Take a fresh look at your lifestyle.

మోడీ తాత్కాలిక పశ్చాత్తాపం ..!

“సాగు చట్టాలను తీసుకురావడాన్ని ఆయన తపస్సు కింద అభివర్ణించారు. కొరోనా మహమ్మారి స్వైరవిహారం చేస్తున్న సమయంలో ఆర్డినెన్స్ ద్వారా మూడు సాగు చట్టాలను తీసుకురావడాన్ని..ఆ తర్వాత పార్లమెంట్ లో తూతూమంత్రం చర్చతో ఆ ఆర్డినెన్స్ లను చట్టంగా మార్చడాన్ని ప్రజలు తపస్సు కింద గుర్తించాలని మోదీ కోరుకుంటున్నారు. దీన్ని బట్టి మోదీలో పరివర్తన వచ్చిన కారణంగా సాగు చట్టాల ఉపసంహరిస్తున్నారా లేక వేరే అంశాలేమన్నా ఈ ఉపసంహరణను ప్రేరేపించాయా అన్నది మనం అర్ధం చేసుకోవచ్చు.”

గెస్ట్ ఎడిట్, ఆలపాటి సురేశ్ కుమార్

పొద్దున్నే దేశం నిర్ఘాంతపోయింది. రాజకీయ చదరంగంలో ఎత్తులు వేయడంలో తనకు తానే సాటి అని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నిరూపించుకున్నారు. ఆ క్రమంలో దేశ ప్రజలను ఇంకోసారి ఆశ్చర్యచకితులను చేశారు. సాగు చట్టాలను రద్దు చేయడమా.. మనం వింటున్నది నిజమేనా అని చాలామంది అనుమానపడ్డారు. మరి ఆ మూడు సాగు చట్టాలను మోదీ నాయకత్వంలోని బీజెపి ప్రభుత్వం అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వాటి కోసం సర్వశక్తులూ ఒడ్డింది. సాగు చట్టాలను వ్యతిరేకించిన వారిపై ముప్పేట దాడి చేసింది. వారిని దేశద్రోహులుగా చిత్రించేందుకు కూడా ఏమాత్రం సందేహించలేదు. గత సంవత్సరం నవంబర్ నుంచి ఎండ.. వాన..చలి లాంటి ప్రాకృతిక శక్తులనే కాకుండా ఎదురులేని అధికారం తెచ్చిపెట్టిన మితిమీరిన అహంకారాన్ని కూడా ధిక్కరించి దేశ రాజధాని సరిహద్దుల్లో భైటాయించిన వేలాది మంది రైతులపై పడని అపనింద లేదు. వారిని అప్రతిష్ట పాలు చేసేందుకు అధికారపక్షం నేతలు…పేరు గాంచిన వారి ఐటి సెల్ వోవర్ టైమ్ వర్క్ చేశారు. ఆఖరికి ఆ రైతులపై ఖలిస్తాన్ వేర్పాటువాదుల ముద్ర కూడా వేశారు. వారిని పరాభవించి..వోడించి ఇళ్లకు పంపాలన్న పట్టుదలతో ఏడాదిగా అన్ని రకాల జిత్తులతో అధర్మయుద్ధం చేస్తూ వచ్చిన సర్కారుకు ఎదురులేని నేత అయిన నరేంద్ర మోదీని ఈరోజు ఉదయం టివిలో మాట్లాడుతుండగా చూస్తే మతి పోక తప్పదు. తెలియనివారైతే.. ఆహా ఎంత గొప్ప మనిషి..ఎంత చిత్తశుద్ధి..ప్రజాస్వామ్యంపై ఎంత ప్రేమ అనుకుంటారు. గుర్తు పెట్టుకోండి. మోదీ తల వంచాడనుకుంటున్నారేమో.. లేదు. వోటమిని అంగీకరించారనుకుంటున్నారేమో. లేదు..ఆయన తన ప్రాధామ్యాలు మార్చారు అంతే..!

వచ్చే సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరగనున్న అయిదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు ఈ మార్పుకు కారణం. ఆ అయిదు రాష్ట్రాల్లో.. గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్..ఈ అయిదు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్ మరీ ముఖ్యమైనవి. ఆ రెంటిలో ఉత్తరప్రదేశ్ ఇంకా ముఖ్యమైనది. కాబట్టి కాస్త తగ్గాల్సివచ్చింది. గమనించండి..! మరోసారి ప్రధాని మోది ప్రసంగం వినండి.. ఆయనేమీ తాము చేసిన చట్టాల విషయంలో వెనక్కు తగ్గలేదు. దేశంలోని రైతులను ఆదుకోవడం కోసం…ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులను ఆదుకోవడం కోసం ఆ సాగు చట్టాలు తెచ్చామని ప్రారంభంలోనే చెప్పారు. అయితే కొందరు రైతులు అర్ధం చేసుకోలేకపోయారని మోదీ అన్నారు. ‘మా తపస్సులో ఏదో లోపం ఉంది.. అందుకనే సాగు చట్టాల గురించి కొందరు రైతులకు నచ్చజెప్పలేకపోయాం..’ అన్నారు మోదీ. ఇక్కడ..ఆయన మాటల్లో మనం గమనించాల్సిన పదం తపస్సు. సాగు చట్టాలను తీసుకురావడాన్ని ఆయన తపస్సు కింద అభివర్ణించారు. కొరోనా మహమ్మారి స్వైరవిహారం చేస్తున్న సమయంలో ఆర్డినెన్స్ ద్వారా మూడు సాగు చట్టాలను తీసుకురావడాన్ని..ఆ తర్వాత పార్లమెంట్ లో తూతూమంత్రం చర్చతో ఆ ఆర్డినెన్స్ లను చట్టంగా మార్చడాన్ని ప్రజలు తపస్సు కింద గుర్తించాలని మోదీ కోరుకుంటున్నారు. దీన్ని బట్టి మోదీలో పరివర్తన వచ్చిన కారణంగా సాగు చట్టాల ఉపసంహరిస్తున్నారా లేక వేరే అంశాలేమన్నా ఈ ఉపసంహరణను ప్రేరేపించాయా అన్నది మనం అర్ధం చేసుకోవచ్చు.

ప్రేరేపించిన ఇతర అంశాలేమిటన్నది అలా ఉంచితే 2014 తర్వాత మొదటిసారిగా మోదీ మెడలు వంచిన ఖ్యాతి రైతులకే దక్కుతుంది. మొక్కవోని దీక్షతో.. పట్టుదలతో వారు సాగించిన ఉద్యమం ఎంతైనా చారిత్రాత్మకం. అయితే వారు సాధించిన విజయం వారికి ఈ రౌండ్ లో దొరికిన విజయం అని నేను భావిస్తున్నాను. ముందే చెప్పాను చూడండి..మోదీ ప్రాధాన్యతలు మారాయి తప్ప మరోటి కాదని. ఇప్పుడు ఆయన ప్రాధాన్యతలు ఏమిటంటే..మొదట ఉత్తరప్రదేశ్..శాసనసభ ఎన్నికల్లో గెలుపు..తర్వాత భారతదేశం..లోక్ సభ ఎన్నికల్లో గెలుపు..! అప్పటివరకూ సాగు చట్టాలు ఆగక తప్పదు. ముచ్చటగా మూడవసారి దేశాధికారం హస్తగతం చేసుకున్న తర్వాత.. ఇనుమడించిన ఉత్సాహంతో.. దేశంలో తిండి గింజల రంగం మొత్తాన్నీ అంబానీ, అదానీల చేతిలో పెట్టేందుకు పావులు కదుపుతారు. ఈలోపు కొంప మునిగేదేముంది..

అంబానీ, అదానీ..ఈ ఇద్దరూ కలిసి ఇప్పటికే దేశాభివృద్ధికి కీలకమైన రంగాలపై..టెలికాం, ఎయిర్ పోర్ట్స్, నౌకాశ్రయాలు, ఆయిల్ రిఫైనరీలు, రిటైల్ వంటి రంగాలపై పూర్తి స్తాయిలో పెత్తనం చేస్తున్నారు. రేపు ఏదో ఒక దారిలో ఆహార రంగాన్ని సంపూర్ణంగా తమకు అప్పగించే నాటికి దాని నిర్వహణకు అవసరమైన గిడ్డంగుల వంటి మౌలిక సదుపాయాలతో సిద్ధంగా ఉంటారు. ఆ ప్రక్రియ ఇప్పటికే మొదలయింది. ముందు దానిని పూర్తి చేస్తారు. తర్వాత అసలు లక్ష్యంపై గురి పెడతారు. ఇదంతా అనుకున్నది అనుకున్నట్లు జరగాలంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో బీజెపి ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలి. ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో బీజెపి ఓడిందంటే ప్రతిపక్షాలు ఆ పార్టీపై జాతీయ స్తాయిలో మానసికంగా విజయం సాధించినట్లే. ఆ రకమైన దెబ్బ తిన్నతర్వాత బీజెపిని 2024 లోక్ సభ ఎన్నికలలో విజయం వైపు నడపడం నరేంద్ర మోదీకైనా కష్టమే. ఏదో పద్ధతిలో అధికారం నిలుపుకుంటే…భవిష్యత్తులో మరో రోజు పోరాడవచ్చు. ”బతికియుండిన శుభముల బడయవచ్చు..” అందుకే సాగు చట్టాలను ఇప్పటికి రద్దు చేస్తున్నారు. అధికారం ముఖ్యం..వోట్లు ముఖ్యం.. కాబట్టి మోదీ తన అహాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టి రైతులను క్షమాపణ కోరారు. ఆ ఒక్క మాటతో సాగు చట్టాల వల్ల వచ్చిన వ్యతిరేకతను పూర్వపక్షం చేయగలమని ఆయన భావిస్తున్నారు. మోదీ అంచనా సరైనదో కాదో తెలియాలంటే కొద్ది నెలలు ఆగాలి.

Leave a Reply