- హిట్లర్ ఆదర్శంగా మోదీ పాలన
- కర్నాటక మాజీ సిఎం సిద్దరామయ్య ఘాటు విమర్శలు
- తిప్పికొట్టిన సిఎం బొమ్మై
బెంగళూరు, జనవరి 23 : ప్రపంచంలో నియంతలకు పట్టిన గతే మోడీకి కూడా పడుతుందని, సావర్కర్‌కు జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ స్ఫూర్తి అంటూ వీర్ దామోదర్ సావర్కర్ పై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకత్వంపైనా విమర్శలు గుప్పించారు. దక్షిణ కన్నడ ప్రాంతాన్ని హిందుత్వ లేబొరేటరిగా మార్చాలని బీజేపీ అనుకుంటోంది. వాళ్ల ఏకైక వృత్తి అబద్దాలు ఆడటం. సావర్కర్‌కు ఎవరు స్ఫూర్తో తెలుసా? హిట్లర్ ఫిలాసఫీ. హిందుత్వను ప్రారంభించింది ఎవరో తెలుసా? సావర్కర్ హిందూ మహాసభ అని డియా సమావేశంలో సిద్ధరామయ్య చెప్పారు. బీజేపీ నాయకత్వాన్ని కూడా హిట్లర్‌తోనూ, ఇతర నియంతలతోనూ సిద్దారామయ్య పోల్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హిట్లర్, ముస్సోలిని మధ్య పోలికలను ఆయన వివరిస్తూ, బీజేపీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఆయన ప్రధాని.
ఆయనను రానీయండి. మాకు ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ, ఆయన వందసార్లు బీజేపీ అధికారంలోకి వస్తుందని చెబితే మాత్రం, అదెప్పటికీ జరగదని నేను చాలా స్పష్టంగా చెప్పదలచుకున్నాను. ప్రజలు కూడా నమ్మరు. హిట్లర్‌కు ఏమి జరిగింది? కొద్ది రోజులుగా ఆడంబరంగా తిరిగారు. ముస్సోలిని, ఫ్రాన్కో విషయంలో ఏమి జరిగింది? మోదీ కూడా ఇలాగే కొద్ది రోజుల ఆడంబరమే అని సిద్ధరామయ్య అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో సిద్ధరామయ్య పోల్చడంపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు కర్ణాటక సంస్క•తి కాదని అన్నారు. మోదీ వ్యక్తిత్వం ఏమిటనేది దేశంలోని 130 కోట్ల మంది జనాభాకు తెలుసునని, గుజరాత్ ఎన్నికల్లోనూ ప్రధానిపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారని, ఏమాత్రం ఫలితాలు సాధించారో అందరికీ తెలిసిందేనని అన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం మాజీ ముఖ్యమంత్రి హోదాకు తగదని హితవు పలికారు.