పేదలకు కార్పొరేట్ వైద్యం అందేలా చర్యలు..మార్పులకు యత్నం
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్
తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య శ్రీని పకడ్బందీగా అమలు చేస్తామని, ఈ విషయంలో ఎవరూ అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. కార్పొరేట్ హాస్పిటళ్లలో ఆరోగ్యశ్రీ సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించామని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఆరోగ్యశ్రీలో మార్పులు చేస్తున్నామని చెప్పారు. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్లినా ఏ ఒక్కరోగి కూడా వెనక్కి తిరిగి రాకుండా.. ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అర్హులైన పేదలపై ఒక్క రూపాయి కూడా భారం పడకుండా చికిత్స అందిస్తామన్నారు. అందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. కొరోనా తీవ్రత, కేసులు తగ్గినా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బతుకమ్మ, దసరా పండుగల సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.
లేకుంటే కేరళ అనుభవాలను ఎదుర్కోక తప్పదన్నారు. కేరళలో ఓనమ్ వేడుకల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడంతో ఒక్కసారిగా కోవిడ్ కేసులు పెరిగాయని, రాష్ట్రంలోనూ బతుకమ్మ, దసరా పండుగల్లో ప్రభుత్వ సూచనలను పాటించాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. పాటించకపోతే కేరళ తరహాలో సమస్యలు వస్తాయన్నారు. గాంధీ హాస్పిటల్ మినహా అన్ని హాస్పిటళ్లలో అన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. కోవిడ్ సేవల్లో ఉన్న వైద్య సిబ్బంది మినహా ఇతరులు విధులకు రావాలని ఆదేశించారు. దేశ వ్యాప్తంగా నులిపురుగుల నివారణ కార్యక్రమం జరుగుతుందన్నారు. కడుపులో నులి పురుగులు ఉంటే పిల్లల్లో ఎదుగుల ఉండదని, తెలంగాణలో ఇంటింటికి వైద్య సిబ్బంది వెళ్లి అల్బండజోల్ ట్యాబ్లెట్స్ వేసే కార్యక్రమం చేపడతామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.