పాలుతాగే పసితనమున అమ్మ ఒడిలో
గువ్వపిల్లలా గుండెలకు హత్తుకుని
అమ్మస్పర్శే ఆలంబనగా ఎదిగిన
అభం శుభం తెలియని ఆనంద ప్రపంచం నీది
కరిగి పోతున్న కాలం
మారుతున్న రూపాలను జూసి
మలినమైన నీ నైజాన్ని
బయట పెట్టింది.
నెరసినతల ముడుతలు పడిన మోములో
అమ్మ నీకు అనాకారిలా అగుపించింది.
మారిన రోజుల్లో రాజువైన నీవు
మేడిపండు మెరుగులకు
దాసోహమైతివి
ముసలితనములో నున్న అమ్మను
విసరివేయాలనే నీ నీచత్వాన్ని
ఉగ్గుపాల నాడే పసిగడితే
నీ ఊపిరి నిలిచేదా
నిన్ను సేద దీర్చ ఓదార్చడానికి
ఎంత చెమటను ధారపోసింది
ఎన్ని చేతుల ఆసరాతో
నిన్నింత వాన్ని చేసింది
ఆసరా ఇచ్చిన చేతులనే
ఈసడించుకుని
ఆనవాలు లేకుండా చేస్తివి
బలాన్ని బలగాన్ని వాడుకొని
వదిలించుకోవడంలో నేర్పరివైతివి.
ఆఖరికి అమ్మను కూడా.
చరిత్ర గతిని మార్చిన
చమట చుక్కల విలువ
నీకు ఇంకను అర్థంకావడం లేదు
రాజరికం పోకడలతో
రాయితత్త్వం అలవడ్డ నీలో
మనిషితత్త్వం ఎప్పుడో మసకబారింది
అమ్మ ఒడిలో దిద్దుకున్న
అక్షరాలకు అర్థం మార్చేశావు
పెట్టుబడితో పెనవేసుకొన్న
అనుబంధములో
విధ్వంసమే వికాసమనే
విద్య నేర్చిన వాడివి
పైపై మెరుగులకు
ఆరాటపడుతున్న నీకు
నేడుపాత రోతైంది
చరిత్రను కూల్చుతున్న నీ చరిత కూలబడటానికి కూడా
కాలం కన్నేసి కాంక్షగా చూస్తుంది.
కలవర పడకు
సాలెనుక సాలేగదా
– గన్ రెడ్డి ఆదిరెడ్డి, 9494789731