Take a fresh look at your lifestyle.

‌ ఆ జిల్లా కలెక్టర్‌ ‌కు ఎమ్మెల్సీ సీటు కన్ఫామ్‌..!

‌సిఎం కేసీఆర్‌ ‌చెప్పడమే ఆలస్యం..
ఉద్యోగానికి రాజీనామా చేయనున్న కలెక్టర్‌ ‌వెంకట్రామరెడ్డి?
నేడో, రేపో ఐఏఎస్‌ ‌పదవీ రాజీనామా చేయనున్న వెంకట్రామరెడ్డి


సిద్ధిపేట, నవంబర్‌ 14 (‌ప్రజాతంత్ర బ్యూరో): సిద్ధిపేట జిల్లా కలెక్టర్‌గా పని చేస్తున్న పరపతి వెంకట్రామరెడ్డి(ఐఏఎస్‌)‌తన ఉద్యోగానికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు అత్యంతమైన విశ్వసనీయవర్గాలు ఆదివారమిక్కడ ‘ప్రజాతంత్ర’ప్రతినిధికి వివరించాయి. రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెంకట్రామరెడ్డికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎమ్మెల్సీ సీటును కేటాయించినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యేల కోటాలోనా, స్థానిక సంస్థల కోటాలోనా..గవర్నర్‌ ‌కోటాలోనా మొత్తానికి తెలియదు కానీ ఆయనకు మాత్రం ఎమ్మెల్సీ సీటు కన్ఫామ్‌ అయిందని విశ్వసనీయ సమాచారం. దీంతో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారనీ సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇవ్వడమే తరువాయి…తన ఐఏఎస్‌ ఉద్యోగానికి రాజీనామా చేయనున్నారనీ తెలుస్తుంది. ఎమ్మెల్సీల జాబితా అనౌన్స్‌ను బట్టి ఈ నెల 15న లేక 26న వెంకట్రామరెడ్డి తన పదవీకి రాజీనామా చేసే అవకాశం ఉందనీ సమాచారం. సిద్ధిపేట జిల్లా ఏర్పడినప్పటి నుంచి కలెక్టర్‌గా అధికార బాధ్యతలు నిర్వహిస్తున్న కలెక్టర్‌ ‌వెంకట్రామరెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా చేయాలని గత కొంత కాలంగా భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే, విషయాన్ని ఒకట్రెండు సందర్భాల్లో కూడా కలెక్టర్‌ ‌వెంకట్రామరెడ్డి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. సమయం, సందర్భం వచ్చినప్పుడు రాజీనామా చేద్దువు అని సిఎం కేసీఆర్‌ ‌వెంకట్రామరెడ్డికి చెప్పుకుంటూ వచ్చినట్తు తెలుస్తుంది. ఆ సమయం ఇప్పుడు రానే వచ్చిందనీ సమాచారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం…కొత్త జిల్లాగా సిద్ధిపేట ఏర్పడటం…కలెక్టర్‌గా వెంకట్రామరెడ్డి నియమితులు కావడం..ఇదే జిల్లాలో సిఎం కేసీఆర్‌, ‌మరో ముఖ్యమైన రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు ఉండటమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాలేశ్వరం ప్రాజెక్టులలో భాగంగా చంద్లాపూర్‌ ‌సమీపంలో రంగనాయకసాగర్‌ ‌రిజర్వాయర్‌, ‌తొగుట మండలంలో మల్లన్నసాగర్‌ ‌రిజర్వాయర్‌, ‌హుస్నాబాద్‌లో గౌరవెల్లి ప్రాజెక్టు, మర్కూక్‌ ‌మండలంలో శ్రీ కొండపోచమ్మ రిజర్వాయర్లను నిర్మించాలని సిఎం కేసీఆర్‌ ‌సంకల్పానికి జిల్లా కలెక్టర్‌గా వెంకట్రామరెడ్డి రాత్రింబవళ్లు శ్రమించారు. ప్రాజెక్టులకు కావల్సిన వేలాది ఎకరాల భూమిని సేకరించడంలో కలెక్టర్‌గా వెంకట్రామరెడ్డి కీలకపాత్రను పోషించారు. అనేక సందర్భాల్లో సిఎం కేసీఆర్‌ ‌చేత ప్రశంసలు కూడా పొందారు. ప్రాజెక్టుల నిర్మాణంలో కలెక్టర్‌ ‌వెంకట్రామరెడ్డి పాత్ర మరువలేనిదంటూ ప్రశంసించడమే కాకుండా కేసీఆర్‌ ‌ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ ‌నియోజకవర్గంకు కలెక్టర్‌ ‌వెంకట్రామరెడ్డే ఎమ్మెల్యే అని మాట్లాడిన సందర్భాలున్నాయి. సిఎం కేసీఆర్‌ ‌నోట ఏనాడైతే కలెక్టర్‌ ‌వెంకట్రామరెడ్డే గజ్వేల్‌ ఎమ్మెల్యే అని వచ్చిందో…ఆ మాట త్వరలోనే ఎమ్మెల్సీ రూపంలో నెరవేరే రోజు రానేవచ్చిందనీ అంటున్నారు. స్వతహాగా తెలంగాణ అంటే ఇష్టపడే కలెక్టర్‌ ‌వెంకట్రామరెడ్డికి తెలంగాణ రావాలని ఎంత బలంగా కోరుకున్నారో…అంతే బలంగా సిద్ధిపేట జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధి, సంక్షేమం కోసం రాత్రింబవళ్లు పని చేశారు. దీంతో అటు సిఎం కేసీఆర్‌, ఇటు మంత్రి హరీష్‌రావు వద్ద మంచి మార్కులు సంపాదించారు. ప్రశంసలు పొందారు. తెలంగాణపై వెంకట్రామరెడ్డికి ఉన్న కమిట్‌మెంటు, రాజకీయాల పట్ల ఆసక్తితో సిఎం కేసీఆర్‌ ‌వెంకట్రామరెడ్డికి ఎమ్మెల్సీ సీటును కేటాయించినట్లు తెలుస్తుంది. మొత్తం మీద నేడే, రేపో వెంకట్రామరెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా చేయనుండటం తథ్యంగా కనిపిస్తుంది.
…………………………………………………………………………………………………………………………..

Leave a Reply