Take a fresh look at your lifestyle.

‘‌మొలకెత్తాలి..!’

అక్షరాలను గుప్పిట పట్టి
గుండెకు హత్తుకుంటే…
చీకటిని చీల్చే
కిరణాల కత్తులై
వెలుతురు సామ్రాజ్యానికి
పునాది రాళ్లలవుతాయ్‌!

అక్షరం
పదునెక్కిన ఆయుధమైతే
అవినీతి గుండెను
తుత్తునియలుగా చేసే
గండ్రగొడ్డలై గర్జిస్తుంది!

అక్షరాన్ని
శరాఘాతం చేసి సంధిస్తే
తిమిర రాక్షసిని
కుప్పకూల్చే రామ బాణమై
శత్రు సంహారం చేస్తుంది!

అక్షరాన్ని నమ్మిన వారికి
ఎల్లవేళలా తల్లిలా కాపు కాచే
మాతృ దీవెనై
వరాలను వర్షిస్తుంది!

అక్షరంతో చెలిమి చేస్తే
నిక్షర కుక్షి నాలుకపై
చదువుల తల్లి చేతి చలవచే
బీజాక్షరాలు లిఖించబడతాయ్‌!

అక్షరాన్ని చూస్తే
దురహంకార దురాగతాలు
తోకముడిచి తుర్రుమంటాయ్‌!

అక్షరానికి కాస్త చోటిస్తే
అనుక్షణం కాపు కాచే
వీర సైనికునిలా
రక్షణ కవచం పరిచి
నిన్ను సజీవుణ్ణి చేస్తుంది!

అందుకే…
అక్షరాన్ని పొదివి పట్టుకో
మనుషుల మధ్య
మ్నెలకెత్తడం నేర్చుకో..!

– వంగర. పరమేశ్వరరావు
9491400534

Leave a Reply