Take a fresh look at your lifestyle.

వాజ్ పేయి విధానాలకు వ్యతిరేకంగా వ్యవసాయంపై మోడీ ప్రయోగాలు

రైతులతో చర్చలకు ఈనెల 30వ తేదీన ప్రభుత్వం ముహూర్తం నిర్ణయించింది. తాము ప్రతిపాదించిన అంశాలపై ఈనెల 29వ తేదీన చర్చలకు సిద్దమేనంటూ రైతు సంఘాల ఐక్య కార్యాచరణ ప్రతిపాదనపై ప్రభుత్వం స్పందించి 30వ తేదీన ఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో చర్చలు ఏర్పాటు చేసింది.ఒక రోజు అటూ ఇటూ అయినా, రైతు సంఘాల ప్రతిపాదనలను ప్రభుత్వం అజెండాలో చేరుస్తుందా లేదా అనేది సస్పెన్స్ కొనసాగుతోంది. మూడు చట్టాల రద్దుకు విధివిధానాలను తమ ముందు ఉంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల్లో ప్రభుత్వం పట్ల విశ్వాసం సన్నగిలడం వల్లనే షరతులు పెడుతున్నారు. రైతులు కోరుతున్న మద్దతు ధర విషయంలో మంత్రులు తలోరీతిలో మాట్లాడటం వల్లనే రైతుల్లో అనుమానాలు పెరిగిపోయాయి.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశపెడుతూ రైతులకు ప్రభుత్వం ఎంతో చేస్తోందనీ, మద్దతు ధర అనేది పాత బడిన విధానమనీ, దశలవారీగా దానిని రద్దు చేస్తామని అన్నారు. కేంద్ర వ్యవసాయ సహాయ మంత్రి పురుషోత్తమ్ రూపానీ రైతుల తో చర్చల అజెండాలో మ ద్దతు ధర ఉండదని అన్నారు. ఈ రెండు ప్రకటనలూ రైతుల్లో అనుమానాలను పెంచాయి. ప్రతి అంశంలో మాజీ ప్రధాని వాజ్ పేయి మార్గమే తన మార్గమని చెప్పుకునే ప్రధాని మోడీ రైతుల సమస్యల విషయంలో వాజ్ పేయి విధానాన్ని అనుసరించడం లేదు. రైతుల కోసం కిసాన్ కార్డుల పథకాన్ని వాజ్ పేయి ప్రవేశపెట్టారు.దాని వల్ల ప్రతి సీజన్ లో పెట్టుబడి కోసం రైతులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆ కార్డుల ఆధారంగా అప్పులు తీసుకునే వారు.ఇది రైతులకు భరోసా ఇచ్చే పథకం,ఇప్పుడు మోడీ పెట్టుబడి సహాయం పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద గత వారం 18,000 కోట్ల రూపాయిలను రైతుల ఖాతాల్లో వేసినట్టు ఆయన స్వయంగా ప్రకటించారు.ఈ పెట్టుబడి సాయం పథకం వల్ల రాష్ట్రాలు గతంలో రైతులకు అందించే సాయాన్ని ఈ మొత్తంలో కలిపేసి అంతా తామే ఇస్తున్నట్టు ప్రకటించుకుంటున్నాయి. తెలంగాణలో రైతు బంధు పథకం మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ లో రైతు భరోసా పథకం ఉంది.ఈ రాష్ట్రాల్లో రైతులకు ఇచ్చే సొమ్ములో సగం సొమ్ము కేంద్రం ఇస్తున్నదేనని బీజేపీ రాష్ట్ర శాఖల అధ్యక్షులు బండి సంజయ్, సోము వీర్రాజు పదే పదే చెబుతున్నారు. కిసాన్ వికాస్ పథకం రైతులకు పాస్ పోర్టు వంటిది. రైతుల ఆత్మస్థయిర్యాన్ని పెంచింది. వాజ్ పేయి ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఆత్మస్థయిర్యాన్ని పెంచినవే.అయితే, ఆయన ప్రస్తుత ప్రధాని మాదిరిగా తమ పథకాలకు ఆత్మనిర్భర్ అని పేరు పెట్టలేదు. ఆయన పబ్లిసిటీ కోసం చూడకుండా రైతులకు నికరంగా లాభం జరిగేట్టు చర్యలు తీసుకున్నారు.

- Advertisement -

ఇప్పుడు రైతులు కోరుతున్న కనీస మద్దతు ధర కొత్తదేమీ కాదు.అది పాతబడిన విధానమని అనుకుంటే వ్యవసాయరంగ నిపుణులు స్వామినాథన్ ఆ పథకం కింద రైతులకు ఇవ్వాల్సిన సొమ్ముని పెంచాలని ఎందుకు సూచిస్తారు. వాజ్ పేయి హయాంలో వ్యవసాయ మంత్రిగా పని చేసిన సోంపాల్ శాస్త్రి కూడా ఇదే మాట అన్నారు. వ్యవసాయ సబ్సిడీ బాగా పెరిగి పోతోందని ప్రధాని మోడీ తరచూ ప్రకటనలు చేస్తున్నారు. కానీ, అమెరికా, యూరప్ దేశాలతో పోలిస్తే మన దేశంలో వ్యవసాయ సబ్సిడీ జీడీపీలో 5 శాతం మాత్రమే ఉంది. అక్కడ 30 శాతం వరకూ సబ్సిడీ లభిస్తోంది. పంటకు ఆయా దేశాల్లో భద్రత కల్పిస్తున్నారు. పారిశ్రామికంగా వారు ఎంతో పురోగతి సాధించినా, వ్యవసాయాన్ని విస్మరించలేదు. రైతులకు పంట వేయడంలో స్వేచ్ఛ ఉంది. పంటల కొనుగోలుకు పటిష్టమైన ఏర్పాట్లు ఉన్నాయి. రైతుల శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తోంది.మన దేశంలో అలాంటి అనుకూల పరిణామాలు లేకపోవడం వల్లనే రైతులు ఆందోళ న సాగిస్తున్నారు. రైతులు మద్దత ధర కోసం ఎందుకు పట్టుపడుతున్నారో ప్రభుత్వం ఇప్పటికీ అర్థం చేసుకున్నట్టు లేదు. మద్దతు ధర ఒక భరోసా. తమ కష్టానికి మినిమమ్ గ్యారంటీ అని వారు భావిస్తున్నారు, కార్మికులు కనీస వేతనాలు కోరుతున్నారు. పారిశ్రామిక వేత్తలకు తమ ఉత్పత్తుల ధరలను నిర్ధారించుకునే స్వేచ్ఛ ఉంది. పారిశ్రామిక ఉత్పత్తులపై ప్రభుత్వం అజమాయిషీ లేదు. ఒక్క రైతుల విషయంలోనే ప్రభుత్వం అజమాయిషీ కొనసాగుతోంది. ఇప్పుడు ఈ అజమాయిషీని ప్రైవేటు కంపెనీల చేతుల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ప్రైవేటు కంపెనీల పెత్తనం వొస్తే వారు సూచించిన పంటలను మాత్రమే వేయాలనే నిబంధనలు పెడతారు.దాని వల్ల రైతు స్వేచ్ఛ కోల్పోతాడు.దీనిపై కూడా రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బీటీ కాటన్ విత్తనాల విషయంలో వివాదం కొద్ది రోజుల క్రితం కొనసాగిన సంగతి తెలిసిందే బీటీ కాటన్ విత్తనాలను పర్యావరణ వేత్తలు వ్యతిరేకించారు. మన దేశ పరిస్థితులకు అవి సరైనివి కావని స్పష్టం చేశారు.అయినప్పటికీ బోల్ గ్రేడ్ విత్తనాలను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించడం దానిపై ఆందోళనలు సాగడం తెలిసిందే.ఇప్పుడు వ్యవసాయం పూర్తిగా కంపెనీలు, ప్రైవేటు యాజమాన్యాల చేతుల్లోకి పోతే వారు చెప్పిన బ్రాండ్లను మాత్రమే పండించాలి. తెలంగాణ ప్రభుత్వం సన్నరకాల వడ్లను పండించమని ఆదేశించి తీరా రైతులు పండించగానే వాటిని కొనుగోలు చేయకుండా చేతులెత్తేసింది. వొచ్చే సీజన్ నుంచి రైతులు ఇష్టమైన రీతిలో పంటలు పండించాలనీ, ప్రభుత్వం ఎటువంటి ఆదేశాలు జారీ చేయదని ప్రకటించారు.అది కేంద్రానికీ వర్తిస్తుంది.రైతులు చేతులు కాలిన తర్వాత ప్రభుత్వాలు తమ ఆదేశాలను ఉపసంహరించుకుంటే రైతులు పడిన కష్టానికీ, నష్టానికీ ఎవరు బాధ్యులు..? అందువల్ల సంప్రదాయకంగా తరతరాలుగా రైతులు ఏ పంటలనైతే పండిస్తున్నారో వాటిపైనే మక్కువ చూపుతారు.వాటిపై వారికి స్వేచ్చ ఇవ్వాల్సిందే. జనరంజక పాలనను అందించిన వాజ్ పేయి కి తెలుసు కాబట్టే వాటి జోలికి వెళ్ళలేదు.

Leave a Reply