Take a fresh look at your lifestyle.

మోడీ అంటే మోదుడు..బిజెపి అంటే బాదుడు

*కేంద్రం లాభనష్టాలు లెక్కలేసుకుని ప్రయివేట్‌ ‌లిమిటెడ్‌ ‌కంపెనీ లాగా పని చేస్తుంది
*మోడీ హయాంలో అచ్చేదిన్‌ ‌కాదు…సచ్చేదిన్‌ ‌వొచ్చింది
*సిద్ధిపేట టిఆర్‌ఎస్‌ ‌నిరసన దీక్షలో మంత్రి హరీష్‌రావు ఫైర్‌

మోడీ అంటే మోదుడు అని…బిజెపి అంటే బాదుడు అంటూ మంత్రి హరీష్‌ ‌రావు మరో కొత్త నిర్వచనం ఇచ్చారు. రైతులు పండించిన వడ్లను కొనమని తెగేసి చెబుతున్న కేంద్రంలోని బిజెపి పార్టీ సర్కార్‌ను గద్దె దించే వరకు తమ పోరు ఆగదని హరీష్‌రావు హెచ్చరించారు.  నాడు తెలంగాణ కోసం పోరాటం.. నేడు తెలంగాణ రైతుల కోసం పోరాటం అని, తమ పోరాటం రైతుల కోసం ధర్మ పోరాటమని, గొంతెమ్మ కోరిక కాదని అన్నారు. కేంద్రంలోని బిజెపి పార్టీ సర్కార్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

తెలంగాణ రైతులు పండించిన వడ్ల కొనుగులుపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ, వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ టిఆర్‌ఎస్‌ ‌పార్టీ పిలుపు మేరకు గురువారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని ఆర్డీవో కార్యాలయంలో వేలాది మంది రైతులు, టిఆర్‌ఎస్‌ ‌శ్రేణులతో కలిసి మంత్రి హరీష్‌రావు నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…నాడు కేంద్రంలోని అన్ని ప్రభుత్వాలు వడ్లు కొన్నాయనీ, నేడు ఎందుకు కొనరని సూటిగా ప్రశ్నించారు. కేంద్రం లాభనష్టాలు బేరీజు వేసుకుని ప్రయివేట్‌ ‌లిమిటెడ్‌ ‌కంపెనీ లాగా పని చేస్తుందన్నారు.

ప్రధానమంత్రి మోడీ హయాంలో అచ్చేదిన్‌ ‌కాదు సచ్చేదిన్‌ ‌వొచ్చిందన్నారు. ప్రజల నుంచి గుంజుకోవడమే తప్ప కేంద్రంలోని బిజెపి పార్టీ ప్రభుత్వానికి ఇవ్వడం మాత్రం తెలియదన్నారు. రైతులు పండించిన వడ్లు కొనకుండా కాల్చుకు తింటుందనీ, మన్‌ ‌కీ బాత్‌ ‌కాదు ముందుగా మా రైతుల బాధలు వినాలని ప్రధానమంత్రి మోడీని కోరారు. పండిన వడ్లు కొనే బాధ్యతను రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వంపైనే పెట్టిందన్నారు. తెలంగాణ రైతులు పండించిన వడ్లు కొనాలి..బాయిల్డ్ ‌రైస్‌ ‌చేసుకుంటావా.. నూకలు చేసుకుంటావా, సన్న బియ్యం పెట్టుకుంటావా వారిష్టం అన్నారు. కేంద్రం తొండాట అడుతున్నది.. రైతులను రోడ్ల మీదకు తెస్తున్నదనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాలకు వడ్లు ఎగుమతి చేయాలంటే అది కేంద్రమే చేయాలన్నారు.

పెట్రో ధరలు కరెంట్‌ ‌మీటర్‌ను మించి పెరుగుతున్నదనీ, గత 14 రోజులుగా రోజూ చమురు ధరలు పెంచాతున్నారనీ, ఎరువుల ధరలు పెంచి రైతుల ఉసురు పోసుకుంటున్నదన్నారు. గ్యాస్‌ ‌మంటతో మళ్లీ ఉనుక పొయ్యిలు వాపస్‌ ‌వస్తున్నాయి..మనం ముందుకు పోతున్నామా? వెనక్కి పోతున్నామా?అని కేంద్రాన్ని మంత్రి హరీష్‌రావు నిలదీశారు. వడ్ల కొనుగోలుపై ఇప్పుడు చేస్తున్న పోరాటాన్ని, ఉద్యమాన్ని, ఆదోళనలను మరింత ఉధృతం చేద్దామన్నారు. గట్టిగా పోరాడి శాశ్వత పరిష్కారాన్ని సాధించుకోవాలన్నారు. 8(శుక్రవారం)న  కేంద్ర ప్రభుత్వ శవయాత్ర చేసి, ప్రతి ఇంటిపై నల్ల జెండా ఎగురవేయాలనీ, 11న దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిపించేలా ఆందోళన చేస్తామన్నారు.  ఎస్టీలకు 11 శాతం రిజర్వేషన్లు కావాలని తీర్మానం చేసి పంపితే పంపలేదని కేంద్ర మంత్రి  అబద్దాలాడుతున్నాడనీ, కేంద్రంలో 16 )క్షల 50 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనీ, వాటిని నింపకుండా నిరుద్యోగుల ఉసురు పోసుకుంటుందనీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు.

ఈ నిరసనలో మెదక్‌ ఎం‌పి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు వంటేరు యాదవరెడ్డి, ఫారుఖ్‌హుస్సేన్‌, ఎఫ్‌డిసి ఛైర్మన్‌ ‌వంటేరు ప్రతాప్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌, ‌టిఆర్‌ఎస్‌ ‌రాష్ట్ర నాయకులు వేలేటి రాధాకృష్ణశర్మ, కోమటిరెడ్డి వెంకట్‌నర్సింహారెడ్డి(కేవీఎన్‌ఆర్‌), ‌బక్కి వెంకటయ్య, డిసిసిబి ఛైర్మన్‌ ‌చిట్టి దేవేందర్‌రెడ్డి, రైతు సమన్వయ కర్త అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ ‌లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, సిద్ధిపేట మునిసిపల్‌ ‌ఛైర్‌ ‌పర్సన్‌ ‌మంజుల రాజనర్సుతో పాటు జిల్లాలోని ఆయా మండలాలకు చెందిన జడ్పిటిసిలు, ఎంపిపిలు, సర్పంచులు, ఎంపిటిసిలు, పార్టీ శ్రేణులు రైతులు పాల్గొన్నారు.

 

Leave a Reply