Take a fresh look at your lifestyle.

ఎంతవరకు ‘ఉచితం ..?’

గుజరాత్‌లో జరిగిన ఎన్నికల సందర్భంగా ఉచితాలపై ప్రధాని విమర్శించడం గమనార్హం. అధికారం కోసం రాజకీయ పార్టీలు ‘ఉచిత’ వాగ్ధానాలు చేస్తున్నాయని, ప్రజలు ప్రత్యేకించి యువకులు ఈ సంస్కృతిని వ్యతిరేకించాలని అక్కడి ఎన్నికల సభలో ప్రధాని మోదీ సెలవిచ్చారు. కాని, ఇప్పుడు కర్ణాటకలో మోదీ పార్టీ ఏం చేస్తున్నది..? కర్ణాటకలో బిజెపి చేసిన 103 వాగ్ధానాల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి ఉన్నాయంటే కేంద్రం కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసిన ప్రకటనే అన్నది స్పష్టమవుతున్నది.

ఎన్నికలనగానే రాజకీయ పార్టీలు వోటర్లను ప్రలోభపెట్టేందుకు ఉచిత పథకాల వేటలో పడుతాయి. ఏ విధంగానైనా అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు అలివిగాని వాగ్ధానాలను కురిపిస్తుంటారు. ప్రత్యేకంగా దేశ జనాభాలో అధికంగా ఉండే  మహిళలు, యువకులు, రైతులను ఆకర్షించేవిధంగా ఉచిత పథకాలను రూపొందించడమన్నది ఆ పార్టీలకు అలవాటైపోయింది. గెలుపే లక్ష్యంగా చేసే ఈ వాగ్ధానాలవల్ల ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న విషయాన్ని కూడా ఈ పార్టీలు పట్టించుకునే పరిస్థితిలేదు. నిజంగా ప్రజలకు అవసరమా కాదా అన్న విచక్షణ లేకుండా తమకు తోచిన వాగ్ధానాలు చేయడం, అధికారంలోకి వొచ్చిన తర్వాత వాటిని అటుకెక్కించడమన్నది ఆ పార్టీలకు అలవాటైపోయింది. దేశంలో ఉచితాలను ప్రవేశపెట్టడంలో ముందు వరుసలో నిలిచింది తమిళనాడు. ఎంజీ రామచంద్రన్‌ ‌ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన ఉచితాలు ఒకింత ఆశ్చర్య కరంగా ఉండేవి. ఆ తర్వాత దాదాపు ఈ పద్దతి అన్ని రాష్ట్రాలకు పాకింది. లాంతర్లు మొదలు టివీలు, ల్యాప్‌ ‌టాప్‌లు, మొబైల్స్, ‌క్రికెట్‌ ‌కిట్లు, గొడుగులు, దుప్పట్లు, సైకిళ్ళు, హెల్మెట్లు చివరకు విద్యార్ధులకు బూట్లను కూడా ఈ ఉచితాల జాబితాలో చేరుస్తున్నారు. ఇక డబ్బుల విషయం చెప్పేదే లేదు. వోటుకు వంద రెండు వందల నుండి ఇప్పుడు వేల సంఖ్యలోకి చేరింది. ఇంకా పెద్ద సంఖ్యలో డబ్బును అందజేయడమంటే వ్యవసాయ రుణాలను మాఫీ చేయడమన్నది దేశ వ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతున్నదే. ఎన్నికలవేళ రాజకీయ పార్టీలు ఉచితాలను ప్రకటించడమన్నది ఒక విధంగా లంచాన్ని ప్రోత్సహించడమేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయం తెలియందికాదు.

ఇలా ఉచితాలను ప్రోత్సహించడమన్నది దేశ ఆర్థికపరిస్థితికి తీవ్ర విఘాతాన్ని కలిగిస్తుందని కూడా సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే. అంతేకాదు ప్రజలు ప్రలోభాలకు లోనవడంతో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే అవకాశం ఉండదు. దీనిపైన మార్గదర్శక సూత్రాలను రూపొందించాల్సిందిగా ఎన్నికల కమిషన్‌ ‌ను  సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో దేశ వ్యాప్తంగా కొంత కాలంగా చర్చ జరుగుతోంది. వాస్తవంగా ఉచితమంటే ఏమిటి.. దేన్ని ఉచితంగా పరిగణించాలన్న దానిపై వాదనలు జరుగుతున్నాయి. ఉచితాలు, సబ్సీడీలు క్రమంగా రద్దు చేయాలన్న ప్రపంచ బ్యాంకు సూచనలను పాలకులు సంపూర్ణంగా అమలు చేయలేకపోతున్నారు.  ఎందుకంటే కేంద్రం, రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే  ఏ పార్టీ అయినా ఇలాంటి తాయిలాలను వోట్లకోసం ప్రకటించక తప్పదు.  ఒక పక్క దీనిపైన చర్చ జరుగుతున్నప్పటికీ  దేశంలో అనేక రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో ఇదో భాగమైపోయింది.  పోటీలో పాల్గొంటున్న రాజకీయ పార్టీలు ఉచిత వాగ్ధానాలు చేస్తూనే ఉన్నాయి. అధికారం చేపట్టిన తర్వాత నిజంగానే తమ ఉచిత వాగ్దానాలను ఆ పార్టీలు నిలబెట్టుకుంటున్నాయా అంటే, ఎక్కువ శాతం లేదనే చెప్పాలె. అధికారంలోకి వొచ్చిన తర్వాత వాటి జోలికి పోక పోవడమో లేదా అమలు పర్చే క్రమంలో చట్టపరమైన అవరోధాలు ఎదురుకావడం వల్ల నిలిచిపోవడమో జరుగడాన్ని చూస్తున్నాము.
కర్ణాటక ఎన్నికల్లో ఉచిత వాగ్ధానాల హోరు ఎక్కువగానే ఉంది.

ఆ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావడానికి బిజెపి నానా తంటాలు పడుతోంది. ఈ సారి అధికారంలోకి రావడానికి ఆ పార్టీకి అంత అనుకూలంగా లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఈ పార్టీ తన మ్యానిఫెస్టోలో ప్రజలకు ‘ఉచిత’ వాగ్ధానాలు చేసింది. హిందూ పండుగలు మూడింటికి మూడు సిలిండర్లను ఉచితంగా అందజేస్తామని తమ మ్యానిఫెస్టోలో బిజెపి పేర్కొంది. రోజుకు అరలీటర్‌ ‌పాలన్నవి ఎంతకాలం అమలవుతాయో తెలియదు. ఇక ఉద్యోగాల విషయానికొస్తే బిజెపి కేంద్రంలో అధికారంలోకి వొచ్చే ముందు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను ఇస్తామని హామీ ఇచ్చిమర్చిపోయింది. ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లో పదిలక్షల ఉద్యోగాలను కల్పిస్తామంటోంది. ప్రతీ వార్డులో అటల్‌ ఆహార క్యాంటిన్లలో ఆహారాన్ని అందుబాటు ధరల్లో అందించేవాగ్ధానం. గ్రామాల్లో మైక్రో కోల్డు స్టోరేజీలు, పదిలక్షల ఇండ్ల స్థలాల పంపిణీ, గృహిణులకు మ్యాచింగ్‌ ‌ఫిక్స్‌డ్‌ ‌డిపాజిట్లు,  ఇలాంటి మరికొన్ని హామీలను ప్రకటించింది. బిజెపి కర్ణాటకలో మొదటిసారిగా అధికారం చేపట్టేప్పుడు కూడా ఇలానే అనేక హామీలనిచ్చింది. అప్పుడిచ్చిన ఆరు వందల హామీల్లో కేవలం 55 హామీలను మాత్రమే బిజెపి ప్రభుత్వం అమలుచేసిందంటూ కాంగ్రెస్‌పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆరోపిస్తున్నారంటే హామీలన్నీ అటుకెక్కినట్లేకదా.. అయితే కాంగ్రెస్‌ ‌మాత్రం తక్కువేమీ తినలేదు. గృహజ్యోతి, గృహలక్ష్మీ, అన్న భాగ్య, యువనిధి, శక్తి పేరిట అయిదు పథకాలను  అధికారంలోకి వొచ్చిన వెంటనే అమలు చేస్తామంటూ తమ మ్యానిఫెస్టోద్వారా ప్రజలకు తెలిపింది. శక్తి పథకం కింద మహిళలకు రాష్ట్రమంతటా కెసిఆర్‌టిసీ, బిఎంటీసి  బస్సుల్లో  ఉచితంగా ప్రయాణించే అవకాశం..  అలాగే గృహ లక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని ప్రతీ గృహిణికీ 2 వేల రూపాయల నజరాన, అలాగే  ‘సర్వజనన్‌గద శాంతియ తోట’ ( అన్ని వర్గాల వారికి శాంతియుతమైన తోట అని అర్థం,) ఆలాగే అణగారిన వర్గాల కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను, పది కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇస్తామంది. ఇలా ఆ పార్టీ పద్నాలుగు హామీలను పేర్కొంది.

ఇక్కడ విచిత్రకర విషయమేమంటే ఈ ఉచితాలు, తాయిలాలను చట్టబద్దంగా నిషేధించాల్సిన  ప్రధాన మంత్రే వాటిని ప్రోత్సహించడం..! ఉచిత సిలెండర్‌లు ఇస్తామనడం, ప్రాజెక్టులకు నిధులను మంజూరు చేస్తామనడం, లాంటి కొన్ని హామీలేవైతే ఉన్నాయో అవన్నీ కేంద్ర పరిధిలోనివి. అంటే కేంద్ర మంత్రులుగాని, ప్రధాని గాని ఉచితాలు ప్రకటించడమంటే ప్రభుత్వ పరంగా ప్రకటించినట్లే అన్న వాదనలు వినిపిస్తున్నాయి.  గుజరాత్‌లో జరిగిన ఎన్నికల సందర్భంగా ఉచితాలపై ప్రధాని విమర్శించడం గమనార్హం. అధికారం కోసం రాజకీయ పార్టీలు ‘ఉచిత’ వాగ్ధానాలు చేస్తున్నాయని, ప్రజలు ప్రత్యేకించి యువకులు ఈ సంస్కృతిని వ్యతిరేకించాలని అక్కడి ఎన్నికల సభలో ప్రధాని మోదీ సెలవిచ్చారు. కాని, ఇప్పుడు కర్ణాటకలో మోదీ పార్టీ ఏం చేస్తున్నది..? కర్ణాటకలో బిజెపి చేసిన 103 వాగ్ధానాల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి ఉన్నాయంటే కేంద్రం కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసిన ప్రకటనే అన్నది స్పష్టమవుతున్నది. మరి మిగతా రాష్ట్రాలకు ఆ వెసులు బాటు ఎందుకు వర్తించకూడదు. కేంద్ర ప్రభుత్వమన్నది అన్ని రాష్ట్రాలను సమాన దృష్టితో చూడాల్సి ఉంటుంది. అదే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటి రామారావు ప్రశ్నిస్తున్నారు. ఏ ఉచితాలు అయితే వొద్దని గతంలో ప్రధాని మోదీ చెప్పాడో  అవే ఉచితాలను ప్రకటించడమేంటని..! మిగతా రాష్ట్రాల్లో కూడా ఉచిత సిలెండర్‌లు, పాలు ఇవ్వవచ్చుకదా అని ప్రధానిని కెటిఆర్‌ అడుగుతున్నారు. అలాఅని బిఆర్‌ఎస్‌ ఉచితాలను ప్రకటించడంలేదని కాదు. ఇప్పటికే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో కాంగ్రెస్‌ ‌తాము అధికారంలోకి వొస్తే 500 రూపాయ)కే గ్యాస్‌ ‌సిలెండర్‌ ఇస్తామంటున్నది. ఎలా సాధ్యం..! ఇప్పుడు 1400 రూపాయలున్న సిలెండర్‌ను 500లకు ఇవ్వడంగాని, మూడు సిలెండర్‌లను ఉచితంగా ఇవ్వడంగాని ఏ ప్రభుత్వానికైనా ఎలా సాధ్యం..? ఆ మిగతా డబ్బు చివరకు భరించేది ఎవరు..! తాత్కాలికంగా లబ్ధిపొందే విషయంలో పార్టీలు చేస్తున్న ఈ ఉచిత ప్రకటనపై సీరియస్‌గా చర్చ జరుగాల్సిందేనంటున్నారు ఆర్థిక భారాన్ని మోస్తున్న జనం.

Leave a Reply