Take a fresh look at your lifestyle.

త్వరంలో మరో మినీ సంగ్రామం

“ఒక విధంగా రాష్ట్ర రాజధానిలో ఇటీవల జరిగిన గ్రేటర్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికలు అధికార, ప్రతిపక్షాల మధ్య  యుద్ధవాతావరణాన్ని తలపించాయి. అదే క్రమంలో ఇప్పుడు మరో మినీ యుద్ధ వాతావరణానికి రాష్ట్రం సిద్దం కాబోతున్నది. రెండు ఎమ్మెల్సీలతో పాటు, ఒక శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్‌, ‌రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ‌పట్టభద్రుల స్థానంతో పాటు, వరంగల్‌, ‌ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నిక మార్చ్‌లో జరుగనుండగా ఇప్పటి నుండే రాష్ట్రంలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు విస్తృత ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.”

త్వరలో మరో మినీ సంగ్రామం జరుగబోనుంది. ఒక విధంగా రాష్ట్ర రాజధానిలో ఇటీవల జరిగిన గ్రేటర్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికలు అధికార, ప్రతిపక్షాల మధ్య  యుద్ధవాతావరణాన్ని తలపించాయి. అదే క్రమంలో ఇప్పుడు మరో మినీ యుద్ధ వాతావరణానికి రాష్ట్రం సిద్దం కాబోతున్నది. రెండు ఎమ్మెల్సీలతో పాటు, ఒక శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్‌, ‌రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ‌పట్టభద్రుల స్థానంతో పాటు, వరంగల్‌, ‌ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నిక మార్చ్‌లో జరుగనుండగా ఇప్పటి నుండే రాష్ట్రంలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు విస్తృత ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్‌, ‌రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ‌పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని గతంలో భారతీయ జనతాపార్టీ గెలుచుకుంది. ఇప్పుడు తన స్థానాన్ని పదిలపర్చుకోవడంతో పాటు, వరంగల్‌, ‌ఖమ్మం, నల్లగొండ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవాలని ఆ పార్టీ తీవ్రస్థాయిలో కృషి చేస్తోంది. గతంలో ఈ స్థానాన్ని టిఆర్‌ఎస్‌ ‌గెలుచుకోగా, ఆ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ ఇక్కడ రెండవ స్థానంలో నిలిచింది. ఈ స్థానంలో గెలుపొందిన టిఆర్‌ఎస్‌ ‌నాయకుడు, రైతు సమన్వయ సమితి నాయకుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి తన స్థానాన్ని పదిలపర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఆయన ఇప్పటికే మూడు జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ పట్టభద్రులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. జీహెచ్‌ఎం‌సీ, అంతకు ముందు దుబ్బాక ఎన్నికల్లో తమ సత్తా చాటుకున్న భారతీయ జనతాపార్టీ ఎట్టి పరిస్థితిలో ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని మరో సారి టిఆర్‌ఎస్‌కు దక్కకూడదన్న లక్ష్యంగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. అయితే ఇంతవరకు ఆ పార్టీ నుండి ఇక్కడ ఎవరు పోటీ చేస్తారన్నది ఇంకా ప్రకటించకపోయినా ప్రచారాన్ని మాత్రం విస్తృతం చేస్తున్నారు. అయితే పార్టీ మంచి ఊపులో ఉండడంతో ఆపార్టీ నేతలు పలువురు పోటీకి సిద్ధమవుతున్నారు. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తున్నప్పటికీ మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, మనోహర్‌రెడ్డి, మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎమ్మెల్యే పొంగులేటి సుధాకర్‌రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యుడు గరికపాటి రామ్మోహన్‌రావుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ రెండు పార్టీలే కాకుండా ఈసారి తెలంగాణ జనసమితి వ్యవస్థాపకుడు ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌కూడా స్వయంగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించడంతో ఈ ఎంఎల్‌సి స్థానంలో రసవత్తరమైన పోటీ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరితోపాటు టివీ ఛానల్‌ ‌ద్వారా విస్తృత ప్రచారంలో ఉన్న తీన్మార్‌ ‌మల్లన్న కూడా రంగ ప్రవేశం చేయడం మరింత రసపట్టుకు చేరకోబోతోంది. అధికార పక్ష తప్పులను ఎత్తిచూపడంలో ప్రతిపక్షాలు విఫలమవుతుండడం వల్లే తాను రంగంలోకి దిగాల్సి వొచ్చిందంటున్న మల్లన్న స్వతంత్ర అభ్యర్థిగా ఇప్పటికే ప్రచారంలో ముందు వరుసలో నిలిచాడు.
సిపిఐ, సిపిఎంఎల్‌ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించబడిన జయసారథ్‌రెడ్డితో పాటు, రాణి రుద్రమరెడ్డి, చెరుకు సుధాకర్‌ ‌లాంటి వారు కూడా తమ వంతు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇదీలా ఉంటే హైదరాబాద్‌, ‌రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ‌పట్టభద్రుల స్థానంలో గెలిచిన బిజెపి సీనియర్‌నేత రాంచందర్‌రావు తన స్థానాన్ని నిలుపుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంటే, ఈసారి అధికార పార్టీ వరంగల్‌  ‌స్థానంతో పాటు ఆ స్థానాన్ని కూడా దక్కించుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే అనూహ్యంగా ఈ ఎన్నికల్లో తాను పోటీచేస్తున్నట్లు మాజీ ఎంఎల్‌సి, ప్రోఫెసర్‌ ‌నాగేశ్వర్‌ ‌ప్రకటించడంతో ఈ స్థానంలో ఎన్నిక కూడా ఆసక్తికరంగా మారబోతున్నది. తెలంగాణ రాష్ట్ర సమితి ఈ స్థానంలో ఎవరిని నిలబెట్టేది ఇంకా ప్రకటించలేదు. దుబ్బాక, జీహెచ్‌ఎం‌సీలలో తీవ్రంగా దెబ్బతిన్న టిఆర్‌ఎస్‌ ఇక్కడ అభ్యర్థి విషయంలో ఆచితూచి అడుగేసే అవకాశముంది. తమ పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెడుతుందా లేక రాష్ట్రంలో అందరికీ సుపరిచితుడైన నాగేశ్వర్‌కు మద్ధతిస్తుందా అన్న అనుమానం కూడా ప్రచారంలో ఉంది. ఈ రెండు ఎన్నికలతో పాటు నాగార్జున సాగర్‌ ‌శాసనసభ ఉప ఎన్నిక కూడా ఇదే సమయంలో జరుగనుండడంతో  రాష్ట్రం ఇప్పుడు మినీ ఎన్నికల సంగ్రామాన్ని తలపించబోనుంది. ఈ స్థానానికి కూడా మార్చ్‌లో నోటిఫికేషన్‌ ‌రానుంది. ఇది టిఆర్‌ఎస్‌ ‌సిట్టింగ్‌ ‌స్థానం.
స్థానిక ఎంఎల్‌ఏ ‌నోముల నర్సింహయ్య అకస్మాత్తుగా మృతిచెందడంతో ఈ ఖాళీ ఏర్పడింది. దుబ్బాకలో లాగానే కుటుంబ సభ్యులకే టికెట్‌ ఇవ్వాలా, వేరే వారికివ్వాలా అన్న ఆలోచనలో టిఆర్‌ఎస్‌ ఉం‌ది. రాష్ట్ర మంత్రి జగదీష్‌రెడ్డి ఇలాకా కావడంతో ఇక్కడ నిలబెట్టే అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత ఇప్పుడు ఆయన భుజస్కందాలపై ఉంది. పూర్వం ఇది కాంగ్రెస్‌ ‌స్థానం కాబట్టి కాంగ్రెస్‌ ‌కూడా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఉత్సాహ పడుతోంది. కాంగ్రెస్‌లో సీనియర్‌ ‌నాయకుడు, మాజీమంత్రి జానారెడ్డి స్వంత నియోజకవర్గం కావడంతో ఆయనే స్వయంగా పోటీలోకి దిగితే ఇక్కడ కూడా పోటీ రసవత్తరంగా మారనుంది. కాగా, దబ్బాకలాగా ఈ స్థానాన్ని ఎలాగూ తామే గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్న బిజెపి పక్షాన పోటీ చేసేందుకు పలువురు ఆసక్తిని కనబరుస్తున్నారు.
మండువ రవీందర్‌రావు

Leave a Reply