Take a fresh look at your lifestyle.

తెలంగాణకు చేరుకున్న నైరుతి

  • పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు
  • భద్రాద్రి జిల్లాలో పొంగుతున్న వాగులు
  • వర్షంతో హైదరాబాద్‌లోనూ చల్లబడ్డ వాతావరణం

తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. నిజామాబాద్‌, ‌పెద్దపల్లి జిల్లా వరకు రుతుపవనాలు విస్తరించాయి. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ ‌వాతావరణ శాఖ హెచ్చరించింది. వాస్తవానికి గత రెండు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల  ముసురు కురుస్తున్నది. అల్పపీడన ప్రభావంతో మంగళవారం రాత్రి మొదలైన వాన బుధవారం సాయంత్రం దాకా కురిసింది. భద్రాద్రి జిల్లాలో ఎగువన కురిసన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో వాగులు పొంగుతున్నాయి.  కిన్నెరసాని, మల్లన్నవాగు, ఏడుమెలికలవాగుకు వరద ఉధృతి అధికంగా ఉంది. దీంతో గుండాల నుంచి మణుగూరు, నర్సంపేట, వరంగల్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌లో గత రాత్రి కురిసిన వానతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలో సాధారణం కంటే రెట్టింపుగా వర్షపాతం నమోదు అయ్యింది. గత రెండేళ్లతో పోలిస్తే ఈ సారి అత్యధిక స్థాయిలో వర్షపాతం నమోదు అవడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో జూన్‌ 1 ‌నుండి 11 వరకు సాధారణ వర్షపాతం 37 మిల్లీటర్లు కాగా, అధికంగా 79 మిల్లీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. మెదక్‌ ‌జిల్లాలో సాధారణ వర్షాపాతం 42.7 మిల్లీటర్లు కాగా, 88.9 మిల్లీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. సిద్ధిపేట జిల్లాలో సాధారణ వర్షపాతం 23.6 మిల్లీటర్లు కాగా… అత్యధికంగా 66.6 మిల్లి టర్ల మేర వర్షపాతం నమోదు అయ్యింది. నిర్మల్‌ ‌జిల్లాలోని ముధోల్‌లో ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. ముధోల్‌ ‌మండలంలో రాయితీ సొయా విత్తనాలు పంపిణీ కావడంతో వ్యవసాయ కార్యాలయం వద్ద టోకెన్ల కోసం రైతులు బారులు తీరారు. వర్షంలోనూ క్యూలైన్‌లో రైతులు నిలుచున్నారు. వికారబాద్‌ ‌జిల్లాలో ఓ మోస్తరు వర్షం పడింది. అన్ని మండలాల్లో తెల్లవారుజామున చిరుజల్లులతో కూడిన వర్షం కురువగా, సాయంత్రం కూడా ఓ మోస్తరు వర్షం కురిసింది. ఇప్పటికే దుక్కి దున్ని విత్తనాలను నాటేందుకు వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఓ మోస్తరు వర్షం మాత్రమే కురియడంతో కాబట్టి ఇప్పుడే ఎవరూ విత్తనాలను నాటోద్దని జిల్లా వ్యవసాయాధికారులు సూచిస్తున్నారుప్రధానంగా 60
నుంచి 70 మి.టర్ల వర్షపాతం నమోదైన తర్వాతనే విత్తనాలను నాటితే నాటిన ప్రతీ విత్తనం మొలకెత్తే అవకాశముంటుందంటున్నారు. మరోవైపు జిల్లాలో వానకాలం సీజన్‌లో 4.80 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగవుతాయని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. అదేవిధంగా జిల్లాలో సరిపోను ఎరువులు, విత్తనాలను కూడా అందుబాటులో ఉంచారు.  మరో ఒకట్రెండు మంచి వానలు కురిసిన అనంతరమే విత్తనాలను నాటాలన్నారు. ఒకవేళ ఇప్పుడే విత్తనాలను నాటితే విత్తనాలు మొలకెత్తవని, మళ్లీ విత్తనాలను నాటాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. రైతులందరూ పత్తి, కంది పంటలను సాగు చేయాలన్నారు. వానకాలం సీజన్‌లో సాగు చేసే పంటలకు సరిపడా ఎరువులు, విత్తనాలను జిల్లాలో అందుబాటులో ఉంచామని వ్యవసాయాధికారి గోపాల్‌ ‌వెల్లడించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!