Take a fresh look at your lifestyle.

తల్లి పాదాలు

ఆమె తన పాదాలను నేలపై మోపితేనే..
రోజంతా ఆనందముతో పరుగులు తీసేది.
ఆమె కళ్లలోనుంచి వెలుగులు పంచితేనే
చీకటి తెరలన్నీ మాయమయ్యేవి.
తన ఆశల్ని… ప్రేమాను బంధాలతో కట్టేస్తుంది.
జీవితరేఖలపై ఒక్కో అడుగువేస్తూ నడుస్తుంది.

ఆ అడుగు ఎప్పుడూ జారిపడదు.
తన కన్నవారి కలల కోసం నడుస్తుంది.
తన హృదయాలపై పాదాలను మోపుకొని…
నడకలు నేర్పిస్తుంది.
రుధిరాన్ని అమృతంగా మార్చి…
చనుపాలతో సాకుతుంది.

పొద్దంతా పస్తులే… ఏ పుటనో బుక్కెడు బువ్వ.
పరివారపు ఆకలిచప్పులు మొదట తెలిసేది తనకే.
భువిపై కమ్ముకున్న నిశీధి మేఘాలను..
భానుడిలా ఉదయించి చీల్చివేస్తుంది.
బాధలన్నింటిని తన భుజాలపై మోసుకొని..
మదిలో దాచుకొని కన్నీరై దిగమింగుతుంది.

తన కష్టాన్ని ఎవ్వరూ గుర్తించరు.
ఎదలో అగ్నిజ్వాలలు ఎగసిపడుతున్నా..
మోముమీద వెన్నెల వెలుగులతో…
చల్లని చందమామై చల్లని చూపులను పంచుతుంది.
తన కళలన్నీ బిడ్డల ఉన్నతి కోసమే.
తన కన్నీటితో కలల కన్నీటి పాటపాడుతుంది.
హృదయ గవాక్షం నిండా ప్రేమబంధాల
తీగలను అల్లుకుంటుంది.

ఖండాన్తరాలు దాటిన కొడుకు కూతురు
ప్రేమకోసం కన్న పేగు పరితపిస్తుంది.
డాలరుమీద మోజుతో మరమనిషిలా మారిన మనిషి..
నువ్వొక తల్లిగర్భాన పుట్టిన సంగతి ఎరుకేనా.
అనాధ ఆశ్రమంలో జీవచ్చవంలా పడివున్న..
అమ్మ పిలుపులు నీకు వినిపిస్తున్నాయా.
నువ్వు మోసుకొచ్చేది డబ్బుల సూట్కేసులని కాదు.
కాస్త తల్లి ప్రేమను మోసుకొని రెక్కలొచ్చిన
పక్షివై నీ తల్లి ఎదలో వాలిపో.
ఇంకా ఆఖరి శ్వాసతో చూస్తుంది ఆ తల్లి..
ఆ తల్లి పాదాలను తాకి రుణం తీర్చుకో.

– అశోక్‌ ‌గోనె…నిర్మల్‌, 9441317361

Leave a Reply