Take a fresh look at your lifestyle.

భవిష్యత్తులో మరిన్ని .. ప్రజా పోరాటాలు నిర్వహిస్తాం

  • భూ నిర్వాసితుల పోరాటంలో క్రియాశీల పాత్ర పోషించాం: టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌
  • ‌నిరాడంబరంగా జనసమతి 2వ వార్షికోత్సవం

ప్రజా సమస్యల పరిష్కారం దిశగా భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు నిర్వహిస్తామని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ ‌స్పష్టం చేశారు. గతంలో ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తున్న ప్రాంతాలలో భూ నిర్వాసితులను ఆదుకునేందుకు ప్రభుత్వంపై వొత్తిడి తీసుకొచ్చి వారికి న్యాయం జరిగేలా విజయం సాధించామని తెలిపారు. బుధవారం టీజేఎస్‌ ‌రెండో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. టీజేఎస్‌ ‌నాయకులు లాక్‌డౌన్‌ ‌నిబంధనలకు అనుగుణంగా సామాజిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ ఆవిర్భవించిన రెండేళ్లలో ప్రజల పక్షాన నిలబడి అనేక ఉద్యమాలు చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో నిరుద్యోగం, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలలోని సమస్యలపై ఉద్యమిస్తూ పార్టీని బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు.

అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు సరైన పద్దతిలో జరగడం లేదనీ, తాలు పేరుతో రైతులను దళారులు మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో నియంతలా వ్యవహరిస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువకుల సమస్యలు పట్టకపోవడంతో వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైందని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ అసలు ఆ ఉద్దేశాన్నే మరచిపోయిందని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరేళ్లు దాటినప్పటికీ వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై దృష్టి సారించపోవడం దురదృష్టకరమని ప్రొ.కోదండరామ్‌ ఈ ‌సందర్భంగా విమర్శించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply