్యూక్లియస్‌. అన్నీ అమ్మ చుట్టూ ప్రదక్షిణం చేసినవే. అమ్మ ప్రేమ, అమ్మ సౌజన్యం, అమ్మ త్యాగం, అమ్మ స్నేహం, అమ్మ మమకారం, అమ్మ వాత్సల్యం… అన్నింటికీ అమ్మ మూల విరాట్టు. అమ్మంటే నీడనిచ్చి సేదతీర్చే మహా వృక్షంగా అభివర్ణిస్తారు ఉమాదేవి. అమ్మ ఆకారం, అమ్మ అనుబంధం, అమ్మగా రచయిత్రి హృదయంలో నింపుకున్నారు, ఎందుకంటే ఆమే ఒక మాతృమూర్తి కనుక.  చిన్నతనంలో కొంత అనారోగ్యం కారణంగా చదువుకు రెండళ్ళు విశ్రాంతి ఇచ్చినా సాహిత్యమంటే ఇష్టంతో పుస్తకాలు చదవడంలో నిమగ్నమైన ఉమాదేవి మొదటిసారి విద్యార్థిగా ‘‘కూటి కోసం’’ కథ రాసి బరోడ ఆంధ్ర సమితి నిర్వహించిన జాతీయ స్థాయి కథలపోటీకి పంపితే ద్వితీయ బహుమతి లభించింద్కి. అంతే.. ఆ ఉత్సాహం ఆమెను కథల మార్గంలోకి అడుగే యించగా అప్రతిహతంగా సాగిపోతున్నది. ఎం.ఏ, బి.ఇడి అనంతరం ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయినిగా ఉద్యోగంలో చేరి గ్రామీణ వాతావరణ జీవితంలో మునిగిపోయారు. బాలికల విద్యాభివృద్ధి అధికారిణిగా ఖమ్మం జిల్లాలోని 38 మండలాలలో అటవీ గ్రామాలు తిరిగి అక్కడి తండావాసుల అరకొర సౌకర్యాల జీవితాలు, వైద్యం నోచుకోక సంభవించిన మరణాలు చూసి చలించి మనసులో సంఘర్షణ మొదలై, ఆ కన్నీటి గాధలకు, వారి ఆవేదనలు, రాగద్వేషాలు, అమాయకత్వం కథల రూపం ఇచ్చారు.
కథలే కాకుండా కేంద్ర బాల సాహితీ అకాదెమీ నిర్వహణలో• మైసూర్‌ ‌విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌ ‌కేంద్రీయ విశ్వ విద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో బాల సాహిత్యం తీరుతెన్నులు అంశం పై – తెలుగు చలన చిత్రాలలో పిల్లల పాటలు, ‘‘బాల సాహిత్య కృషిలో ఆకాశవాణి, దూరదర్శన్‌ ‌పాత్ర’’ పత్రాలు సమర్పించారు. కథా సాహిత్యంలో ఆమె సుమారు పది పురస్కారాలు అందుకున్నారు. పదహారేళ్ళ రైలు ప్రయాణాల అనుభవాలను ‘‘రైలు కథలు’’గా పట్టాలెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం ఖమ్మంలో స్థిరపడి రచనా వ్యాసం సాగిస్తున్నారు. ఇద్దరు కుమార్తేలు-ఇద్దరు అల్లుళ్ళు సాఫ్ట్ ‌వ్రే ఇం‌జనీర్లుగా సంతృప్తికర జీవితాలు అనుభవిస్తుండగా మూడో కుమార్తె పట్టభద్ర విద్యాభ్యాసంలో హాయిగా ఉన్నారు. మూర్తీభవించిన మాతృమూర్తి కనుకనే అమ్మకథలౌ ఆవిష్కరించ గలిగారు. పాతిక కథలకు పైగా బహుమతులు లభించాయి. కావలి సాహితీ వారధి పురస్కారం, మాడభూషి రంగాచార్య స్మారక పురస్కారం, గోవిందరాజు సీతాదేవి కథా పురస్కారం, తెలంగాణ ఉత్తమ సాహితీ పురస్కారం..ఆమె సొంతం చేసుకున్న పురస్కారాలలో కొన్ని ముఖ్యమైనవి.
– నందిరాజు

Leave a Reply