Take a fresh look at your lifestyle.

కొన్న మూడ్రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు

  • సొంత స్థలం ఉన్నచోట డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇంటికి డబ్బులు
  • విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాం : మంత్రి హరీష్‌రావు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్‌ ‌ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వొచ్చామనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత-రామలింగారెడ్డికి మద్దతుగా శనివారం సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్‌ ‌మండలంలోని పలు గ్రామాలలో మంత్రి హరీష్‌రావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన బిజెపి, కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకులు, కార్యకర్తలు సుమారు 500మంది వరకు మంత్రి హరీష్‌రావు సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. టిఆర్‌ఎస్‌లో చేరిన వారందరికీ మంత్రి హరీష్‌రావు గులాబీ కండువాను కప్పి టిఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. అలాగే, ఇందుప్రియాల్‌కు చెందిన ప్రముఖ సంఘ సేవకుడు, రిటైర్డ్ ‌జడ్జి అన్నారెడ్డి సుభాష్‌రెడ్డి టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి మద్దతు పలికారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రచార సభలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ…ప్రస్తుత సీజన్‌కు సంబంధించి  గ్రామాలలో మక్కలు, వడ్లు కొంటున్నామన్నారు. రైతుల నుంచి కొన్న మక్కలు, వడ్లకు మూడ్రోజుల్లోనే డబ్బులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులభ్యున్నతీ కోసం సిఎం కేసీఆర్‌  అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. రైతులకు ట్రాన్స్‌ఫార్మర్లని బిస్కెట్స్ ‌పంచిపెట్టినట్లు పంపిణీ చేశామన్నారు. రైతుకు వ్యవసాయానికి ఉచితంగా 24గంటల పాటు నాణ్యమైన కరెంటును సరఫరా చేస్తున్నామన్నారు. గ్రామాలలో సొంత ఇంటి స్థలం ఉన్న చోటనే డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇల్లును కట్టుకోవడానికి డబ్బులు మంజూరు చేస్తామన్నారు.  ఆర్థిక మంత్రిగా స్వయంగా తానే లక్ష ఇండ్ల నిర్మాణానికి ప్రతిపాదన పెడితే  శాసనసభ ఆమోదం లభించిందన్నారు.  దశల వారీగా అన్ని పనులు చేస్తామనీ మంత్రి హరీష్‌రావు అన్నారు.  ఈ కార్యక్రమంలో స్థానిక టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply