Take a fresh look at your lifestyle.

కేసులు ఎక్కువయినా…వైద్యం అందిస్తాం..!

  • హై కోర్టు సూచనలు అమలు సాధ్యం కాదు..
  • మీడియా లో దుష్ప్రచారం…
  • వైద్యాధికారుల ప్రకటన

కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స అందించడానికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలు, పరికరాలు సిద్ధంగా ఉన్నాయని, ఎంతమందికైనా చికిత్స చేసే సామర్థ్యం ప్రభుత్వ ఆసుపత్రులకు ఉందని రాష్ట్ర వైద్యశాఖ అధికారులు, నిపుణులు స్పష్టం చేశారు. ఈ విషయంలో కొన్ని మీడియా సంస్థలు, కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేసి, ప్రజలను గందరగోళ పరుస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రచారం వెనుక కుట్ర ఉందని కూడా వారు అనుమానం వ్యక్తం చేశారు. 2వేల మందికి పైగా చికిత్స అందించగలిగే సామర్ధ్యం కలిగిన గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం 247 మంది మాత్రమే కోవిడ్ వైరస్ సోకిన వారున్నారని వారు స్పష్టం చేశారు. వాస్తవం ఇదైతే కొంత మంది పని గట్టుకుని గాంధి ఆసుపత్రి కోవిడ్ పేషంట్లతో కిక్కిరిసిపోయిందని ప్రచారం చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు నిరంతరం పిల్స్ వేయడం వల్ల రోజూ కోర్టుకు తిరగాల్సి వస్తున్నదని, దీనివల్ల తాము వైద్యసేవలు అందించడంలో ఇబ్బంది కలుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ కారణంతో మరణించినా సరే, వారందరికీ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలనే హైకోర్టు ఆదేశం అమలుకు సాధ్యం కాదని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని వారు అభ్యర్థించారు.

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, నివారణ చర్యలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజెందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, కమిషనర్ యోగితా రాణా, డిఎంఇ రమేశ్ రెడ్డి, డిఎంహెచ్ శ్రీనివాస్, కోవిడ్ నిపుణుల కమిటి సభ్యుడు గంగాధర్, హెల్త్ యూనివర్సిటీ విసి కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కరోనా విషయంలో వాస్తవ పరిస్థితికి, మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఏమాత్రం పొంతన లేదని ఈ సందర్భంగా వైద్యాధికారులు, నిపుణులు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తెచ్చారు. కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నరని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల ప్రజలు అనవసర ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. వారు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చిన అంశాలు ఈ విధంగా ఉన్నాయి.

– గాంధి ఆసుపత్రి కరోనా పేషంట్లతో కిక్కిరిసిపోతున్నదని కొందరు ప్రచారం చేస్తున్నారు. కొన్ని పేపర్లు, టివిలలో కూడా అలాగే చెపుతున్నారు. కానీ ఇది పూర్తిగా అబద్ధం. గాంధి ఆసుపత్రిలో 2150 మందికి చికిత్స అందించే అవకాశం ఉంది. ఇందులో వెయ్యి ఆక్సిజన్ సౌకర్యం కలిగిన బెడ్లు ఉన్నాయి. ప్రస్తుతం గాంధి ఆసుపత్రిలో కేవలం 247 మంది కరోనా పేషంట్లు మాత్రమే ఉన్నారు. గాంధిలో ఉన్న సౌకర్యాలనే పూర్తిగా వాడుకునే అవసరం ఇంత వరకు రాలేదు. వైరస్ సోకిన వారిలో చాలా మంది కోలుకుని డిశ్చార్జి అయి, ఇంటికెళ్లారు. ఎలాంటి లక్షణాలు లేని వారికి హోమ్ ట్రీట్మెంట్ అందిస్తున్నాము.

– పేషంట్లు ఎక్కువైతే చికిత్స అందించే ఏర్పాట్లు లేవని కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. నిజానికి దేశంలోని ఇతర రాష్ట్రాలకన్నా తెలంగాణ రాష్ట్రంలోనే వైద్య ఆరోగ్య శాఖ పూర్తి సంసిద్ధంగా ఉంది. 9.61 లక్షల పిపిఇ కిట్లను సిద్ధంగా ఉంచాము. 14 లక్షల ఎన్ 95 మాస్కులున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సౌకర్యం కలిగిన బెడ్స్ మొత్తం 3600 సిద్ధంగా ఉంచాము. వెంటిలేటర్లు, టెస్ట్ కిట్లు, ట్యాబ్లెట్లు, ఇతరత్రా పరికారలన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఏ కొరతా లేదు. ఎంతమందకైనా చికిత్స అందించడానికి వైద్యశాఖ పూర్తి సంసిద్ధంగా ఉంది.

– గాంధి ఆసుపత్రిలో చికిత్స పొంది, కోలుకుని ఇళ్లకు పోయిన వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆసుపత్రిలో సకల సౌకర్యాలతో మంచి వైద్యం అందించారని బహిరంగంగా చెబుతున్నారు. వైరస్ సోకిన వారు అంత తృప్తిగా ఉంటే, కొందరు మాత్రం విమర్శలు చేయడం బాధాకరం.
– వైద్యులకు, వైద్య సిబ్బందికి కరోనా సోకుతున్నదనే ప్రచారం చేసి ఆత్మస్థైర్యం దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా సోకిన వారికి వైద్య సేవలు అందించే వారికి కూడా వైరస్ సోకుతున్నది. ఇది చాలా సహజం. కేవలం తెలంగాణలోనే జరగడం లేదు. ఢిల్లీ ఎయిమ్స్ లో 480 మందికి కరోనా వైరస్ సోకింది. ఐసిఎంఆర్ అంచనా ప్రకారమే భారతదేశంలో 10వేల మంది వైద్యసిబ్బందికి కరోనా సోకింది. అమెరికాలో 68 వేల మంది వైద్య సిబ్బందికి సోకింది. బ్రిటన్ లో వైరస్ సోకిన వారిలో 15 శాతం మంది వైద్య సిబ్బంది ఉన్నారు. ఇదే తరహాలో తెలంగాణలో ఇప్పటి వరకు 153 మంది వైద్య సిబ్బందికి కరోనా వైరస్ సోకింది. తెలంగాణలో వైరస్ సోకిన వైద్య సిబ్బందిలో ఎవరూ సీరియస్ గా లేరు. వారు మా తోటి వైద్య సిబ్బంది. వారి ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉంటున్నాం. వారంతా కోలుకుంటున్నారు. కేవలం తెలంగాణలో మాత్రమే వైద్య సిబ్బందికి కరోనా సోకుతున్నట్లు దుష్ప్రచారం చేయడం బాధాకరం.

– కరోనా మరణాలుగా చెప్పబడేవన్నీ కూడా కేవలం కరోనా వల్ల సంభవించిన మరణాలు కాదు. దాదాపు 95 శాతం ఇతర కారణాలతో చనిపోయిన వారే. కిడ్నీ, గుండె, లివర్, శ్యాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడే వారు, క్యాన్సర్ వ్యాధి గ్రస్తులు, షుగర్, బిపి ఉన్న వారు చనిపోతున్నారు. ఇతర జబ్బులతో చనిపోయినప్పటికీ, వారికి కరోనా పాజిటివ్ ఉంది కాబట్టి, కరోనాతోనే చనిపోయినట్లు నిర్థారిస్తున్నారు. ఇది అశాస్త్రీయమైన అవగాహన. ఇలాంటి తప్పుడు ప్రచారం వల్ల ప్రజల్లో ఆందోళన ఎక్కువవుతున్నది.
– కరోనా విషయంలో తరచూ ఎవరో ఒకరు కోర్టులో పిల్స్ వేస్తున్నారు. దీనివల్ల ప్రతీ రోజు సీనియర్ వైద్యాధికారులు కోర్టుకు వెళ్లాల్సి వస్తున్నది. రోజంతా ఆ పనితోనే సరిపోతున్నది. దీనివల్ల కరోనా కేసులతో పాటు, ఇతర కేసులను పర్యవేక్షించడం కష్టంగా మారుతున్నది. ఈ పిల్స్ లన్నీ నిజానికి ఉద్దేశ్యపూర్వకంగా వేస్తున్నవనే తెలుస్తున్నది. దీనివల్ల వైద్యాధికారుల విలువైన సమయం వృధా అవుతున్నది.

– ఏ కారణంతో చనిపోయినా సరే, మరణించిన ప్రతీ ఒక్కరికీ కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించాలనే హైకోర్టు ఆదేశాలు అమలుకు సాధ్యం కానివి. రాష్ట్రంలో వివిధ కారణాల వల్ల ప్రతీ రోజు సగటున 900- 1000 మంది వరకు మరణిస్తుంటారు. రాష్ట్రంలో ఏదో మూల ఏదో కారణంతో ఎవరో చనిపోతుంటారు. వారందరికీ పరీక్షలు చేయడం ఎలా సాధ్యమవుతుంది. వైద్య సిబ్బంది వారికి పరీక్షలు చేయడమే పనిగా పెట్టుకుంటే, ఆసుపత్రుల్లో ఇతర వైద్య సవేల అందించడం సాధ్యం కాదు. రకరకాల జబ్బులతో వచ్చే వారు, డెలివరీల కోసం వచ్చే వారు ఉంటారు. ఇప్పుడు కరోనాతో వస్తున్న వారు ఉంటున్నారు. వారందరినీ వదిలేసి, మృతదేహాలకు పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు. డబ్ల్యు.హెచ్.ఓ. గానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, ఐసిఎంఆర్ కానీ మృతదేమాలకు పరీక్షలు నిర్వహించాలని చెప్పలేదు. హైకోర్టు ఆదేశాలు ఎట్టి పరిస్థితుల్లో ఆచరణ యోగ్యం కాదు. ఈ ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోవాలి.

ఆందోళన అనవసరం, అంతా సిద్ధం: సిఎం కేసీఆర్
కరోనా వైరస్ విషయంలో ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలే తప్ప, అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కరోనా సోకినప్పటికీ చాలా మందిలో ఎలాంటి లక్షణాలు కూడా కనిపించడం లేదని, చాలా తక్కువ మంది, అది కూడా ఇతర తీవ్రమైన జబ్బులున్న వారు మాత్రమే తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని చెప్పారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని, అదే సమయంలో ప్రజలు కూడా ఎవరికి వారు వ్యక్తిగతంగా పరిశుభ్రత పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకవాలని సూచించారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువైనా సరే, తగిన వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఐసిఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం సీరియస్ ఉన్న వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నామని, వైరస్ సోకినప్పటికీ లక్షణాలు లేని వారికి హోమ్ ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు సిఎం వెల్లడించారు.

Leave a Reply