Take a fresh look at your lifestyle.

తెలంగాణ ఏర్పాటుపై మోదీ విద్వేషం

  • రాష్ట్రంపై బిజెపికి నిలువెత్తు విషం
  • బిజెపి ఫేక్‌ ‌ప్రచారాలను ఎండగట్టాలె..
  • తళితుల, గిరిజనుల రక్షణ కోసమే కెసిఆర్‌ ‌రాజ్యాంగ సవరణ ప్రస్తావన
  • తెలంగాణ సంక్షేమ పథకాలను కాపీ కొట్టిన కేంద్రం
  • నారాయణరావుపేట మండల ముఖ్యకార్యకర్తల సమావేశంలో మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట, ఫిబ్రవరి 9(ప్రజాతంత్ర బ్యూరో) : బిజెపి పార్టీ వైఖరి గిల్లీకజ్జాలు, కొట్లాటతో అబద్ధాన్ని వందసార్లు చెబితే నిజమైతదన్న రీతిలో తప్పుడు ప్రచారం చేయడం అనేది బిజెపి పార్టీకి అలవాటుగా మారిందని దీనిని ప్రజలకు అర్థమయ్యే విధంగా పార్టీ అధ్యక్ష్యలు బాధ్యత తీసుకుని, యువతకు, ప్రజలకు చేరేలా క్షేత్రస్థాయిలో వివరించాల్సిన బాధ్యత పార్టీ అద్యక్షులుగా చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పిలుపునిచ్చారు. సిద్ధిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నారాయణరావుపేట మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ…గ్రామ, మండల స్థాయి పార్టీ అధ్యక్షులు ఓ వైపు పార్టీ బలోపేతానికి కృషి చేస్తూనే..మరోవైపు బిజెపి పార్టీ నేతలు  చేసే దుష్ప్రచారంను తిప్పికొట్టాల్సిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించాలని పార్టీ శ్రేణులను మంత్రి హరీష్‌ ‌రావు కోరారు.

తెలంగాణా పట్ల ఉండే వ్యతిరేకతను చెప్పకనే ప్రధాని మోదీ చెప్పారని, 1997లో బిజెపి పార్టీ  ఒక్క వోటు రెండు రాష్ట్రాలని తీర్మాణం చేసి, అధికారంలోకి వచ్చి తెలంగాణ ఇవ్వనిది కూడా బిజెపి పార్టీనేనని అన్నారు. కష్టపడి తెలంగాణను తెచ్చుకుంటే తెలంగాణకు లాభం, ఆంధ్రాకు నష్టమైందని ధోరణిలో మాట్లాడటం సరికాదనీ, మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటి రోజున 7మండలాలు, లోయర్‌ ‌సీలేరు ప్రాజెక్టును ఆంధ్రాకు అప్పగించి తెలంగాణకు అన్యాయం చేశారని దుయ్యబట్టారు. అవకాశం వొచ్చిన ప్రతీసారి పార్లమెంటులో 4, 5 మార్లు విభజన సరిగ్గా జరగలేదనీ, ఆక్రోశాన్ని మనపై వ్యతిరేకతను వెల్లిబుచ్చుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలను గట్టిగా తిప్పి కొట్టాలని టిఆర్‌ఎస్‌ ‌శ్రేణులకు మంత్రి హరీష్‌ ‌రావు పిలుపునిచ్చారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రాజ్యాంగ సవరణ చేయాలనీ ఎందు కోసమంటే దళితులకు, గిరిజనులకు మరింత రక్షణ కావాలని, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తున్నారని, భవిష్యత్తులో బిసిలకు, మహిళలకు రాజ్యాంగపరంగా ఉండే రిజర్వేషన్లు లేకుండా పోతున్నాయని.. వారందరికీ నష్టం జరుగుతుందని చెప్పినట్లు వెల్లడించారన్నారు.

దేశ వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీల జనాభా 40శాతం ఉంటే బడ్జెట్‌లో 12వేల 800కోట్ల రూపాయలు ఏ మూలకు సరిపోతాయని, జనాభా ప్రాతిపాదికన నిధులు పెంచాలని, బిసిలకు కేంద్రంలో మంత్రిత్వ శాఖ తేవాలని, ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్‌ఐసి, ఆంధ్ర విశాఖ ఉక్కు అమ్మేశారని, బిహెచ్‌ఈఎల్‌, ‌బిడిఎల్‌ అమ్మకానికి పెడుతున్నారని, బిఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగాలు తీసేశారని, రైళ్లను ప్రైవేట్‌ ‌పరం చేస్తున్నారని.. ఇదంతా వదిలి తిరిగి  టిఆర్‌ఎస్‌పై బద్నాం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ఇవన్నీ వాస్తవాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియపర్చాలని టిఆర్‌ఎస్‌ ‌పార్టీ శ్రేణులను కోరారు.

తెలంగాణ సంక్షేమ పథకాలను కాపీ కొట్టిన కేంద్రం ...
తెలంగాణ రాష్ట్రం ఇచ్చే సంక్షేమ పథకాలను కేంద్రంలోని బిజెపి పార్టీ ప్రభుత్వం కాపీ కొట్టిందన్నారు. కల్యాణ లక్ష్మీ పథకం ద్వారా ఇప్పటిదాకా 10 లక్షల ఆడపిల్లల పెళ్లిలకు 8వేల300 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేశామనీ, దేశంలో ఎవరూ ఇవ్వలేదని ధీమాగా చెప్పాలని కోరారు. ఇంటింటికీ మంచినీరు, రైతుబంధు, మిషన్‌ ‌భగీరథ వంటి ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పనులు చేశామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో గెలిస్తే ఉచిత కరెంటు ఇస్తామని కూడా కాపీ కొట్టారనీ, కానీ తెలంగాణకు చేసిందేమీ లేకున్నా.. ఫేక్‌ ‌ప్రచారం కొనసాగిస్తున్న తీరును తిప్పి కొట్టాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.  విభజన చట్టంలో చెప్పిన గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, జాతీయ ప్రాజెక్టు, వరంగల్‌కు రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ.. ఇలా ఏదీ ఇవ్వలేదని వివరించి.. మనపైనే విషం చిమ్మడం, బురద చల్లడం ఓ రకమైన దుష్ప్రచారానికి పాల్పడ్డారని చెప్పుకొచ్చారు.

Leave a Reply