- ఉద్యోగులు, నిరుద్యోగులను నిండా ముంచిన టీఆర్ఎస్
- ఎమ్మెల్సీ అభ్యర్థి డా.చెరుకు సుధాకర్
తెలంగాణ బాధలు తెల్వనోడు బంగారు తెలంగాణ పేరుతో పబ్బం గడుపుకుంటున్నాడనీ, బంగారు తెలంగాణ నేతల మాటలు ఇకపై చెల్లవని వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి డా.చెరుకు సుధాకర్ అన్నారు. ఇప్పటికే తెలంగాణ ఎంతో నష్టపోయిందనీ, ఇకపై నష్టం జరగకుండా ఉండాలంటే ఉద్యమ శక్తులన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని మమతా ఫంక్షన్ హాల్లో అనంతుల మధు అధ్యక్షతన జరిగిన పట్టభద్రుల సమరభేరి సభకు డా.సుధాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్టాడిన యువతను ఆగం బట్టించిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఘోర అబద్ధాలతో ప్రచారం చేసుకుంటున్నాడని విమర్శించారు.
ప్రజా సమస్యలను పక్కదోవ పట్టించడానికి పడరాని పాట్లు పడుతున్న టీఆర్ఎస్ నేతల బాగోతాలను నిరుద్యోగులు గమనిస్తున్నారనే విషయాన్ని మరచిపోవద్దని హెచ్చరించారు. ఉద్యోగులు తమ హక్కులను కాపాడుకోవడానికి, ఆత్మ గౌరవ నినాదంతో తలెత్తుకుని నిలబడాలంటే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలలో తనకు మొదటి ప్రాధాన్యత వోటు వేసి గెలిపించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో వోటు అనే ఆయుధం ద్వారా మాత్రమే బలమైన గొంతుకకు పట్టం కట్టవచ్చని ఆయన స్పష్టం చేశారు. బహుజన యుద్ధనౌక ఏపూరి సోమన్న మాట్లాడుతూ కేసీఆర్ చంద్రబాబు సంకలో చేరినప్పుడే అనేక నిర్బంధాలను ధిక్కరిస్తూ తెలంగాణ వాదాన్ని బుజానికి ఎత్తుకున్న ఘనత డా.సుధాకర్‌కు దక్కిందన్నారు.
నాడు తెంగాణ రాష్ట్ర సాధన కోసం నేడు ఉద్యమ ఆకాంక్షల కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న చెరుకు సుధాకర్‌కు ఉద్యోగులు, నిరుద్యోగులు, యువత అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఇంటి పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ వెదిరె చల్మారెడ్డి మాట్టాడుతూ సబ్బండ వర్ణాల సమస్యలు తెలిసినోడు, బడుగుల సాధక బాధకాలు తెలిసిన డా.సుధాకర్‌ను శానస మండలికి పంపాల్సిన బాధ్యత సకల జనులపై ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి పిడి యాక్టు ఎదుర్కొన్న ఏకైక నేత చెరుకు సుధాకర్ ఎదుగుదలను తట్టుకోలేకనే ప్రొ.కోదండరామ్ పోటీకి దిగుతున్నారని విమర్శించారు. ఈ సభలో కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి గాజుల శ్రీనివాస్, ఇంటి పార్టీ నేతలు లక్ష్మి, బత్తుల సోమయ్య, బిసి విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తదితర విద్యార్థి సంఘ నేతలు పాల్గొన్నారు.