- బోధన్ నుంచి 1,400 కిలోమీటర్లు స్కూటీపై వెళ్లి తీసుకువచ్చిన మాతృమూర్తి
తనయుడు వేరే రాష్ట్రంలో చిక్కుకున్నాడని తెలియగానే ఆ తల్లి గుండె తల్లడిల్లిపోయింది. అధికారుల అనుమతి తీసుకుని, స్కూటీపై వెళ్లి తనయుడిని చేరుకుంది. సుమారు 1,400 కిలోమీటర్లు ప్రయాణించి ఇంటికి తీసుకుని వచ్చింది. ఆ తల్లి సాహసానికి అందరూ సలామ్ చేస్తున్నారు. బోధన్‌కు చెందిన రజియాబేగం ప్ర భుత్వ పాఠశాలలో టీచర్. ఆమెకు ఇద్దరు కుమారు లు, ఓ కుమార్తె. 12 ఏళ్ల క్రితం భర్త మరణించాడు. అప్పటినుంచి పిల్లల ఆలనాపాలనా ఆమే చూస్తోంది. చిన్నవాడైన మహ్మద్ నిజాముద్దీన్ ఇంటర్ పూర్తి చేసి హైదరాబాద్‌లోని నారాయణ మెడికల్ అకాడమీలో కోచింగ్ తీసుకుంటున్నాడు. నెల్లూరుకు చెందిన నిజాముద్దీన్ స్నేహితుడు బోధన్‌లో ఇంటర్ చదివాడు. అతడి ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల కోసం గత నెల ఇద్దరు కలసి హైదరాబాద్ నుంచి బోధన్‌కు వచ్చారు. స్నేహితుడి తండ్రి ఆరోగ్యం బాగా లేదని తెలియడంతో అతడికి తోడుగా నిజాముద్దీన్ మార్చి 12 నెల్లూరుకు వెళ్లాడు. ఇదే సమయంలో కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో అతడు∙చిక్కుకుపోయాడు.
