Take a fresh look at your lifestyle.

ఊపందుకున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

యువత, నిరుద్యోగులే అభ్యర్థుల టార్గెట్‌
‌గెలుపుపై ఎవరి ధీమా వారిదే

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఖమ్మం, వరంగల్‌, ‌నల్లగొండ, హైదరాబాద్‌, ‌రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ‌నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఆయా నియోజకవర్గాలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత తొలిసారి జరిగిన ఖమ్మం, వరంగల్‌, ‌నల్లగొండ పట్టభద్రుల నియోకవర్గాన్ని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి, హైదరాబాద్‌ ‌రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ‌పట్ఠభద్రుల నియోజకవర్గాన్ని రాంచందర్‌రావు గెలుచుకున్నారు. వీటిలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అధికార టీఆర్‌ఎస్‌తో పాటు ప్రధాన ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్‌ ఇం‌కా అభ్యర్థులను ప్రకటించలేదు. ఖమ్మం స్థానం నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డినే తిరిగి అభ్యర్థిగా నిలపాలనే ఆలోచనలో టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఉండగా, ఆయన మాత్రం అందుకు అంతగా సుముఖంగా లేరనే ప్రచారం జరుగుతున్నది.

మూడు జిల్లాలలో ఉన్న పరిచయాలు, అనుచరగణంతో పాటు అర్ధబలం పుష్కలంగా ఉన్న కారణంగా పార్టీ అభ్యర్థిగా పల్లా అయితేనే విజయం సాధించడం సాధ్యమవుతుందని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ‌భావిస్తున్నట్లు సమాచారం. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి ఎవరైనప్పటికీ పల్లా సమర్థంగా ఎదుర్కొని విజయం సాధిస్తారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఈ స్థానం నుంచి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌, ఇం‌టి పార్టీ అభ్యర్థి డా.చెరుకు సుధాకర్‌, ‌యువ తెలంగాణ పార్టీ అభ్యర్థి రాణి రుద్రమ రెడ్డి, తీన్మార్‌ ‌మల్లన్న ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సిపిఐ, సిపిఎం అభ్యర్థిగా జయసారధి రెడ్డి కూడా తనదైన శైలిలో ప్రచారం సాగిస్తున్నారు. ఈ అభ్యర్థులంతా ప్రతీ రోజూ మూడు జిల్లాలలో ఏదో ఒక చోట సభలు, సమావేశాలు నిర్వహిస్తూ వోట్లను అభ్యర్థిస్తున్నారు. తమనే గెలిపించాలని పట్టభద్రులకు విజ్జప్తి చేస్తున్నారు.

- Advertisement -

ప్రధానంగా టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం పట్టభద్రులు, నిరుద్యోగులు, యువత సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదనీ, నిరుద్యోగుల పక్షాన శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే తమనే గెలిపించాలని కోరుతున్నారు. ప్రభుత్వం వివిధ శాఖలలో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన యువత, నిరుద్యోగులను విస్మరించి ప్రభుత్వం వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యక్ష రాజకీయాలలో మొదటిసారిగా ఎన్నికల బరిలో నిలచిన టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ ‌తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన అనుభవంతో వోటర్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే, ఇంటి పార్టీ అభ్యర్థి డా.చెరుకు సుధాకర్‌ ‌సైతం టీఆర్‌ఎస్‌ ‌నేతగా తెలంగాణ ఉద్యమంలో పని చేసిన అనుభవాన్ని తన గెలుపు కోసం వినియోగిస్తున్నారు.

ఇక యువ తెలంగాణ పార్టీ అభ్యర్థి రాణి రుద్రమ సైతం తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన తనను గెలిపించాలని వోటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే, ఈ ముగ్గురు అభ్యర్థులు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతుండటంతో గెలుపు ఎవరిని వరిస్తుందో అనే ఉత్కంఠ మొదలైంది. తమదంటే తమదే గెలుపని ఈ అభ్యర్థులంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు, ఈ ముగ్గురు అభ్యర్థులు కేవలం పట్టభద్రులు, నిరుద్యోగ యువకులనే టార్గెట్‌గా చేసుకుని ప్రచారం నిర్వహిస్తుడటంతో ప్రభుత్వ వ్యతిరేక వోట్లు చీలి చివరికి అధికార పార్టీకి లాభిస్తుందా అనే సందేహాలు సైతం తలెత్తుతున్నాయి. ఇక హైదరాబాద్‌, ‌రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ‌పట్టభద్రుల నియోజకవర్గంలో బీజేపీ నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ రాంచందర్‌రావు తిరిగి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన గానీ, బీజేపీ గానీ అధికారికంగా ప్రకటించలేదు. ఇక అధికార టీఆర్‌ఎస్‌ ‌పార్టీ మాజీ ఎమ్మెల్సీ ప్రొ.నాగేశ్వరరావుకు మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం ఉంది. దీనిపై టీఆర్‌ఎస్‌ ఇప్పటికే ఆయనను సంప్రదించిందనీ, అందుకు ఆయన అంగీకారం తెలిపినట్లు సమాచారం. అయితే, వామపక్ష భావ జాలం కలిగిన ప్రొ.నాగేశ్వరరావుకు టీఆర్‌ఎస్‌ ‌మద్దతు ఇస్తుందనే ప్రచారంలో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

Leave a Reply