- ఓటమి భయంతో పోటీకి ముందుకు రాని నేతలు
- ఉపాధ్యాయులు, అడ్వకేట్లు, నిరుద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత
రాష్ట్రంలో త్వరలో జరుగనున్న ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలలో పోటీ చేసేందుకు అధికార పారీ నేతలు అంతగా ఆసక్తి చూపించడం లేదని సమాచారం. గత కొంత కాలంగా ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోవడం, ఉపాధ్యాయులు, అడ్వకేట్లు, నిరుద్యోగులలో ఆ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉండటం వంటి కారణాలతో నేతలు పోటీకి జంకుతున్నారు. త్వరలో రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ నియోజకవర్గం నుంచి బీజేపీ నేత ఎన్.రాంచందర్‌రావు, వరంగల్, ఖమ్మం నియోజకవర్గాల నుంచి టీఆర్ఎస్ నుంచి డా.పల్లా రాజేశ్వరరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఇద్దరి పదవీ కాలం మరో రెండు మూడు నెలల్లో ముగియనుంది. దీంతో ఈ ఎన్నికలకు సంబంధించి బరిలో ఎవరు ఉంటారనే చర్చ టీఆర్ఎస్లో ప్రారంభమైంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలలో అధికార పార్టీ నుంచి అప్పటి టీఎన్జీవో అధ్యక్షుడు జి.దేవీప్రసాదరావు బరిలో నిలవగా, ఆయనకు ప్రత్యర్థిగా బీజేపీ నేత ఎన్.రాంచందర్‌రావు నిలిచారు. ఈ నియోజకవర్గంలో యువకులలో టీఆర్ఎస్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉండటంతో పాటు స్వయంగా అడ్వకేట్ అయిన రాంచందర్‌రావుకు అడ్వకేట్లలో మంచి పేరు ఉండటం, ఎన్నికలకు చాలా ముందు నుంచే ఆయన వోటర్లను ఎన్రోల్ చేయడంతో దేవీప్రసాద్‌పై భారీ మెజార్టీతో విజయం సాధించారు. రెండేళ్ల క్రితం కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, జీవన్‌రెడ్డి అధికార పార్టీ అభ్యర్థిపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. టీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థి విజయం కోసం ఎన్ని ఎత్తులు వేసినప్పటికీ వాటన్నింటిని తట్టుకుని జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీగా విజయం సాధించారు.
ఈసారి కూడా ఆయన విజయానికి నిరుద్యోగులు, యువకులలో టీఆర్ఎస్ పట్ల ఉన్న ఆగ్రహమే కారణమైంది. ఇక త్వరలో జరుగనున్న హైదరాబాద్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలోనూ ఇవే ఫలితాలు పునరావృతం అయ్యే పరిస్థితి నెలకొని ఉందని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం నల్లగొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిద్యం వహిస్తున్న పల్లా రాజేశ్వరరెడ్డి మరోసారి పోటీకి అంతగా ఆసక్తి చూపడం లేదని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. గత కొంత కాలంగా వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను టీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీ చేయకపోవడం, నాలుగైదేళ్లుగా ఉపాధ్యాయుల డీఏను పెంచకపోవడంతో పాటు ఆ అంశాన్ని ప్రభుత్వం నానబెడుతుండటంతో ఉపాధ్యాయులు టీఆర్ఎస్పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇక న్యాయవాదులు కూడా అధికార టీఆర్ఎస్ పట్ల అంతగా అనుకూలంగా లేరనీ, దీంతో అధికార పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి దిగి ఓటమి పాలు కావడం కంటే పోటీకి దూరంగా ఉండటమే మేలని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అధికార పార్టీ నుంచి పోటీకి అవకాశం వచ్చినప్పటికీ ఓటమి పాలయితే, ఇక తమ రాజకీయ భవిష్యత్తు ముగిసినట్లేనని గులాబీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
ఇక హైదరాబాద్ నియోజకవర్గం విషయానికి వస్తే….ఈ నియోజకవర్గంలోని మూడు జిల్లాలలో విద్యావంతులైన నిరుద్యోగులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉంది. ఇక్కడి విద్యార్థులు టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు, త్వరలో జీహెచ్ఎంసి, వరంగల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండి నగర పాలక సంస్థల ఎన్నికలలో అదృష్టాన్ని పరీక్షించుకుంటే కాలం కలసి వస్తే మేయర్ లేదా కనీసం కార్పొరేటర్ పదవి అయినా దక్కక పోతుందా అనే ఆలోచనలో అధికార పార్టీ నేతలు ఉన్నట్లు సమాచారం. దీంతో పేరున్న నేతలు కాకుండా ద్వితీయ శ్రేణి నేతలు ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార పార్టీ నుంచి పోటీకి ముందుకు వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీవర్గాలలో జోరుగా చర్చ సాగుతోంది.