Take a fresh look at your lifestyle.

‌ప్రభుత్వ పాఠశాలలకు నిధులు రాక నిర్వహణ భారం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల నిర్వహణ కొరకు సమగ్ర శిక్షణ  నుంచి ప్రతి సంవత్సరం నిర్వహణ నిధులు మంజూరవుతాయి. ఈ నిధులను పాఠశాలకు కావలసిన పలురకాల అవసరాలకు ప్రధానోపాధ్యాయులు ఖర్చు చేస్తారు. కానీ ఈ విద్యా సంవత్సరం ఇప్పటి వరకు పాఠశాల నిర్వహణ నిధులు రాకపోవడంతో ప్రధానోపాధ్యాయులు సొంత డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కోవిడ్‌ ‌మూలంగా పాఠశాల నిర్వహణ ఖర్చు తడిసి మోపెడు అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పాఠశాలల అన్నింటికీ నిర్వహణ ఖర్చులు మంజూరు చేయాలి. విద్యార్థులు కోవిడ్‌ ‌బారిన పడకుండా సంరక్షణ చర్యల నిమిత్తం ప్రత్యేక గ్రాంటు అందజేయాలి.

రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు, అధికారులు వివిధ సందర్భాలలో ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తామన్న ఆశలు గల్లంతవుతున్నాయి. ప్రైవేటుకు ధీటుగా తీర్చిదిద్దుదామన్న హామీలు వట్టి మాటలవుతున్నాయి. బడుల నిర్వహణకే గ్రాంట్లు మంజూరు కాక ఆపసోపాలు తప్పడం లేదు. ఈ విద్యా సంవత్సరం ప్రత్యక్ష తరగతులు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా నయాపైసా రాలేదు. చిన్నపాటి వసతుల కల్పనకు ప్రధానోపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు.

లిపాఠశాల నిర్వహణ నిధులు రాక ఇక్కట్లు
ప్రభుత్వ బడుల్లో విద్యుత్తు, తాగునీరు, చిన్నపాటి మరమ్మతులు, స్టేషనరీ, ప్రయోగ సామగ్రి, సుద్దముక్కలు, గ్రంథాలయాల నిర్వహణ కోసం ఏటా నిధులు విడుదలవుతాయి. ఈ గ్రాంట్లను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వివిధ పనులకు వినియోగించి సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారు. కొవిడ్‌ ‌కారణంగా ఏడాదిన్నర పాటు బడులు మూతపడటంతో అనేక ఇబ్బందులు నెలకొన్నాయి. మూడు నెలలు ఆలస్యంగా తరగతులు ప్రారంభమైనా నిధుల మంజూరుపై సర్కారు దృష్టి పెట్టడం లేదు. విద్యార్థులు రావడానికి ముందే నిధులు విడుదలైతే ఆయా సమస్యలను త్వరగా పరిష్కరించే వీలుండేది. ప్రస్తుతం విరిగిపోయిన ఫ్యాన్లు, విద్యుత్తు పరికరాలు, తాగునీటి పైపులైన్లు తదితర సామగ్రి కొనుగోలు చేయాల్సి ఉంది. కొందరు ప్రధానోపాధ్యాయులు సొంత డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది.

కొవిడ్‌కు ముందు కూడా పాఠశాలల నిర్వహణ గ్రాంట్లు సకాలంలో మంజూరు కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానిక సమస్యలపై పలుమార్లు విద్యా శాఖ ఉన్నతాధికారులకు నివేదించినా.. విద్యా సంవత్సరం ముగిసే సమయానికి నిధులు వచ్చేవి. వాటిని సక్రమంగా వినియోగించకపోవడంతో సమస్యలు పునరావృతమయ్యేవి. ప్రస్తుతం అదే పరిస్థితి కొనసాగుతోంది. ప్రభుత్వ పాఠశాలలన్నింటిని నాలుగు వేల కోట్ల రూపాయలతో సుందరంగా తీర్చిదిద్దుతామన్న ప్రభుత్వ మాటలు నీటి మీద మూటలవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా  ప్రతి ప్రభుత్వ పాఠశాలకు నిర్వహణ నిధులు వెంటనే మంజూరు చేయాలి. కోవిడ్‌ ‌నుండి సంరక్షణ చర్యల నిమిత్తం ప్రత్యేక గ్రాంట్లు కూడా అందజేయాలి. ప్రతి పాఠశాలలో తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను కూడా నియమించాలి. రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో ఈ విద్యాసంవత్సరంలో కొత్తగా చేరినారు. ప్రభుత్వ బడులు పూర్వవైభవాన్ని సంతరించుకునే దిశలో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం తగిన నిధులు మంజూరు చేసి పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి.

– పిన్నింటి బాలాజీ రావు
వరంగల్‌ ‌జిల్లా అధ్యక్షులు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం
(టి పి యు ఎస్‌)

Leave a Reply