Take a fresh look at your lifestyle.

మోదీకి కోపమొచ్చింది…!

ప్రధాని నరేంద్ర మోదీకి తమ పార్టీ ఎంపీల పైన  కోపం వొచ్చింది. చిన్న పిల్లల్లా ఎన్నిసార్లు చెప్పించుకుంటారని ఆయన వారిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కోట్లాది మంది ప్రజల జీవన విధానాన్ని మార్చగల చట్టసభల్లో ప్రజాప్రతినిధుల హాజరు సంఖ్య సంపూర్ణంగా ఉండడ మన్నది చాలా అరుదు. తమకు సంబందించిన ప్రశ్నల సమయంలో లేదా వోటింగ్‌ ‌సమయంలో తప్ప మిగతా చర్చల్లో భాగస్వాములవడమన్నది అరుదుగా కనిపిస్తున్నది. ప్రస్తుతం జరుగుతున్న ఉభయ సభల సమావేశాల్లో కూడా అలాంటి పరిస్థితి గమనించి ప్రధాని మోదీ అసహనానికి గురైన విధానం సంబంధిత వర్గాల ద్వారా వెల్లడవటమేకాదు,  వైరల్‌ అయింది.

గతంలో కూడా ఇలాంటి పరిస్థితి గమనించి మోదీ ఎంపీ లను హెచ్చరించినట్లు కూడా దీని వల్ల అర్థమవుతున్నది. సమావేశాలు జరుగుతున్నప్పుడు క్రమశిక్షణ గల ప్రతినిధులు హాజరవ్వాలని ఇప్పటికే అనేక సార్లు చెప్పానని, చిన్న పిల్లలైనా చెప్పినట్లు వింటారుగాని, మీలో పరివర్తన రావటంలేదంటూ ఆయన పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న క్రమంలోనే బయట ఏర్పాటుచేసిన తమ ఎంపీల ప్రత్యేక సమావేశంలో ఆవేశపడినట్లు తెలుస్తున్నది. బాధ్యతాయుత పదవుల్లో ఉండి కూడా మరీ మరీ చెప్పించుకోవడం సరైందికాదని కోపగించుకున్న తీరు చూస్తుంటే లక్షలాది మందితో ఎన్నుకోబడిన ఈ ప్రజా ప్రతినిధులు  తమ బాధ్యతలను ఎలా విస్మరిస్తున్నారన్నది అర్థమవుతున్నది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయంటేనే దేశంలోని ప్రజలంతా ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు.

ప్రజా సంక్షేమం విషయంలోగా దేశ ఆర్థిక, భద్రత పై ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారని వేచి చూస్తుంటారు. అలాంటి చట్టసభలో ముఖ్య విషయాలపై చర్చ జరుగుతున్నప్పుడు ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలను కూడా వెల్లడించాల్సిన తరుణంలో గైర్హాజర్‌ అవడమన్నది చింతించాల్సిన విషయం. దేశంలో నెలకొన్న అనేక సమస్యలు సభ ముందుంచి, వాటిపై సమగ్రమైన చర్చ జరిపి, పరిష్కారమార్గాన్ని అన్వేషించేందుకు తమ ప్రతినిధిగా ప్రజలు ఈ అత్యున్నత చట్ట సభకు పంపిస్తే, తమ కార్యక్రమాలను చక్కబెట్టుకోవడం తోనే  వారికి సరిపోతున్నదన్నది దీనివల్ల స్పష్టమవుతున్నది.  అదే విషయాన్ని మోదీ తమ ఎంపీలకు చెప్పినట్లు తెలుస్తున్నది. దేశ ప్రజలకోసం పనిచేయాల్సిన వారు ఆ విషయాన్నే మరిచిపోతే ఎలా అన్నది. ముఖ్యంగా పార్లమెంటు సమావేశాల సందర్భంగా సమయపాలన పాటించడం తో పాటు తమ ప్రాంత సమస్యల పరిష్కారానికి పోటీపడాలన్నారు.

అవసరం లేని విషయాలపైన అనవసరంగా నోరు పారేసుకొని సభ ప్రతిష్టంభనకు కారకులు కావద్దని కూడా ఆయన హెచ్చరించారు.  ఉదయాన్నే సూర్య నమస్కారం చేసి పార్లమెంటుకు వచ్చినట్లు అయితే మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని ఆయన సూచించినట్లు తెలుస్తున్నది.నాగాలాండ్‌లో సైన్యం ఆపరేషన్‌ ‌వికటించి పద్నాలుగు మంది సాధారణ పౌరులు మరణించారు. ఈ సంఘటన సంబంధించిన అంశం పార్లమెంటు సమావేశాల్లో వాడి వేడి చర్చగా మారింది. విపక్షాలన్నీ ఏకమై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. సభలో పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది. దీనికి తోడు గత సమావేశాల్లో రాజ్యసభ చేర్మన్‌ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణతో పన్నెండు మంది ఎంపిలను సస్పెండ్‌ ‌చేశారు. వారి పైన విధించిన సస్పెన్షన్‌ వెంటనే ఎత్తి వేయాలని మరో పక్క విపక్షాలు తీవ్రంగా పట్టుబడుతూ సమావేశాలు ముందుకు సాగకుండా గందరగోళ పరుస్తున్నారు. సభ్యులు క్షమాపణ చెబితేనే వారిపై ఉన్న ఆంక్షను ఎత్తివేస్తామని అధికార పక్షం కూర్చుంది. ఇదొక పక్క సాగుతుంటే మరోపక్క తెరాస ఎంపీలు వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని సమావేశాలు మొదలైనప్పటి నుండి ప్లకార్డులు, నినాదాలతో సభ కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు. కాగా, ఈ సమావేశాల్లో 26 ముఖ్యమైన బిల్లులను పాస్‌ ‌చేయించుకోవాలన్నది అధికార పక్షం లక్ష్యం.

ఈ క్రమంలో అధికార సభ్యులు హాజరు కాకపోతే ఎలా అన్నది మోదీ ఆవేదన. సమీపంలో పలు రాష్ట్రాల్లో శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల పైన కాషాయ జెండా ఎగురవేసేందుకు  పార్టీ ప్రణాళికలు రచిస్తున్నది. ఈ తరుణంలో  పార్లమెంట్ లో విపక్షాలది పై చెయ్యి గా ఉంటే దాని ప్రభావం ఎన్నికల పైన పడకపోదు. అందుకే విపక్షాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలంటే స్వపక్ష ఎంపిలు తప్పక హాజరు కావాల్సిందే. అదే విషయాన్ని మోదీ తమ ఎంపిలకు చెప్పారు. ఇప్పటికైనా మీరు మారక పోతే  తానే మార్చాల్సి ఉంటుందన్న ఆయన ఘాటైనా మాటల ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి …

Leave a Reply