Take a fresh look at your lifestyle.

కొవిడ్‌-19  జాగ్ర‌త్త‌ల పై   మొబైల్ వీడియో వ్యాన్ 

రూపొందించిన  ఆర్ఒబి, పిఐబి ..ప్రారంభించిన సిద్ధిపేట కలెక్టర్ 

భార‌త ప్ర‌భుత్వ స‌మాచార, ప్ర‌సార మంత్రిత్వ శాఖ కు చెందిన రీజ‌న‌ల్ అవుట్ రీచ్ బ్యూరో (ఆర్ఒబి), ప‌త్రికా స‌మాచార కార్యాల‌యం (పిఐబి) లు తీసుకువచ్చిన ఒక సంచార దృశ్య శ్ర‌వ‌ణ రథాన్ని సోమ‌వారం సిద్ధిపేట లో సిద్ధిపేట‌ క‌లెక్ట‌ర్  పి. వెంక‌ట్రామ రెడ్డి ప్రారంభించారు.  కొవిడ్‌-19 మ‌హ‌మ్మారి బారిన ప‌డ‌కండా తీసుకోవ‌ల‌సిన జాగ్ర‌త్త‌ల‌ను వివ‌రించే దృశ్య శ్ర‌వ‌ణ పూర్వ‌క సూచ‌న‌లు, స‌ల‌హాలు, స‌మాచార చిత్రాలు ఈ వీడియో ప్ర‌చార వ్యాన్ లో ప్రత్యేక ఆకర్షణ గా ఉన్నాయి.  ఉదాహ‌ర‌ణ‌కు.. ముఖానికి మాస్క్ ల‌ను స‌రైన రీతిలో ధరించడం ఎలా?, ఒక మ‌నిషికి మ‌రొక మ‌నిషికి మ‌ధ్య సుర‌క్షిత దూరాన్ని పాటించ‌డం ఎలా?,  వ్యక్తిగత పరిశుభ్రతకు తీసుకోవ‌ల‌సిన జాగ్ర‌త్త‌లు ఏమిటి? మొద‌లైన సమాచారాన్ని అందించే వర్ణచిత్రాలతో ఈ వ్యాన్ ను అలంకరించారు. ఈ సంచార ర‌థాన్ని గ్రామ గ్రామాన తిప్ప‌డం ద్వారా కొవిడ్ మ‌హ‌మ్మారి నుంచి కాపాడుకొనే పద్దతుల‌పై ప్ర‌జ‌ల్లో చైత‌న్యాన్ని పెంపొందింపచేయ‌డం జ‌రుగుతుంది.  యాక్టివ్ కేసులు ఎక్కువ‌గా ఉన్న కొన్ని నిర్ధిష్ట ప్రాంతాల‌లో ప్ర‌జ‌ల్లో ఈ వ్యాధికి సంబంధించిన స్పృహ‌ను పెంచ‌డానికిగాను జిల్లా అధికార యంత్రాంగంతో పిఐబి స‌మాలోచ‌న‌లు,సంప్ర‌దింపులు జ‌రిపి ఒక షెడ్యూలు ను రూపొందించింది.

ఈ సంద‌ర్భం లో క‌లెక్ట‌ర్ ప్రసంగిస్తూ, సిద్ధిపేట లో గ‌త ఆరు రోజుల్లో కొవిడ్ కేసులు చెప్పుకోద‌గిన స్థాయిలో త‌గ్గాయ‌న్నారు. ఇది మొత్తం జిల్లా పాల‌న యంత్రాంగం, స్థానికంగా ఎన్నికైన స‌భ్యులు, స్వ‌యంస‌హాయ బృందాల కు చెందిన మ‌హిళా గ్రూపుల ఉమ్మ‌డి కృషి ఫ‌లిత‌ం అని ఆయ‌న వివరించారు.  ప‌రీక్ష‌ల‌ను పెద్ద ఎత్తున నిర్వ‌హించ‌డం, కొవిడ్ పాజిటివ్ గా తేలిన ప్ర‌తి ఒక్క వ్య‌క్తి విషయంలో తీసుకోవ‌ల‌సిన త‌దుప‌రి చ‌ర్య‌ల‌ను శ్ర‌ద్ధ‌గా తీసుకోవ‌డం, అంతేకాకుండా స్థానిక ప్ర‌జ‌ల్లో విశ్వాసాన్ని పెంచే చ‌ర్య‌ల‌ను చేప‌ట్టడం.. ఇవ‌న్నీ జిల్లాలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య దిగి రావ‌డానికి తోడ్ప‌డ్డాయ‌ని క‌లెక్ట‌ర్ అన్నారు.  జిల్లా వైద్య‌, ఆరోగ్య శాఖ అధికారుల‌కు, రెవెన్యూ అధికారుల‌కు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల‌కు సిద్ధిపేట లో గ్రామాలు, వార్డుల వారీగా బాధ్య‌త‌లను అప్ప‌గించి, ప్ర‌తి రోజూ కొవిడ్ వ్యాధిగ్ర‌స్తుల కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడుతూ ఉండవలసిందిగా సూచించామ‌ని క‌లెక్ట‌ర్  పి. వెంక‌ట్రామ రెడ్డి చెప్పారు.  తెలంగాణ లో యాక్టివ్ కేసులు గ‌రిష్ట సంఖ్య‌లో న‌మోద‌వుతున్న ఎనిమిది జిల్లాల్లో హైద‌రాబాద్‌ జిల్లా, మేడ్చ‌ల్‌- మ‌ల్కాజ్‌గిరి, రంగారెడ్డి, క‌రీంన‌గ‌ర్‌, నిజామాబాద్‌, సంగారెడ్డి, వరంగ‌ల్ అర్బ‌న్ జిల్లాల‌తో పాటు సిద్ధిపేట జిల్లా కూడా ఉంది. కాగా మొబైల్ వీడియో వ్యాన్ ప్రారంభ కార్య‌క్ర‌మంలో పిఐబి, ఆర్ఒబి, దూర్‌ద‌ర్శ‌న్‌, ఆకాశ‌వాణిల అధికారుల‌తో పాటు జిల్లా పాల‌న యంత్రాంగానికి చెందిన  అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply