దేశంలో అన్ని రాష్ట్రాలూ సాగిల పడేట్టు చేసుకున్న ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్ డిఏ ప్రభుత్వానికి దిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం కొరకరాని కొయ్యగా తయారైంది. ఎక్కడ ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా బీజేపీ బావుటా అప్రతిహతంగా రెపరెపలాడాలన్న ఆశయంతో ముందుకు సాగుతున్న నరేంద్రమోడీ,ఆయన ప్రియశిష్యుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు కేజ్రీవాల్ పక్కలో బల్లెంలా తయారయ్యారు. దిల్లీలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్ ) ఘనవిజయం సాధించడం మోడీ, షా ద్వయానికి మింగుడు పడటం లేదు. ఆ మాటకొస్తే మోడీ 2014 లో కేంద్రంలో అధికారంలోకి వొచ్చిన నాటి నుంచి కేజ్రీవాల్ పై వేటు వేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. వీలు కుదిరినప్పుడల్లా మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ గా బీజేపీ భావజాలానికి దగ్గరైన బజాల్ ను నియమించారు.ఆయన లోక్ పాల్ బిల్లును వెనక్కి పంపారు. కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలన్నింటికీ ఏదో విధంగా అడ్డుపడుతున్నారు.
దిల్లీ క్రికెట్ అసోసియేషన్ లో అవకతవకలపై దిల్లీ ప్రభుత్వం జరిపిస్తున్న విచారణను అడ్డుకున్నారు. ఈ అసోసియేషన్ అవకతవకల్లో బీజేపీ నాయకుల హస్తం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. దిల్లీ ప్రభుత్వం తీసుకున్న 400 నిర్ణయాలపై లెఫ్టినెంట్ గవర్నర్ విచారణ జరిపిస్తున్నారు. వాటర్ ట్యాంక్ వ్యవహారంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై విచారణకు ఆదేశించారు. దీనిపై దిల్లీ కోర్టు లెఫ్టినెంట్ గవర్నర్ చర్యను సమర్ధించడంతో ‘ఆప్’ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎన్నికైన ప్రజాప్రభుత్వాలకు వీసమెత్తు అధికారం, గౌరవం లేకుండా మోడీ,షాలు సాగిస్తున్న పాలనపై ప్రజల్లో అసంతృప్తి రేగుతోంది. దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ శిసోదియా తాము ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాల అమలుకు తీసుకున్న నిర్ణయాలను లెఫ్టినెంట్ గవర్నర్ తొక్కి పెట్టడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. శాసనసభ అధికారాలను అనుసరించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను లెఫ్టినెంట్ గవర్నర్ దీర్ఘకాలం పెండింగ్ లో పెట్టకూడదని సుప్రీంకోర్టు ఆ మధ్య తీర్పు ఇచ్చినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు.
కేజ్రీవాల్ మోడీ మొదటి టరమ్ లో దాదాపు ఆయనపై యుద్ధమే చేశారు. తిరిగి అధికారంలోకి వొచ్చిన తర్వాత తన పద్దతి మార్చుకున్నారు. వారణాసిలో మోడీకి వ్యతిరేకంగా పోటీ చేసిన కేజ్రీవాల్ తర్వాత దిల్లీ ప్రజలకు తానిచ్చిన వాగ్దానాల అమలు కోసం క్రమంగా విమర్శలు తగ్గించుకుని కేంద్రానికి సహకరించే ధోరణినే అనుసరిస్తున్నారు.అయినప్పటికీ ఆయనకు లభిస్తున్న ప్రజాదరణ కారమంగా ఆయనను ఇబ్బందుల పాలు చేయడానికి కమలనాథులు అడుగడుగునా అడ్డుతగులుతున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ ను అడ్డు పెట్టుకుని దిల్లీ ప్రభుత్వ నిర్ణయాలు అమలు కాకుండా అడ్డుపడుతున్నారు. మూడేళ్ళ క్రితం దిల్లీ ప్రభుత్వం ఎంత ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నా ముందుగా లెఫ్టినెంట్ గవర్నర్ కి తెలియబర్చాలనీ, అసెంబ్లీ ఆమోదం తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదించకపోయినా అది అమలులోకి వొస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు తర్వాత రెండేళ్ళ పాటు ప్రశాంతత నెలకొన్నట్టు కనిపించినప్పటికీ, కేజ్రీవాల్ తమ కంట్లో నలుసులా తయారయ్యాడని ఆయనపై అదుపు కోసం కేపిటల్ టెరిటరీ చట్టం సవరణ ను తెచ్చింది.దీని వల్ల దిల్లీ ప్రభుత్వం నామమాత్రం అవుతుంది.
లెఫ్టినెంట్ గవర్నర్ సర్వాధికారి అవుతారు. ఎన్నికైన ప్రభుత్వానికి అధికారాలు పరిమితంగా ఉంటాయి. ఈ చట్ట సవరణను ఆప్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దేశంలో సమాఖ్య వ్యవస్థను మోడీ, షాలు భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్ పై మోడీ కోపాన్ని పెంచుకోవడానికి అసలు కారణం దిల్లీ శివారులో నిరవధిక ఆందోళన సాగిస్తున్న రైతులకు మద్దతు ప్రకటించడమే. ఈ ఆందోళనకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఆయనే కల్పిస్తున్నారన్న అనుమానం కమలనాథులకు ఉంది. ముఖ్యంగా , దిల్లీ శివార్లలో గుడారాలు నిర్మించుకోవడానికి అనుమతి ఇవ్వడం, వాటిల్లో నివసించేవారికి నీరు,విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను కల్పించడం వంటి చర్యలకు దిల్లీ ప్రభుత్వం తోడ్పడుతోందని కేంద్రం అనుమానిస్తోంది.
రైతుల పోరాటానికి మద్దతు ద్వారా ఆప్ ఉత్తరాది రాష్ట్రాల్లో మంచి ఫలితాలను సాధిస్తోంది. గుజరాత్ లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తర్వాత స్థానాన్ని ఆప్ సాధించడం కమలనాథులకు మింగుడు పడటం లేదు.ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్తాన్ వంటి రాష్ట్రాల్లో చాపకింద నీరులా ఆప్ విస్తరించడం కమలనాథులకు గుబులు పుట్టిస్తోంది.అందుకే ఆప్ ప్రభుత్వానికి అడుగడుగునా ఇబ్బందులను సృష్టిస్తోందని ఆప్ నాయకులు ఆరోపిస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలూ తమ ఏలుబడిలో ఉండాలని కోరుతున్న మోడీ- షా ద్వయం అధికారంలో లేని రాష్ట్రాలను గుప్పిట్లో పెట్టుకోవడానికి అన్ని చర్యలకూ పాల్పడుతోందనడానికి దిల్లీ ప్రభుత్వానికి అడుగడుగునా ఎదురవుతున్న ఇబ్బందులే నిదర్శనం.