Take a fresh look at your lifestyle.

 ‌స్వప్నం సాకారానికి ఇంకెన్నాళ్ళు..!

‘‘ఒక స్వప్నం సాకారమైంది. ఎన్నో నిర్బంధాలు, ఎన్నో అడ్డంకుల మధ్య తెలంగాణ సాకారం చేసుకున్న ఘనత తెలంగాణ ప్రజలకే దక్కుతుంది. ఆ విజయం తెలంగాణ ప్రజలకు మాత్రమే అంకితం. ఇప్పుడు మరో స్వప్నం దిశగా నా లక్ష్యం కొనసాగనుంది. అదే బంగారు తెలంగాణ సాధన. అప్పటి వరకు విశ్రమించేది లేదు. ఇది తప్ప నాకు వేరే పనిలేదు. ప్రధానంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాల్సి ఉంది. నిజంగానే వారికి వంద శాతం రావాల్సిందే. వచ్చి తీరుతాయి కూడా. వందశాతం కాంట్రాక్టు ఉద్యోగాలను రెగ్యులరైజ్‌ ‌చేస్తం. కులం, మతంతో ప్రమేయం లేకుండా అందరూ ఒకే పాఠశాలలో ఒకటే యూనిఫాంతో ఒకటే సిలబస్‌తో చదువుకోవాలన్నది ఆకాంక్ష. అదే కేజీ టు పీజీ ప్రభుత్వపరంగా నిర్వహించాలన్నదే నాకున్న పెద్దకల. ఇలాంటి కలలు ఇంకా చాలా ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ ‌లో తెలంగాణ ప్రజలు చాలా కోల్పోయారు. వారి ఆశలు, ఆశయాలను నెరవేర్చాల్సి ఉంది.

 

ఈ కలలన్నీ నెరవేరాలంటే మీరంతా నా వెంట ఉండాలె. తెచ్చుకున్న తెలంగాణ గుంటనక్కలపాలు కాకుండా చూడాల్సి ఉంది. ఈనగాచి నక్కలపాలు కావద్దు. బడుగు బలహీన వర్గాల జీవితాలు బాగుపడాలె. రైతన్నలు సుఖంగా ఉండాలె. అందరూ చిరునవ్వులతో ఉండాలె. అప్పుడే బంగారు తెలంగాణ అవుతుంది ..’’ తెలంగాణ ఏర్పడిన కొత్తలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కెసిఆర్‌ ‌చేసిన ప్రసంగం లోని కొన్ని అంశాలు మాత్రమే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి నేటికి ఏడేళ్ళు పూర్తికావస్తున్నది. ఆనాటి సమైక్య పాలకుల దుర్మార్గపూరిత, దోపిడీ పూరిత పాలన ఈ ఏడేళ్ళలో నిజంగానే అంతమైందా? స్థానిక ప్రజల ఆత్మగౌరవం నిలబడిందా? ఈ ప్రాంత వనరులు ఇక్కడి ప్రజానీకానికే దక్కుతున్నాయా? బతుకుదెరువుకోసం ఆనాడు బొంబాయి, దుబాయి వలస బాట పట్టిన తెలంగాణ కార్మికులకిప్పుడు ఆ అవసరం లేకుండా పోయిందా? తెలంగాణ ప్రజల స్వప్నాలన్నీ నెరవేరినట్లేనా అన్నవి ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో చర్చనీయాంశమైన అంశాలు.

 

దీనిపై విపక్షాలేమంటున్నాయంటే..

తెలంగాణ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ‌మాట ల్లో చెప్పాలంటే బిశ్వాల్‌ ‌కమిటీ చెప్పినట్లు లక్షా 90 వేల ఉద్యోగాలతో పాటు మరో రెండు లక్షల ఉద్యోగాలు నింపే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. 2017లో స్టాఫ్‌ ‌నర్స్ఉద్యోగాలకోసం నోటిఫికేషన్‌ ఇచ్చిన ప్రభుత్వం వాటినే నేటివరకు పూర్తిస్థాయిలో నియామకాలు జరుపలేదు. అర్హులైన ఇంకా 893 మంది విషయంలో ప్రభుత్వం ఎటూ తేల్చడం లేదు. ఇలాంటివి అనేకం ఉన్నాయి. గ్రూప్‌ ఒన్‌ ‌నోటిఫికేషన్‌లు లేక దాదాపు పదేళ్ళు గడుస్తున్నది. పైగా ఉద్యోగాల విషయంలో రోజుకో కొత్త హామీ ఇవ్వడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారింది.

 

అలాగే తెలంగాణలో ఎక్కడ చూసినా అవినీతి తాండస్తున్నదన్నది భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఆరోపణ. ప్రాజెక్టులను ప్రజలకోసం కాకుండా కమీషన్‌లకోసం నిర్మిస్తున్నట్లుందంటూ, తెలంగాణ ఇప్పుడు ఎందులో ముందున్నదంటే కరప్షన్‌లో మాత్రమే నంటాడాయన. ప్రజల ఉపాధిని పట్టించుకోకుండా కేవలం తమ కుటుంబ సభ్యులకే ఈ ప్రభుత్వం ప్రాధాన్యత నిస్తోందంటుండగా, కెసిఆర్‌ ‌కుటుంబమే తెలంగాణను శాసిస్తున్నదని కేంద్ర  హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆంటున్నారు.   తెలంగాణలో కొత్తగా పార్టీ పెట్టబోతున్న వైఎస్‌ ‌షర్మిల మాటల్లో చెప్పాలంటే ఈ ఏడేళ్ళకాలంలో పాలకులు బంగారు తెలంగాణ కాదు, బట్టలు విప్పిన తెలంగాణ మార్చారు. తెలంగాణ ఏర్పడిందే నిధులు, నీళ్ళు, నిరుద్యోగమన్న ట్యాగ్‌లైన్‌ ‌మీద అయితే ఈ ఏడేళ్ళకాలంలో ప్రభుత్వం ఆ విషయంలో ఏమాత్రం శ్రద్ధ పెట్టలేదు, తెలంగాణ వస్తే తమకు ఉద్యోగాలొస్తాయని ఆశపడిన నిరుద్యోగ యువత ఆశలు నీరుగారి పోయాయని, ఉపాధి కరువవడంతో అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నది ఆమె ఆరోపణ. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఉద్యోగ నియామకాలను వాయిదా వేస్తూ రావడంతో ఇప్పుడు రాష్ట్రంలో లక్షా 92వేల ఖాళీలు ఏర్పడ్డాయంటూ ఇటీవల ఆమె కేసిఆర్‌ ఇలాఖాలోనే దీనిపై దీక్ష నిర్వహించడం గమనార్హం.

 

ఇదిలా ఉంటే టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చలేకోపోయిందన్నది తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ఆరోపణ, కాగా తెరాస ప్రభుత్వంలో ఏ ఒక్క మంత్రికూడా ఆత్మగౌరవంతో ఉండలేకపోతున్నారని ఇటీవల మంత్రివర్గం నుండి బహిష్కృతుడైన ఈటెల రాజేందర్‌ ఆవేదన. ప్రాణాలకు తెగించి రాష్ట్రం కోసం పోరాడినవారికన్నా, ఉద్యమకారులను తన్ని తరిమినవారే అధికారానికి చేరువయ్యారన్నది ఆయన బాధ. ఆనేక మంది తెరాస ప్రజాప్రతినిధులపై అనేక ఆరోపణలున్నాయని, వారిపైన చర్యలు ఎవరు తీసుకుంటారన్నది ప్రశ్నార్థకంగా మారిందన్నది ప్రజలనుండి వస్తున్న స్పందన. ఈ చిక్కుముడులను విప్పుకుని స్వప్నించిన బంగారు తెలంగాణకు బాటలెప్పుడు పడుతాయన్నదే అర్థంకాని ప్రశ్నగా మిగిలింది.

Leave a Reply