Take a fresh look at your lifestyle.

ఫెడరలిజానికి మోదీ ప్రభుత్వం తూట్లు..

‌మొన్నటికి మొన్న కూడా బెంగాల్‌ ఐపిఎస్‌ అధికారులు కొందరిని ఢిల్లీ వచ్చి తమకు రిపోర్టు చేయాలన్నారు. ఇది పూర్తిగా నిరంకుశ వైఖరి తప్ప మరోటి కాదు. రాష్ట్రాలు కేంద్రానికి సబార్డినేట్‌ ‌కావు. రాజ్యాంగంలో కేంద్రం వైపు కాస్త మొగ్గు ఉన్నమాట వాస్తవమే కానీ, ఇచ్చిపుచ్చుకునే ధోరణి వల్ల మాత్రమే పని నడుస్తుంది. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ధోరణికి మంగళం పాడుతున్నారు.

బెంగాల్‌ ‌లో మంచి మెజారిటీతో అధికారాన్ని నిలుపుకున్న తర్వాత కూడా మమతా బెనర్జీకి కష్టాలు తీరలేదు. మంచి మెజారిటీతో అధికారాన్ని నిలుపుకున్నందువల్లనే కష్టాలు పెరిగాయని ఎవరన్నా అంటే దానికి మనం ఒప్పుకోవాల్సిందే. ఎలాగంటే..మంచి మెజారిటీ సాధించడం అంటే ప్రధాన ప్రతిపక్షమైన బీజెపిని ఆ మేరకు తక్కువ స్థానాలకు పరిమితం చేయడమే కదా..! మరి మోదీ అమిత్‌ ‌షా ద్వయం దాన్ని జీర్ణించుకోవడం కాస్త కష్టమే కదా. మొదటిది సర్వ శక్తులూ ఒడ్డి పోటీ చేసినా ఓటమి పాలవడం.. రెండవది కర్నాటక, మధ్యప్రదేశ్‌ ‌రాష్ట్రాల్లో చేసి చూపిన విధంగా దొడ్డి దారిన అధికారం చేజిక్కించుకునేందుకు వీలు లేకుండా మరీ ఎక్కువ వ్యత్యాసంతో ఓడిపోవడం.. మరి కోపం రమ్మంటే రాదూ దీదీపై..!

బెంగాల్‌ ‌ప్రధాన కార్యదర్శి..ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు ఆలాపన్‌ ‌బంద్యోపాధ్యాయ చుట్టూ తిరుగుతున్న వివాదం ఆమెను సాధించడానికి ఉద్దేశించినదే. మమతను సాధించడం బాగానే ఉంది కానీ దేశంలో ఫెడరలిజానికి సమాధి కట్టకూడదు కదా..! మన రాజ్యాంగం ప్రారంభంలోనే ఆర్టికల్‌ ‌వన్‌.. ఇం‌డియా.. దట్‌ ఈజ్‌ ‌భారత్‌..’ ‌షల్‌ ‌బి ఎ యూనియన్‌ ఆఫ్‌ ‌స్టేట్స్’ అని చెబుతుంది. ఇది రాజ్యాంగం మౌలిక స్వరూపంలో భాగం, దీనిని మార్చేందుకు కుదరదు. ఎప్పుడో 1973లోనే సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసు తీర్పులో ఈ విషయం స్ఫష్టం చేసింది. మార్చడం కుదరదు కానీ.. విచ్ఛినం చేయవచ్చు కదా. మోదీ ప్రభుత్వం ఆ పనే చేస్తున్నది..నిరాటంకంగా.. నిర్భయంగా.

బెంగాల్‌ ‌లో ప్రధాని ఏర్పాటు చేసిన తుపాను సహాయ చర్యల సమీక్షా సమావేశానికి ముఖ్యమంత్రి.. మమత, ప్రధాన కార్యదర్శి బంద్యోపాధ్యాయ హడవుడిగా హజరయి సహాయం కోసం ఒక వినతిపత్రం సమర్పించి..వేరే పర్యటన ఉన్నదని చెప్పి వెళ్లిపోయారు. ఇది ఒక రకంగా ప్రధాని సమావేశాన్ని బహిష్కరించడమే..! ఆ సమావేశానికి బీజెపి నందిగ్రామ్‌ ఎమ్మెల్యే సువేందు అధికారిని పిలిచి కూర్చోబెట్టారు. ఆ సువేందు మొన్నటి ఎన్నికల ముందు తృణమూల్‌ ‌ను వీడి బీజెపిలో చేరిన వ్యక్తి. పైగా నందిగ్రామ్‌ ‌లో మమత ను ఓడించిన వ్యక్తి. ఆయనను పిలిచి సమీక్షా సమావేశంలో ప్రధాని పక్కన కూర్చోబెడితే మమతకు మండదా మరి. ఆమెను అవమానించడం కోసమే ఆ పని చేశారని అర్ధం అవుతూనే ఉంది. అందుకే మమత ప్రధాని సమావేశానికి ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. మోదీ బృందం ఎంత సంకుచితంగా ప్రవర్తించినా మమత చేసింది తప్పే. దీనిని ఆమె రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప ప్రధాని సమావేశాన్ని బహిష్కరించడం సరైన పని కాదు.

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యానికి ప్రధానిగా ఉండి ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్ధిని.. అందునా మహిళను.. దీదీ ఓ దీదీ అంటూ అవహేళన చేసిన వ్యక్తి నుంచి మమత రాజనీతిజ్ఞత ఆశిస్తే ఎలా..? ముందే అన్నట్లు దీనిని రాజకీయంగా ఎదుర్కోవాలి. పోనీలే అని ప్రధాని బృందం దానిని అక్కడితో ఆపిందా, లేదు. వెంటనే బంద్యోపాధ్యాయ ను ఢిల్లీ వచ్చి రిపోర్ట్ ‌చేయాల్సిందిగా ఆదేశాలు పంపారు. మే నెల 31న రిటైర్‌ ‌కావాల్సిన బంద్యోపాధ్యాయకు అంతకు ముందే కేంద్రం మూడు నెలలు పదవీకాలం పొడిగించింది. ఇంతలో ఈ ఆదేశాలు వచ్చేసరికి ఆయన పదవీ విరమణ చేసి కూర్చున్నారు. మోదీ ప్రభుత్వం అప్పటికీ ఆగలేదు. వెంటనే ప్రకృతి ఉత్పాతాల చట్టం కింద నోటీసు ఇచ్చింది.

ఏమనాలి దీనిని..? తాను ఎవరి నేతృత్వంలో పని చేస్తున్నారో ఆ ముఖ్యమంత్రి ఆదేశాలకు భిన్నంగా ప్రధాన కార్యదర్శి వ్యవహరించగలరా..? మోదీ వ్యవహారాన్ని మమత రాజకీయంగా ఎదుర్కోవాలని ఎలా అనుకున్నామో అలాగే దీదీని కూడా మోదీ రాజకీయంగా ఎదుర్కోవాలి. అంతే తప్ప అధికారం ఉంది గదా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ధ్వంసమయ్యేది వ్యవస్థలు. నిజానికి మోదీ ప్రభుత్వం అన్నీ తెలిసే వ్యవస్థలతో ఆడుకుంటున్నది. రాజకీయ ప్రయోజనాలు తప్ప వారికేమీ పట్టవు. సిబిఐ, ఆదాయం పన్ను శాఖ, ఎన్‌ఐఎ, ఇడి వంటి కేంద్ర ఏజెన్సీలు ఎటూ పూర్తిగా పాదాక్రాంతం అయిపోయాయి. ఇక రాష్ట్రాలలోని ఆల్‌ ఇం‌డియా సర్వీసు అధికారులు కూడా తమ కనుసన్నలలోనే పని చేయాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. మొన్నటికి మొన్న కూడా బెంగాల్‌ ఐపిఎస్‌ అధికారులు కొందరిని ఢిల్లీ వచ్చి తమకు రిపోర్టు చేయాలన్నారు. ఇది పూర్తిగా నిరంకుశ వైఖరి తప్ప మరోటి కాదు. రాష్ట్రాలు కేంద్రానికి సబార్డినేట్‌ ‌కావు. రాజ్యాంగంలో కేంద్రం వైపు కాస్త మొగ్గు ఉన్నమాట వాస్తవమే కానీ, ఇచ్చిపుచ్చుకునే ధోరణి వల్ల మాత్రమే పని నడుస్తుంది. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ధోరణికి మంగళం పాడుతున్నారు. రాజ్యాంగాన్ని రాసినపుడు దాని నిర్మాతలు భవిష్యత్తులో ఇలాంటి పాలకులు వస్తారని ఊహించలేకపోయారు. ఊహించి ఉంటే దానికి తగినట్లే రాజ్యాంగ రచన చేసి ఉండేవారు.

ఫెడరలిజానికి మోదీ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్న వైనాన్ని నాన్‌ ‌బిజెపి పార్టీల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలు గట్టిగానే విమర్శిస్తున్నాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వాలు, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌ ‌లోని వైసిపి ప్రభుత్వం కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి వింజామరలు వీస్తున్నాయి. తమ అడుగులకు మడుగులొత్తే ఇట్లాంటి ప్రాంతీయ పార్టీలను కూడా బీజెపి నాయకత్వం కొంత కాలమే ముద్దు చేస్తుంది. అవసరం తీరిన తర్వాత విసిరిపారేస్తుంది. ఆ సంగతి తెలిసి కూడా ఈ నేతలు జీ హుజూర్‌ అం‌టున్నారంటే మనం ఏమనుకోవాలి. ఆలోచించండి..!
గెస్ట్ ఎడిట్‌: ఆలపాటి సురేష్‌ ‌కుమార్‌

Leave a Reply