“ఆదివారం నాడు రాత్రి తొమ్మిది గంటలనుంచి తొమ్మిది నిమిషాల సేపు దీపాలను వెలిగించమని ఆయన దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వారు ఎంతో వినయవిధేయతలతో దీపాలను వెలిగించి ఆయన భాషలోనే దేశమంతటా ఒక్కటేనన్న సంఘీభావాన్ని తెలిపారు. బహుశా ఆయనకు ముందు ప్రధానులుగా పని చేసిన మన్మోహన్ సింగ్ నుంచి రాజీవ్ గాంధీ వరకూ ఎవరూ ఇలా చేసి ఉండరు. ప్రచార మాధ్యమాల ద్వారా నేరుగా మాట్లాడటంలో ఆయన ఆరితేరారు. ఆకాశవాణి మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ఆయన ప్రజలకు చేరువయ్యారు.”
ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఎవరికి ఎప్పుడు ఏం చెప్పాలో బాగా తెలుసు. ప్రజలను సమ్మోహితం చేయడంలో బహుశా ఆయనను మించినవారు లేరు. కొరోనా గురించి రకరకాల కథనాలు ఎప్పటికప్పుడు కొత్తగా వెలువడుతున్నాయి. ఈ వారం వెలువడిన కథనాలు తీసుకుంటే, ప్రజాజీవితాన్ని ఇంతగా అతలాకుతలం చేస్తున్న కొరోనా వైరస్‌కి సంబంధించి ఎదురవుతున్న సవాల్‌ను గురించి ప్రజలకు ఆయన ఇస్తున్న సందేశాన్ని పరిశీలిద్దాం. ఆదివారం నాడు రాత్రి తొమ్మిది గంటలనుంచి తొమ్మిది నిమిషాల సేపు దీపాలను వెలిగించమని ఆయన దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వారు ఎంతో వినయవిధేయతలతో దీపాలను వెలిగించి ఆయన భాషలోనే దేశమంతటా ఒక్కటేనన్న సంఘీభావాన్ని తెలిపారు. బహుశా ఆయనకు ముందు ప్రధానులుగా పని చేసిన మన్మోహన్ సింగ్ నుంచి రాజీవ్ గాంధీ వరకూ ఎవరూ ఇలా చేసి ఉండరు. ప్రచార మాధ్యమాల ద్వారా నేరుగా మాట్లాడటంలో ఆయన ఆరితేరారు. ఆకాశవాణి మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ఆయన ప్రజలకు చేరువయ్యారు ఇప్పుడు కొరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రసార సాధనాల ద్వారా ప్రజల నుద్దేశించి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ప్రభుత్వాధినేతగా ఆయన అలా సూచనలు ఇవ్వడం తప్పులేదు. అది ఆయన బాధ్యత. ఆయన అభ్యర్థన మేరకు దేశమంతటా దీపాలను వెలిగించారు. అయితే, దీపాలను వెలిగించినంత మాత్రాన కొరోనా పారిపోతుందా అన్న సందేహాలను వ్యక్తం చేసినవారున్నారు. అయితే, ప్రధానమంత్రి మాటంటే మాటే, ఆయన మాటను అందరూ పాటించారు. ఇక మీదట కూడా పాటించవచ్చు. ఆయనను అంతా నమ్ముతున్నారు.
ఇప్పుడే కాదు, పెద్ద కరెన్సీ రద్దు వల్ల ఎన్నో ఇక్కట్లు పాలైనప్పటికీ జనం ఆయన మాట నమ్మారు. ఆయన అభ్యర్థన మేరకు కష్టాలను ఓర్చుకున్నారు. ఇప్పుడు కూడా రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. వాటి వల్ల వాటిల్లే కష్టాలను జనం ఓర్చుకుంటారు. ఆయన పిలుపు మేరకు గ్యాస్ సబ్సిడీని మహిళలు వదులుకున్నారు. కొరోనాని ఎదుర్కోవడానికి జనతా కర్ఫ్యూని పాటించమంటే పాటించారు. పెద్ద కరెన్సీని రద్దు చేసినప్పుడు గోవాలో జరిగిన సమావేశంలో ప్రసంగిస్తూ 50 రోజులు ఓరిమి వహించమని పిలుపు ఇచ్చారు. ఏభై రోజులేమిటీ ఈ రోజుకీ కరెన్సీ రద్దు ప్రభావాన్ని ప్రజలు అనుభవిస్తున్నారు. లాక్ డౌన్ వల్ల వలస కార్మికుల పరిస్థితిని గురించి ఆయన ఆలోచించలేదు. ఇదొక్కటే కాదు, ఆయన తీసుకునే నిర్ణయాలకు పర్యవసానాలను గురించి ఆయన ఆలోచించరు. ప్రజలను వాళ్ళ పాట్లకు వాళ్ళను వదిలివేస్తారు. లాక్ డౌన్ వల్ల కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకున్నట్టు లేదు. ముఖ్యంగా రోజువారీ కూలీల పరిస్థితి మరీ అగమ్యగోచరంగా తయారైంది. వారికి ఉపాధి కల్పించే ఆలోచనలు చేయకుండా, మధ్యతరగతి వర్గాల సమస్యలు పట్టించుకోకుండా కేవలం దీపాలు వెలిగించండంటూ పిలుపు ఇవ్వడం వల్ల కొరోనా కష్టాల నుంచి ప్రజలు దూరమవడం సాధ్యమా అని వైద్య రంగంలో నిపుణులు ప్రశ్నిస్తున్నారు. దేశంలోని అనేక ఆస్పత్రులలో కనీస వైద్య సదుపాయాలు లేవు, భయంకరమైన వ్యాధి బారిన పడిన వారికి వైద్యం చేసేందుకు సరైన పరికరాలు లేవు, వైద్యుల రక్షణకు మాస్క్‌లు వంటివి లేవు. అయినా అందరికీ వైద్యం అందిస్తున్నామని అనుకోవడం ఆత్మవంచనే. మోడీ ఏం చెబితే అది చేయడానికి జనం సిద్ధంగా ఉన్నారు. అలాంటప్పుడు ఆయన అమలు జేయాల్సిన కార్యక్రమాలు వేరుగా ఉంటాయి. దీపాలు వెలిగించడం మాత్రమే కాదు.
– శేఖర్ గుప్త,
‘ద ప్రింట్’ సౌజన్యంతో.