Take a fresh look at your lifestyle.

అధికారుల అతి..!

కొరోనా ఒకరి నుండి మరొకరికి సోకకుండా తీసుకోవాల్సిన చర్యల విషయంలో యుపి అధికారులు తీసుకున్న అతి జాగ్రత్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఢిల్లీ నుండి అష్టకష్టాలు పడి యూపీ చేరుకున్న వలస కార్మికులకు చేదు అనుభవం ఎదురైంది. యూపీలోకి అనుమతించేముందు వలస కార్మికులందరినీ ఒకదగ్గర కూర్చోబెట్టి వస్తువుల మీద, రోడ్లమీద స్ప్రే చేసినట్లు సూక్ష్మ క్రిమిసంహారిణులను స్ప్రే చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సోషల్‌ ‌మీడియాలో వైరల్‌గా మారింది. కూలీల కుటుంబాలన్నీ హాహాకారాలు చేస్తున్నా వారిపై అక్కడి ఆరోగ్య సిబ్బంది క్రిమిసంహారక మందును స్ప్రే చేయడంతో వారంతా కండ్లు, ఒళ్ళు మంటలకు గురైనారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ‌కొనసాగుతున్న నేపథ్యంలో పొట్టకూటికోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళిన దినసరి కూలీలు కొరోనా భయం ఒకవైపు, మరోవైపు పనిలేకపోవడంతో తమకుటుంబాలను పోషించుకోలేక స్వగ్రామాల బాటపట్టారు.

లాక్‌డౌన్‌లో కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతుండడంతో వారు తమ గ్రామాలకు చేరేందుకు ఎలాంటి రవాణా సదుపాయాలు లేకపోవడంతో కాలినడక సాగించారు. వందల కిలోమీటర్ల దూరమైన నడవడానికి సిద్ధపడ్డారు. అందులో భాగంగానే వివిధ జిల్లాలు, ప్రాంతాలకు చెందిన వేలాదిమంది ఢిల్లీని విడిచి వారి స్వస్థలాలకు పయనం సాగించారు. వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలేవీ నిలువరించలేకపోయాయి. అయితే లక్షల సంఖ్యలో ఉత్తరప్రదేశ్‌కు చేరుకున్న కూలీలను గుర్తించి, వారిని క్వారంటైన్‌కు పంపించాలని స్థానిక కోర్టు ఆదేశించింది. అయితే ఢిల్లీనుండి రాష్ట్రానికి చేరుకున్న కూలీలకు మాత్రం చేదు అనుభవం ఎదురైంది. ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో జరిగిన ఈ ఘటనతో యావత్‌ ‌భారత్‌దేశం ముక్కుపై వేలేసుకునేలా చేసింది. అక్కడికి చేరుకున్న వలసకూలీలను నగరశివారుల్లోనే అక్కడి ప్రభుత్వ సిబ్బంది అడ్డుకుంది. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా పొరుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా వస్తే ముందుగా వారు పద్నాలుగు రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందే. అలా క్వారంటైన్‌కు తరలించాల్సిన ఈ కార్మికులను నడిరోడ్డుపై కూర్చోబెట్టి డిసిన్ఫెక్టెంట్‌ ‌కెమికల్‌తో వారిపై స్ప్రే చేసింది. అదికాస్తా సోషల్‌ ‌మీడియాలో వైరలై కూర్చుంది. దీంతో అక్కడి ప్రభుత్వం వెంటనే స్పందించి, విచారణకు ఆదేశించడంతో పాటు, అమానవీయంగా ప్రవర్తించిన అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించడం వేరే విషయం.

- Advertisement -

ప్రపంచాన్నంతా గడగడలాడిస్తున్న మహమ్మారి కొరోనా వైరస్‌ ‌ప్రపంచ ప్రజలందరినీ ఇంటికే పరిమితం చేస్తుంటే వలస కార్మికుల బతుకులు మాత్రం త్రిశంఖుస్వర్గంలా తయ్యారైంది. ముఖ్యంగా మనదేశం విషయానికొస్తే నూటముప్పైకోట్ల జనాభాలో వివిధ రంగాల్లో పనిచేసే కార్మిక శక్తే ఎక్కువ. వీరిలో చాలావరకు దినసరి వేతనంతో తమ బతుకులు వెళ్ళబోసుకుంటున్నవారే. మహమ్మారి కొరోనా దేశంలో విస్తృతంగా ప్రబలుతుండంతో కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా లాక్‌డౌన్‌ ‌ప్రకటించింది. ముందుస్తు వ్యవధి లేకపోవడం ఒకటైతే, ఆర్థిక బలం లేని కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది వలస కార్మికులు ముందస్తు జాగ్రత్తలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ 21‌రోజులు కొనసాగనుండగా, మొదట్లో దానివల్లవచ్చే ఉపద్రవాన్ని ఊహించుకోలేకపోయిన కార్మికులిప్పుడు ఉండడానికి సరైన గృహాలులేక, రోజుకూలీతో కాలక్షేపం చేసేవీరికి ఆహారసామగ్రిని కొనుగోలుచేసేందుకు డబ్బులులేక నానా ఇబ్బందులను ఎదుర్కుంటున్న తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని హామీలిచ్చినప్పటికీ తమ ఊరిలో తమవారి మధ్యన ఉండేందుకే వారు సిద్ధపడ్డారు.

రైళ్ళులేవు, బస్సులులేవు, ప్రైవేటు వాహనాలు లేవు, చివరకు ఆటోలు కూడా నడవని పరిస్థితిలో, చేతిలో డబ్బులులేక, తినడానికి తిండిలేక నానా అవస్థలు పడుతూ తమ పిల్లాపాపలను, సామాగ్రిని తీసుకుని కాలికి బుద్దిచెప్పారు. అడుగడుగున పోలీసు ఆంక్షలు, రాష్ట్రాల మధ్య సరిహద్దుల మూసివేతలతో ముందుకు పోలేక, తిరిగి వెనక్కు వెళ్ళలేక వందల కిలోమీటర్లు నడిచారు. గుజరాత్‌ ‌నుంచి ఓ కార్మికుడు 450 కిలోమీటర్లు దూరం కాలినడకన తన భార్య, ఇద్దరు పిల్లలతో నడిచిన విషయం మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. ఇలా యూపీ, గుజరాత్‌, ‌రాజస్థాన్‌ ‌తదితర ప్రాంతాల్లోని తమ స్వగృహాలకు వారంతా కాలినడకన బయలుదేరడం వారి దీనావస్థను చెబుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉపాధి కోసం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినవారనేకు లున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కార్మికులు ఉపాధికోసం దుబాయ్‌, ‌బొంబాయి, ఢిల్లీ లాంటి ప్రదేశాలకు వలసవెళ్ళితే, మనదగ్గర జరుగుతున్న గృహనిర్మాణ రంగంతో పాటు ఇతర రంగాల్లో పనిచేసేందుకు రాజస్థాన్‌, ‌బీహార్‌, ఒడిశా, ఏపి, కర్ణాటక, తమిళనాడు నుంచి వలసవచ్చిన వేలాదిమందికి ఇప్పుడు కొరోనా కారణంగా పనిలేకుండాపోయింది. అయినప్పటికీ తెలంగాణ సర్కార్‌ ‌మాత్రం వారిని అలానే గాలికి వదిలేయకుండా తగిన చర్యలు తీసుకుంటున్నది. వారందరిని రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములుగా గుర్తిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌ప్రకటించారు. ఎవరూ, ఎక్కడికీ వెళ్ళాల్సిన అవసరం లేదని, వారున్నదగ్గరికే వారికి ఆహార, ఆర్థిక సహాయాన్ని అందించేఏర్పాట్లను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం, నిజంగానే వలస కార్మికుల బతుక్కు భరోసా ఇచ్చినట్లైంది.

Leave a Reply