Take a fresh look at your lifestyle.

మోదీ, కేసీఆర్‌ ‌కలసి రైతులను మోసం చేస్తున్నారు

  • ప్రధానితో చర్చలని కేసీఆర్‌ ‌దిల్లీలో దావత్‌ ‌చేసుకుని వొచ్చారు
  • మహమూద్‌ అలీ, కేటీఆర్‌కు వరి గురించి ఏం తెలుసు ?
  • పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి
  • 48 గంటల వరి దీక్ష విరమణ

రాష్ట్రంలో వరికుప్పలపై పడి రైతులు చనిపోతుంటే కేంద్రంతో చర్చల పేరుతో సీఎం కేసీఆర్‌ ‌దిల్లీలో దావత్‌ ‌చేసుకని వొచ్చారని టీ పీసీసీ చీఫ్‌ ఎ.‌రేవంత్‌ ‌రెడ్డి విమర్శించారు. ధాన్యం సేకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదనీ, మోదీ, కేసీఆర్‌ ‌కలసి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. పండించిన ధాన్యం కొనకుండా మొలకలు ఎత్తడానికి , రైతుల సమస్యలన్నింటికీ కారణం కేసీఆరేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో టీ పీసీసీ నేతృత్వంలో ఇందిరా పార్క్ ‌వద్ద నిర్వహించిన 48 గంటల వరి దీక్ష ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా టీ పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డికి, ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పార్టీ సీనియర్‌ ‌నేత జానారెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో రైతుల చావులకు కారణం సీఎం కేసీఆరేననీ, రైతుల సమస్యల సృష్టి కర్త కూడా ఆయనేనని ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రులతో చర్చించడానికి దిల్లీ వెళ్లిన మంత్రులు మహమూద్‌ అలీ, కేటీఆర్‌కు వరి గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. కేసీఆర్‌ ‌ధర్నా చౌక్‌లో ధర్నా చేసి కేంద్రం మెడలు వంచుతాం అంటాడు..దిల్లీకి వెళ్లి దందా చేస్తాడని తీవ్రంగా విమర్శించారు. రైతుల సమస్యలపై చర్చించడానికి సీఎం కేసీఆర్‌ ‌మోదీని అపాయింట్‌మెంట్‌ అడిగిన లెటర్‌ ‌చూపించాలని డిమాండ్‌ ‌చేశారు.

కేసీఆర్‌ ‌మోదీని కలవడానికి అసలు అపాయింట్‌మెంట్‌ అడిగితే కదా అని వ్యాఖ్యానించారు. తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే కేసీఆర్‌ ‌ధర్నా పేరుతో డ్రామాలుచేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌ ‌నిర్లక్ష్యం కారణంగానే వేల టన్నుల ధాన్యం నీటిపాలు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఫ్రీ కరెంట్‌, ఎరువులు అడగడం లేదనీ, కేవలం తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధర మాత్రమే అడుగుతున్నారని పేర్కొన్నారు. దిగుబడి వొచ్చి 45 రోజులు గడచినప్పటికీ సేకరణ ఏర్పాట్లు చేయడం లేదని మండిపడ్డారు. వద్దంటే వరి వేశారనే కక్షతోనే ధాన్యం కొనుగోలు చేయడం లేదని విమర్శించారు. బీజేపీ నేతలు రైతులను ఆదుకోకుండా ఫిరాయింపులపై ఆలోచనలు చేస్తున్నారనీ, గుండు, అర గుండు వెళ్లి కేంద్రాన్ని అడగరని ఎద్దేవా చేశారు. ఢిల్లీకి వెళ్లొచ్చిన బీజేపీ నేత బండి సంజయ్‌ ‌వరి మాటలు పక్కనబెట్టి విద్య, వైద్యంపై సంతకం అని కొత్త రాగం అందుకున్నారనీ, త్వరలోనే దిల్లీకి వెళ్లి ధాన్యం కొనుగోళ్లపై పోరాటం చేస్తామని రేవంత్‌ ‌రెడ్డి ప్రకటించారు. పార్టీ సీనియర్‌ ‌నేత జానారెడ్డి మాట్లాడుతూ టీ పీసీసీ నిర్వహించిన వరి దీక్షతో ప్రభుత్వానికి కనువిప్పు కలగాలన్నారు. కాంగ్రెస్‌ అనేక సమస్యలను పరిష్కరించిందనీ, ఆహార భద్రత చట్టాన్ని, అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్‌ ‌పార్టీయేననీ, వరి దీక్షకు సంఘీభావం తెలిపిన పార్టీలు, సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply