ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ని, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్,కుర్మయ్యగారి నవీన్ కుమార్,చల్లా వెంకట్రామిరెడ్డి .. గురువారం నాడు ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి తమ కృతజ్జతలు తెలిపారు. ఈ సందర్భంగా వారిని బిఆర్‌ఎస్ అధినేత, సిఎం కేసీఆర్ ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16 : ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు ముగ్గురూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారంతో ముగిసింది. అయితే ఇతర పార్టీల నుంచి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో అధికార పార్టీ తరపున నామినేషన్లు దాఖలు చేసిన దేశపతి శ్రీనివాస్, నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి ఈ ముగ్గురు ధ్రువీకరణ పత్రాలను అందుకున్నారు. తెలంగాణ కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ సిద్దిపేట జిల్లా మునిగడపలో దేశపతి గోపాలకృష్ణశర్మ, బాల సరస్వతి దంపతులకు 1970లో జన్మించారు. స్వరాష్ట్ర సాధనలో ఉద్యమ నాయకుడు కేసీఆర్ నిర్వహించిన వేలాది సభలు, ర్యాలీల్లో దేశపతి పాల్గొన్నారు. తెలంగాణ సాధన అనంతరం ఉద్యోగానికి రాజీనామా చేసి, ప్రస్తుతం సీఎం ఓఎస్డీగా పని చేస్తున్నారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన కుర్మయ్యగారి నవీన్‌కుమార్ 1978 మే 15న కొండల్‌రావు, తిలోత్తమ దంపతులకు జన్మించారు.
నవీన్‌కుమార్ తాత రామచంద్రరావు గతంలో మంత్రిగా పనిచేశారు. మేనమామ సుదర్శన్‌రావు టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. విద్యార్థి దశ నుంచే నవీన్‌కు రాజకీయాలంటే ఆసక్తి. 2001 నాటి జలదృశ్యం ఆవిర్భావసభ మొదలుకుని టీఆర్‌ఎస్ నిర్వహించిన అన్ని సమావేశాల్లో నవీన్ పనిచేశారు. కూకట్‌పల్లి హైదర్‌నగర్‌లో సొంత ఖర్చులతో వేంకటేశ్వర ఆలయాన్ని నిర్మించారు. 2019 మేలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ మార్చిలో పదవీకాలం పూర్తవనున్నది. ఆయన సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్.. నవీన్‌కుమార్‌కు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనవడు కూతురు కొడుకు అయిన చల్లా వెంకట్రామిరెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు గ్రామ ప్రెసిడెంట్ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
అనంతరం 2004 నుంచి 2009 వరకు అలంపూర్ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. గత డిసెంబర్‌లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ క్రమంలో చల్లా వెంకట్రామిరెడ్డికి సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు.