Take a fresh look at your lifestyle.

ఆధునిక (అ)జ్ఞానులు

ప్యాలెసుల్లాంటి కొంపలు
సూక్ష్మ సైజుల్లో కుటుంబాలు
పెరుగుతున్న విద్యార్హతలు
తరుగుతున్న లోక లౌక్యాలు !

ఆత్యాధునిక ఔషధాలు
అరిగి పోతున్న ఆరోగ్యాలు
చందమామపైనా అడుగులు
ఇరుగుపొరుగులే అపరిచితులు !

ఆదాయాలు కొండంత
మనశ్శాంతి రవ్వంత
ఐక్యూలు ఆకాశమంత
భావోద్వేగాలు ఇసుమంత !

విజ్ఞానం సంద్రమంత
వివేకం పాతాళమంత
ఖరీదైన గడియాలున్నా..
సమయమే సన్నపూసైంది !

సంబంధాలు అసంఖ్యాకం
హృదయ బంధాలు మృగ్యం
ముఖపుస్తక స్నేహాలు బోలెడు
ప్రాణమిత్రులు పిరికెడు కూడా లేరు !

బిలియన్ల మానవాళితో ధరణి
అడుగంటేను కదా మానవీయతలు
జంతువులు పృథ్వి ప్రేమికులైననూ..
నరులైనారు పర్యావరణ హంతకులు !

అమ్మానాన్నలు వృద్ధాశ్రమాల్లో..
కన్ను మూస్తే ఘనమైన కర్మకాండలు
అంతర్జాలం అత్యవసరమైంది
అంతరాత్మే సదా గాఢ నిద్రలో ఉంది !

యూట్యూబ్‌లు ఊపిరయ్యాయి
స్వార్థాలు, స్వాహాలు స్వారీ చేస్తున్నాయి
పిల్లలకు కంటిపాప అమ్మే అయినా..
అమ్మే తమ సంతానానికి భారమైంది !

చెత్తలో తిండి వేసే ప్రబుద్దులొకవైపు..
ఆకలి చావుల కేకలు మరో వైపు
ప్రాణాపాయ ప్రమాదం పొంచి ఉన్నా..
సెల్ఫీ తీసే ఆత్రంలో నడవంత్రపు నరులు !

        –  మధుపాళీ, కరీంనగర్‌-9949700037

Leave a Reply