Take a fresh look at your lifestyle.

మళ్ళీ ఎన్నికల కలకలం

రాష్ట్రంలో మరోసారి ఎన్నికల కలకలం మొదలైంది. ఇటీవల హుజురాబాద్‌ ‌నియోజకవర్గ ఉప ఎన్నిక తంతు ముగిసిందో లేదో ఎన్నికల సంఘం ఎంఎల్సీ ఎన్నికల నగారా మోగించింది. ఈటల రాజేందర్‌ ‌రాజీనామాతో ఏర్పడిన హుజురాబాద్‌ ఉప ఎన్నిక  గత అయిదు నెలలుగా ఒక సంగ్రామంలా ముగిసింది. ఈ ఎన్నికలో విజయ పతాక ఎగురవేయాలని దాదాపు అన్ని పార్టీలు పోటీపడడంతో ఇదొక మినీ సార్వత్రిక ఎన్నికలను తలపించింది. చివరకు గెలిచేది ఎవరో ఒకరే అయినా, అ ఎన్నికల్లో అధికార పార్టీకి శృంగభగం కలిగింది. అలా అ ఎన్నికల కోలాహలం ముగిసిందో లేదో ఇప్పుడు స్థానిక సంస్థల ఎంఎల్‌సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ ‌విడుదలవటంతో మరోసారి రాష్ట్రమంతా ఎన్నికల హడావిడి చోటుచేసుకోనుంది. ఏపిలోని పదకొండు స్థానాలతోపాటు, తెలంగాణలోని పన్నెండు స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసింది.

ఆదిలాబాద్‌ ‌వరంగల్‌, ‌నల్లగొండ, మెదక్‌, ‌నిజామాబాద్‌, ‌ఖమ్మం స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారి పదవీ కాలం జూన్‌ ‌మూడవ తేదీతో ముగిసింది. కాగా మరికొందరి పదవీకాలం జనవరి నాలుగవ తేదీతో ముగియనుంది. అయినా అన్నిటికీ కలిపి ఎన్నికల సంఘం ఒకేసారి షెడ్యూలు జారీ చేయడంతో రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికల వేడి పుంజుకున్నట్లు అయింది. మొత్తం మీద పన్నెండు స్థానాలకు గాను ఆనేక మంది ఆశావహులు చకోరపక్షుల్లా ఎదురు చూస్తూ కూర్చున్నారు. ఇప్పటికే వారు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించినా పార్టీ అధినేత కెసిఆర్‌ ‌మదిలో  ఏముందో ఎవరికీ అంతుబట్టని విషయం. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తమ పార్టీని పటిష్టపర్చుకోవడంలో భాగంగా పార్టీ అధినేత హోదాలో కెసిఆర్‌ ఇతర పార్టీల నుండి వొచ్చిన వారికి చాలా మందికి పదవుల విషయంలో హామీల వర్షం కురిపించారు. దాంతో పాత, కొత్త వారిని కలిపి ఆశావహుల జాబితా కొండవీటి చేతాడంతగా తయ్యారైంది.

ఇందులో ఎవరెవరికి అవకాశం లభిస్తుందన్నది కెసిఆర్‌కే తెలియాలి. అయితే ఈ ఎన్నికలు ఎలాగూ వొస్తాయి కనుక అభ్యర్థులెవరెవరిని ఎంపిక చేయాలన్న విషయాన్ని ఇప్పటికే అధినేత ఖరారు చేసి పెట్టుకున్నట్లు వార్తలు వొస్తున్నాయి. తాజా మాజీల్లో మరోసారి అవకాశం ఎవరికి లభిస్తుంది, కొత్తవారెవరికి పదవి దక్కుతుందన్న పలు ఊహాగానాలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. ఆశావహుల్లో చాలా మంది సీనియర్‌ ‌నాయకులు కావడంతో ఎవరిని తీసేసేటట్లు లేదు. ప్రధానంగా అందరి నోళ్ళలో నానుతున్నది కడియం శ్రీహరి పేరు. అటు తెలుగుదేశం హయాంలో వరంగల్‌ ‌జిల్లానుండి తొమ్మిదేళ్ళు మంత్రిగా కొనసాగిన శ్రీహరి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉప ముఖ్యమంత్రి, తాజా మాజీ ఎంఎల్‌సిగా ఉన్నారు. ఆయనకు మరో అవకాశం లభిస్తుందనుకుంటున్నారు.  అయితే ఇదే వరంగల్‌ ‌జిల్లానుండి బోడికుంట వెంటేశ్వర్లు, మధుసూదనాచారి కూడా పోటీ పడుతున్నారు. మధుసూదనాచారి అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన వ్యక్తి. పార్టీ ఆవిర్భావం నుండి అంటిపెట్టుకుని ఉన్నవాడు.

ఈసారి ఆయనకు అవకాశమిచ్చి మండలి చైర్మన్‌ ‌పదవిని కట్టబెడుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు మండలి చైర్మన్‌గా కొనసాగిన గుత్తా సుఖేందర్‌రెడ్డికి మరో అవకాశమిచ్చి, మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన పార్టీ మారినప్పుడే ఆ హామీ పొందినట్లు తెలుస్తున్నది. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాత్మకంగా మారిన హుజురాబాద్‌ ‌నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా అటు ఈటల రాజేందర్‌ను, ఇటు కాంగ్రెస్‌ ‌పార్టీని దెబ్బతీసే వ్యూహాంలో భాగంగా  స్థానిక కాంగ్రెస్‌ ‌నేత పాడి కౌషిక్‌రెడ్డిని తమ పార్టీలోకి అహ్వానించిన కెసిఆర్‌ ఆయన్ను ఎంఎల్‌సిగా చేసే హామీ ఇచ్చిన విషయం బహిరంగ రహస్యమే.

ఈ విషయంలో గవర్నర్‌ ‌కోటా కింద ఆయన్ను ఎంఎల్‌సిగా తీసుకునే అవకాశం బెడిసి కొట్టడంతో ఇప్పుడు ఏర్పడిన ఖాళీల్లో ఆయనకు తప్పకుండా అవకాశం లభించే అవకాశం లేకపోలేదు. అలాగే  మరో ప్రధాన పార్టీ తెలుగుదేశానికి రాష్ట్రంలో సారథ్యం వహిస్తున్న ఎల్‌. ‌రమణను కారెక్కించే విషయంలో కూడా అలాంటి హామీనే ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉంటే వరంగల్‌ ‌జిల్లాకు చెందిన తక్కళ్ళపల్లి రవీందర్‌రావు చాలా కాలంగా ఎంఎల్‌సి పదవి కోసం కాచుకుని కూర్చున్నారు. తెరాస రాష్ట్ర కార్యదర్శిగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న రవీందర్‌రావుకు ఇప్పటికే అనేక అవకాశాలు తప్పిపోవడంతో, ఈసారైనా అవకాశం లభిస్తుందనుకుంటున్నారు. అయితే వరంగల్‌ ‌నుండి ఈ పదవిని ఆశిస్తున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఎంతమందికి కెసిఆర్‌ ఆశిస్సులుంటాయన్నది ప్రశ్న. వాస్తవంగా ఇప్పటివరకు టిఆర్‌ఎస్‌ ‌తన అభ్యర్థులను గెలిపించుకుంటుందనడంలో ఎలాంటి సందేహంలేదు. అంతటి సంఖ్యాబలం ఆ పార్టీకి ఉంది. అయితే హుజురాబాద్‌ ఎన్నికల నేపథ్యంలో మారుతున్న సమీకరణలను దృష్టిలో పెట్టుకుని, భవిష్యత్‌లో పార్టీ బలోపేతానికి ఎవరికి అవకాశం ఇవ్వాలన్నదానిపైనే కెసిఆర్‌ ‌కసరత్తు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Leave a Reply