బిఎల్ సంతోష్, జగ్గు స్వామిలకు నోటీసులపై 13 వరకు స్టే పొడిగింపు
హైదరాబాద్, డిసెంబర్ 5(ఆర్ఎన్ఎ):ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజింగ్) బీఎల్ సంతోష్ , కేరళ వైద్యుడు జగ్గు స్వామికి సిట్ ఇచ్చిన 41 సీఆర్పీసీ నోటీసులపై స్టే ఆర్డర్ ను తెలంగాణ హైకోర్టు డిసెంబరు 13 వరకు పొడిగించింది. సిట్ నోటీసులను సవాల్ చేస్తూ.. వాటిపై స్టే ఇవ్వాలని కోరుతూ వారిద్దరు దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు విచారించింది. నోటీసులపై ఈనెల 13 వరకు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే బీఎల్ సంతోష్ కేసులో కౌంటర్ దాఖలుకు సమయం ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోరారు.
దీంతో వారికి సమయం ఇచ్చేందుకు కోర్టు అంగీకరించింది. తదుపరి విచారణను ఈనెల 13కు వాయిదా వేసింది.అంతకుముందు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ ముఖ్య నేత బీఎల్ సంతోష్ కు సిట్ నవంబరు 23న నోటీసులు జారీచేసింది. కానీ సంతోష్ విచారణకు రాలేదు. ఈ నోటీసులపై బీఎల్ సంతోష్ అప్పట్లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. నవంబరు 25న బీఎల్ సంతోష్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సిట్ జారీ చేసిన నోటీసులపై స్టే విధించింది. డిసెంబరు 5 వరకు స్టే కొనసాగుతుందని కోర్టు ప్రకటించింది. ఈ తరుణంలో బీఎల్ సంతోష్ కు ఇచ్చిన స్టే ఆర్డర్ ను ఈనెల 13 వరకు హైకోర్టు పొడిగించింది.