మూలిగే నక్కపై తాటిపండు పడ్డదన్న చందంగా ప్రజల తీరు ఉంది. అసలే అంతంతమాత్రంగా ఉన్న ప్రజల ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వాల దాడులు అధికమయ్యాయి. ధరలు దాడి చేస్తున్నాయి. నిరుద్యోగం దాడి చేస్తోంది. కంపెనీలు ఉద్యోగాలను తొలగిస్తున్న వేళ ఆర్‌బి తీసుకుంటున్న నిర్ణయాలు శరాఘాతంగా మారు తున్నాయి. తాజాగా ఆర్‌బిఐ రెపోరేటుతో ఉద్యోగ, మధ్య తరగగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపనుంది. భారత రిజర్వు బ్యాంకు సంవత్సరం తిరక్కుండానే ఆరోసారి రెపో రేట్ పెంచింది. ప్రస్తుతం 25 బేస్ పాయింట్లు పెరిగి వడ్డీ 6.5 శాతానికి చేరుకుంది. దీనివల్ల బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు దగ్గర తీసుకునే అప్పులకు కట్టాల్సిన వడ్డీలు పెరుగుతాయి. ఆ వడ్డీల్ని ఋణం తీసుకునే ఖాతాదారుల నుండి కక్కిస్తాయి. దీంతో ఇంటి రుణం వాయిదాలతో సహా కొత్త రుణాలూ, పాతవీ అన్నీ ప్రియమవుతాయి. తద్వారా నగదు చలామణీ కట్టడి జరిగి ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని ఆశ కావచ్చు. ద్రవ్యోల్బణం అదుపు చెయ్య డానికి ఇది శాస్త్రీయ మార్గమే అయినప్పటికీ, ప్రజల్ని బాదే ఈ మార్గమే ఏకైక మార్గంగా కనబడడం బాధాకరం.
రిజర్వు బ్యాంకు దాని లెక్కల్లో అది ఉన్నా ప్రజలకు ఉపశమనం కలిగించడానికి అందుబాటులో ఉన్న మిగతా మార్గాల్ని ప్రభుత్వం చూడడం లేదు. ప్రజల కొనుగోలు శక్తి పెంచడానికి, ఉపాధి పెంచడా నికి చిత్తశుద్ధితో ప్రయత్నించడం లేదు. ద్రవ్యోల్బణం పెరుగుతూ పోవడానికి డిమాండ్ పెరగడమే కాకుండా సరఫరా తగ్గడమూ పెద్ద కారణమే. అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా వాటిని దిద్దడం ఇప్పటికిప్పుడే సాధ్యం కాకపోవచ్చు. ముడి చమురు ధరలు, మార్కెట్ ఒడిదుడుకులు ఇంకా పెరిగి భారం కావొచ్చు. అయితే ఉన్నంతలో ప్రభుత్వం ఎంత చెయ్యగలిగిందన్నదే ప్రధానం. ఇటీవలి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో మిగతా దేశాల ఆర్ధికం కొరోనాతో కుదేలైతే, మన దేశం మాత్రం నిలిచి కోలుకుందని చెప్పారు. నిలవడమంటే ఏమిటో ప్రజలకు తెలియడం లేదు. వైద్య, విద్యా రంగాలకు పెద్దగా కేటాయింపులు జరిగిన దాఖలాలు కూడా లేవు.
గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులకోత జరిగింది. ఇప్పుడు బ్యాంకుల వడ్డీలు పెరిగి చేతిలో డబ్బు ఆడడం ఇంకొంచెం కష్టం కాబోతుంది. ద్రవ్యోల్బణం 6.5 శాతానికి కట్టడి చెయ్యగలం అంటున్న పాలకులు ఇలా చేస్తూ పోతే ప్రజలకు మరిన్న కష్టాలు తప్పవన్న విషయాన్ని గుర్తించడం లేదు. జిఎస్టీతో కొరడా దెబ్బలు కొడుతున్న కేంద్రానికి జనం బాధలు పట్టడం లేదు. భారత దేశంలో పేదమధ్య తరగతి ప్రజలే అధికమన్న సంగతిని గుర్తించడం లేదు. ఏ పన్ను విధించి నా అది నేరుగా ప్రజలపైనే పడుతుందని, దానివల్ల ప్రజలు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో గుర్తించకుండా కేవలం జిఎస్టీ పరమౌషధం అన్న విధంగా ప్రచారం చేస్తూ వచ్చారు. భారతదేశంలాంటి దేశంలో ఇంతగా పన్నలు భారం అవసరమా అన్న ఆలోచన చేయడం లేదు. రాజకీయ దుబారాలను తగ్గించుకోవడం లేదు. జిఎస్టీ ఎంతగా తక్కువగా ఉంటే అప్పులు అంతగా వసూళ్లు అవుతాయి. ఎక్కువమంది జిఎస్టీ పరిధిలోకి వచ్చే అవకాశాలు పెరుగుతాయని, ఆర్థిక నిపుణులు మొత్తుకుంటున్నా పట్టించుకోని మోదీ సర్కార్ పెడచెవిన పెడుతూ వచ్చింది.
అతిపెద్ద ఆర్థిక సంస్కరణ అంటున్న ప్రధాని మోదీ దివంగత ప్రధాని పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలతో పోల్చుకుంటే.. సంస్కరణలు ఎలా ఉండాలో తెలుస్తుంది. దివంగత ప్రధాని పిని చేపట్టిన సంస్కరణలు ప్రజలకు ఎలా చేరగలిగాయో ఆలోచన చేయాలి. 18శాతం జిఎస్టీ కూడా అధికమని ఎంత త్వరగా గుర్తిస్తే అంతమంచిది. ఇబ్బడి ముబ్బడిగా పన్నులు వసూలు చేసి వోటుబ్యాంకు కోసం పథకాలు ప్రకటించి వాటికి ఖర్చు చేయడం మంచిది కాదు. పథకాలను పునరాలోచన చేయాలి. ఉపాధి హామీ బడ్జెట్ లో కోత వల్ల వేలకోట్లు దుర్వినియోగం అవుతున్నాయి. వాటి కారణంగా గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థ చితికి పోయింది. పనిచేయకున్నా కూలి వస్తోందన్న ధీమాతో ఇతరత్రా కూలీలకు వెళ్లడం లేదు. విద్య,వైద్య రంగాలు, కమ్యూనికేషన్, రోడ్డు,రవాణా రంగం అభివృద్ది చేసి, ప్రజలు స్వయం సమృద్ది సాగించేలా పాలన సాగాలి. రాష్టాలు కూడా ప్రజాకర్షక పథకాలతో ప్రజలు చెమటోడ్చి పన్నుల రూపంలో కట్టిన డబ్బులు దుబారా చేయకుండా చూడాలి. ఇలాంటి పథకాలపై కేంద్రం అజమాయిషీలో నియంత్రణ ఉండాలి. పండగలు, పబ్బాలు, కులాలు,మతాల పేరుతో డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా, కేవలం అభివృద్ది పథకాలకు మాత్రమే ఖర్చు చేయగలగాలి. ప్రజల కోసం కాకుండా కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పెంచిన పన్నులు తగ్గించి మెహర్బానీ ప్రకటించినంత మాత్రాన ప్రజలకు మేలు జరగదని గుర్తించాలి.
ఆర్‌బిఐ ఇలా రెపోరేటును పెంచడం వల్ల భారం ప్రజలపై ప్రత్యక్షంగా పడుతోంది. గృహ, వాహన రుణాలు భారం అవుతాయి. ఇకపోతే జిఎస్టీ ఆమోదించినప్పుడే వ్యక్తం అయిన అభ్యంత రాలను గమనించి పెద్దమొత్తంలో పన్నుల విధింపును ఆలోచన చేసివుంటే బాగుండేది. తొలుత వసూళ్లకు పాల్పడి, జిఎస్టీ తగ్గింపు వల్ల ఇప్పుడు నష్టం వస్తోందని ప్రకటించడం కేవలం వ్యాపారధోరణి తప్ప మరోటి కాదు. నిర్మాణరంగానికి అత్యంత కీలకమైన సిమెంటు,పెయింట్లను మాత్రం విలాస వస్తువుల జాబితాలోనే ఉంచింది. జిఎస్టీ అమలు కోసం తొందరపాటు ప్రదర్శించిన సమయంలోనే దీనిపై సవాలక్ష అనుమానాలు, అభ్యంతరాలు ఉన్నాయని విపక్షాలు గగ్గోలు పెడుతున్నా, వ్యాపారులు ఆందోళన చేసినా..తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్నచందంగా మోదీ సర్కార్ దూకుడుగా అమలు చేసింది.కేంద్రప్రభుత్వం కేవలం వ్యాపార ధోరణితో తీసుకున్న నిర్ణయం తప్ప పాలనా సంస్కరణ అనడానికి లేకుండా చేశారు. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా వర్తకులు ఆందోళన చెందుతున్నా పట్టించుకోవడం లేదు. జిఎస్‌టితో పన్ను విధానం అమల్లోకి వచ్చిందే తప్ప ఆర్థిక సంస్కరణలు అనడానికి వీల్లేకుండా చేసింది. ఆర్‌బిఐ వడ్డీరేట్లు, బ్యాంకులు విధించే పన్నులు, జిఎస్టీ తదితరాలన్నీ ప్రజల కోణంలో నిర్ణయించాలి. భారతదేశంలో పేద,మధ్య తరగతి ప్రజలే ఎక్కువ కనుక తీసుకునే ప్రతి నిర్ణయం వారిపై భారం పడుతుందని పాలకులు గుర్తించాలి. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేయాలి. అలా చేయకుండా చేసే ఎలాంటి పనులయినా ప్రజలపై భారం మోపుతాయని గుర్తిస్తే మంచిది. ఆర్‌బిఐ తాజా రెపోరేటు నిర్ణయం కూడా ఈ కోవలోకే వస్తుంది.
– ప్రజాతంత్ర డెస్క్